తప్పు సరిదిద్దాను.. ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై ఎలాన్ మస్క్
posted on Nov 26, 2022 @ 11:51AM
ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాక ఖాతాదారులతో ఉన్న ట్విట్టర్ ఎలాన్ మస్క్ పుణ్యమా అని కనీవినీ ఎరుగని గందరగోళంలో పడిపోయింది. సంస్థలో ఉద్యోగులకు భద్రత లేదు. పని గంటలు పెరిగిపోయాయి. పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉద్వాసనకు గురయ్యారు.
రిప్ ట్విట్టర్ పోస్టులతో సామాజిక మాధ్యమం హోరెత్తింది. అయినా ఎలాన్ మస్క్ తగ్గేదేలే అంటున్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టి పట్టడంతోనే అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగులపై వేటుతో మొదలు పెట్టి.. ఉన్న ఉద్యోగులపై పనిఒత్తిడి పెంచేయడంతో ట్విట్టర్ సిబ్బంది స్వచ్చంద రాజీనామాలతో క్యూ కట్టారు. అయినా ఏం ఫరలేదు కొత్త వారికి కొలువులిస్తామంటూ ఎలాన్ మస్క్ తన ధోరణిలో తాను ముందుకు సాగుతున్నారు. అంతేనా త్వరలోనే ట్విట్టర్ 2.0ను తీసుకొస్తామంటున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించిన సందర్భంగా మాట్లాడిన ఆయన ఒక దేశ అధ్యక్షుడి హోదాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బ్యాన్ చేయడం ట్విట్టర్ చేసిన ఘోరమైన తప్పు అన్నారు. 2021 జనవరి 6న అధ్యక్ష ఎన్నిక సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. క్యాపిటల్ భవనంలోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. వారిని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ట్రంప్ చేసిన ట్వీట్లు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్విట్టర్ ఆయన ఖాతాని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. మస్క్ తిరిగి వచ్చాక.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు.
కానీ.. ట్విట్టర్ కు తిరిగి రావడానికి ట్రంట్ ఇష్టపడలేదు.అక్కౌంట్ ను మస్క్ పునరుద్ధరించినా ఒక్కట్వీట్ కూడా చేయలేదు. దీనిపై మస్క్ ట్రంప్ ట్వీట్లు చేయడం లేదు. అయినా పర్వాలేదు. ఒక ఘోరమైన తప్పును ట్విట్టర్ సరిదిద్దుకోవడమనేది చాలా ముఖ్యమైన విషయం. అది నేను చేశారు. దేశాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఖాతాను బ్యాన్ చేయడం వల్ల అమెరికాలోని సగం మంది ప్రజల విశ్వాసాన్ని ట్విట్టర్ కోల్పోయింది.అన్నాడు. మరి ఇంతగా ట్రంప్ ను పొగిడి మునగ చెట్టు ఎక్కించిన ఎలాన్ మస్క్ కోసమేనైనా ట్రంప్ మళ్లీ ట్విట్టర్ లోకి వస్తాడేమో చూడాలి.