రేవంత్‌రెడ్డి ఇంటిపై అటాక్.. లోక్‌సభలో ప్రివిలేజ్ నోటీస్!
posted on Sep 23, 2021 @ 12:39PM
ఉన్నట్టుండి గుంపుగా ఊడిపడ్డారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటిపై దాడికొచ్చారు. సడెన్‌గా ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేయడంతో రేవంత్ అనుచరులు వెంటనే అప్రమత్తమయ్యారు. తమ నాయకుడి ఇంటిపై దాడి చేసేందుకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. వారిని అక్కడి నుంచి తరిమి కొట్టారు. తన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకున్నారు. జరిగింది ఇదీ. వీడియో దృశ్యాల్లోనూ ఆ విషయం స్పష్టంగా కనిపించింది. కానీ, పోలీసులకే సగం సగం కనిపించినట్టుంది. వాళ్లు ఒకవైపే చూస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టారంటూ రేవంత్‌రెడ్డి అనుచరులపైనే కేసులు పెట్టి.. అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పీసీసీ చీఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
కేవలం కాంగ్రెస్ వారిపైనే కేసులు పెడతారా? టీఆర్ఎస్ వారిపై కేసులు ఉండవా? అని ప్రశ్నిస్తే.. పోలీసుల దగ్గర సమాధానం లేదు. అసలు రేవంత్ ఇంటిపైకి గులాబీ దళాన్ని ఉసిగొల్పిందెవరు? ఎవరి ప్రోద్బలంతో వాళ్లు పీసీసీ చీఫ్ ఇంటి మీదకొచ్చారు? వచ్చింది వాళ్లైతే.. వెళ్లగొట్టిన వారిపై మాత్రమే కేసులు ఎలా పెడతారు? ఇలా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాకీలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడుతున్నారు. ఇక.. ఈ విషయాన్ని ఇలానే వదిలిపెడితే ముందుముందు మరిన్ని వన్‌సైడ్ యాక్షన్స్ చూడాల్సి వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇష్యూని మరింత సీరియస్‌గా తీసుకుంది. ఒక ఎంపీ అయిన రేవంత్‌రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం సంచలనంగా మారింది.
‘‘టీపీసీసీ అధ్యక్షుడు, పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి నివాసం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. ఆ అధికారుల తీరును నిరసిస్తూ లోక్‌సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాం’’ అని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. తెలంగాణలో నెలకొన్న ఈ తీవ్రమైన పరిస్థితుల విషయంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తన నివాసంపై దాడి చేసిన టీఆర్‌ఎస్ గూండాలను అరెస్టు చేయడానికి బదులుగా.. ఆ దాడిని ప్రతిఘటించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను నిర్బంధించారంటూ రేవంత్ చేసిన ట్వీట్‌ను ఠాగూర్ పోస్ట్ చేశారు.
కాగా, రేవంత్‌రెడ్డి ఇంటిపైన టీఆర్‌ఎస్ కార్యకర్తలను దాడికి ప్రేరేపించిన మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ నెల 7న జలవిహార్‌లో జరిగిన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై దాడి చేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారని, దాని ఫలితమే రేవంత్ నివాసంపై దాడికి యత్నించారని తెలిపింది. టీఆర్ఎస్, పోలీస్ తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించింది.