కేసీఆర్ మీద ఆ కేసు పెట్టని పోలీసులను కోర్టుకీడుస్తాం
posted on Feb 5, 2022 @ 3:57PM
కేసీఆర్ చేసిన రాజ్యాంగ రచన కామెంట్లను బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మలచుకునేందుకు తెగ పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరికాస్త క్రియేటివిటీగా ఆలోచించినట్టున్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండగా... రేవంత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి కేసీఆర్ చేసిన కామెంట్లు చాలా తీవ్రమైనవి.. ఈ రాజ్యాంగమే పనికిరాదు... కొత్త రాజ్యాంగం రాసుకోవాలని కోరుతున్నాడంటే ఆయన ఈ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టేనని అంటున్నారు. ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఎన్నికై ఈ రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ ఈ రాజ్యాంగమే పనికిరాదంటున్నాడని, ఆ వ్యాఖ్యలు దేశద్రోహం కిందికే వస్తాయని, అందుకని ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ ను అరెస్టు చేయాలంటూ ఏకంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లోనే కంప్లయింట్ చేశారు. పోలీస్ స్టేషన్ లో సిఐ వీరప్రసాద్ కు భారత రాజ్యాంగం పుస్తకాన్ని కూడా అందజేశారు. దేశద్రోహం సెక్షన్ల కింద ఏయే క్లాజులున్నాయి.. ఎలాంటి కామెంట్లు చేస్తే దేశద్రోహం కిందికి వస్తాయో వివరిస్తూ కేసీఆర్ ను అరెస్టు చేయాలని కోరారు. అంతేకాదు.. కేసీఆర్ కామెంట్లను యథాతథంగా ప్రచురించిన, ప్రసారం చేసిన టీన్యూస్, నమస్తే తెలంగాణ పేపర్లపైనా దేశద్రోహం కేసులు పెట్టాలని సీఐని కోరడం విశేషం. అంతేకాదు... తమ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అంతటా కేసీఆర్ మీద అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేస్తామని, ఒకవేళ ఎవరైనా పోలీస్ అధికారు కేసు నమోదు చేయకపోతే కోర్టు తలుపు తడతామని కూడా డిక్లేర్ చేశారు. మొత్తానికి తానేదో ఊహించి రాజ్యాంగం మీద కామెంట్లు చేసిన కేసీఆర్ కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలతో తన ఇమేజ్ కు తీవ్రమైన విఘాతమే కలిగిందంటున్నారు విశ్లేషకులు. ఇక బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ ప్రదర్శనల్లో ఇంకెవరు ఎలాంటి క్రియేటివ్ ఆలోచనలతో ముందుకొస్తారో చూడాలి.