రేవంత్ రెడ్డి అప్రూవర్? కోర్టులో కేసుకు తెదేపా దీర్ఘాలోచన
posted on Jun 13, 2015 @ 1:23PM
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగానే జరుగుతుంది. దీనిలో భాగంగానే స్టీవెన్ సన్ తో చంద్రబాబునాయుడు మాట్లాడిన సంభాషణలు ఆడియో రికార్డింగులు.. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడిన ఆడియో, వీడియో రికార్డింగులు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లాయి. ఈ రికార్డింగులకు సంబంధించిన నివేదిక కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో రానుంది. కాగా మరోవైపు రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇచ్చిన 50. లక్షల డబ్బు గురించి.. మిగిలిన 4.5 కోట్లు గురించి... రేవంత్ బాస్ అని ఎవరిని సంభోదించారు అని సమాచారం తెలుసుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఆ నివేదిక కూడా వచ్చిన తరువాత.. స్టీఫెన్ సన్ స్టేట్ మెంట్ కూడా తీసుకేవండం ఆలస్యం ఏసీబీ చంద్రబాబుతో పాటు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే ప్రయత్నలో ఉంది. ఏసీబీ కాని స్టీఫెన్ సన్ నుండి స్టేట్ మెంట్ తీసుకున్నట్టయితే ఏసీబీ చేతిలో మూడు ఆప్షన్ లు ఉన్నాయి. 1. స్టీపెన్ సన్ ఎవరి పేర్లు చెపుతాడో వారికి నోటీసులు 2. వాళ్ల ఇళ్లకి వెళ్లి సోదాలు 3. లేదా ప్రశ్నాపత్రాలే వాళ్లకి పంపించడం.
మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తమతో పాటు మరో 200 మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురయ్యాయని ప్రధాని నరేంద్రమోడీకి విన్నవించగా కేంద్రం కూడా ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పై లీగల్ యాక్షన్ తీసుకునే సమాలోచనలో పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది సరైనది కాదని అందువల్ల న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే దీర్ఘాలోచనలో తెదేపా నేతలు ఉన్నారు. అంతేకాక హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని సెక్షన్ 8 ప్రకారం బాధ్యతలు గవర్నర్ కి అప్పగించాలని కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కేంద్రంతో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని వెతికే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వినికిడి.. ఒక వేళ తను అప్రూవర్ గా మారితే తెదేపా రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కేసు వల్ల ప్రస్తుత రాజకీయలు గరంగరంగా తయారవుతున్నాయి అనడంలో సందేహం లేదు. రోజుకో మలుపు.. రోజుకో వార్త.