ముందస్తుకే మొగ్గు.. అందుకే ఉద్యోగ ప్రకటన, ప్రారంభోత్సవాలతో కేసీఆర్ పరుగు
posted on Nov 26, 2022 @ 12:18PM
దక్షిణాదిలో ఎంట్రీకి తెలంగాణ గేట్ వే అని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారు. అందుకే తెలంగాణలో దూకుడు పెంచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు, ఒక అసెంబ్లీ సీటు గెలుచుకోవడంతో బీజేపీ పెద్దల కన్ను తెలంగాణపై బాగానే పడింది. తర్వాత దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీలో ఊహించనన్ని సీట్లు గెలుచుకోవడంతో తెలంగాణపై బీజేపీ దృష్టి మరింతగా సారించింది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో 86 వేలకు పైగా ఓట్లు సాధించడంతో మరింతగా దూకుడు పెంచింది. మొన్న కోమటి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా కమలం కండువా కప్పుకున్నారు. శశిధర్ రెడ్డి బాటలో మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బీజేపీ డబుల్ ఇంజిన్ మోడీ- షా జోడీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా తెలంగాణ ప్రజల నాడి తెలుసు.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచి విజయ ఢంకా మోగిస్తాం. బీజేపీ అధికారం చేపడుతుంది. నేనే స్వయంగా తెలంగాణకు వెళ్లి బీజేపీని గెలిపిస్తా అన్నారు. బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో అమిత్ షా తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
బీజేపీ నేతల వ్యాఖ్యలు, తెలంగాణ సీనియర్ నేతలు కమలం పార్టీలో వరుసగా చేరుతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీని రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ దూకుడుకు ముకుతాడు వేయడంతో పాటు రాష్ట్రంలో హ్యాట్రిక్ గెలుపు కొట్టాలంటే ముందస్తే మందు అని ఆయన ఫిక్స్ అయ్యారని పార్టీ వర్గాలే అంటున్నాయి. అందుకే పరిపానలలో కేసీఆర్ దూకుడు పెంచారంటున్నారు. టీఆర్ఎస్ కీలక నేతలకు ఇప్పటికే గులాబీ బాస్ ముందస్తు సంకేతాలు ఇచ్చారంటున్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ.. ముందస్తు ముచ్చటే లేదు అని కేసీఆర్ ఇటీవలే కుండబద్దలు కొట్టారు. అయినప్పటికీ తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వకుండా గండి కొట్టాలంటే.. ఆ పార్టీ నేతలకు ఎన్నికల ప్రణాళిక వేసుకునే సమయం ఇవ్వకూడదంటే.. ముందస్తే బెటర్ అని కేసీఆర్ నిర్ణయించారని ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. పరిపాలనలో దూకుడు పెంచడం, ఈ డిసెంబర్ లోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం, తాజాగా 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కేసీఆర్ ముందస్తు ఎన్నికల సన్నాహాలే, సంకేతాలే అంటున్నారు రాజకీయ పండితులు. అసెంబ్లీని ఏ నిమిషంలో అయినా రద్దు చేయాలనే గులాబీ బాస్ స్కెచ్ వేసినట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ వరకు ఆగితే.. ఆ లోగా బీజేపీ మరింత మంది సీనియర్ నేతల్ని ఆపరేషన్ ఆకర్ష్ చేసుకుంటే.. ఎన్నికల్లో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని కేసీఆర్ భావన. ఆ అవకాశం కమలం పెద్దలకు ఇవ్వకూడదని కేసీఆర్ బలంగా డిసైడ్ అయ్యారంటున్నారు. దీంతో పాటు 2023 డిసెంబర్ దాకా ఆగితే.. 2024 మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే యోచన బీజేపీ పెద్దలు చేస్తున్నట్లు కేసీఆర్ కు అనుమానం ఉందంటున్నారు. ఆ ఛాన్స్ బీజేపీకి ఇవ్వకూడదంటే.. ముందస్తు ఎన్నికలు ఒక్కటే మందు అని గులాబీ బాస్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్, మేనెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ప్రణాళిక వేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. జనవరి చివరిలో లేదంటే ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసినా.. కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించేందుకు మూడు నెలల సమయం సరిపోతుందని కేసీఆర్ స్కెచ్ అంటున్నారు.
అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ లో నిర్వహించిన అనంతరం కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్, ఎన్టీఆర్ ఘాట్ పక్కనే ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించాలని డిసైడ్ అయ్యారంటున్నారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సంక్రాంతిని ముహూర్తంగా నిర్ణయించారని సమాచారం. అమరుల స్మారకాన్ని కూడా అదే రోజు ప్రారంభించేందుకు పనులు జరుగుతున్నాయంటున్నారు. డిసెంబర్ తొలి వారం నుంచే జిల్లా కలెక్టరేట్ల భవనాలకు వరుస ప్రారంభోత్సవాలు చేసేలా సీఎం కేసీఆర్ షెడ్యూల్ రెడీ అయింది. ఆ సందర్భంగానే భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారంటున్నారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్ల నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక లాంటివన్నీ వచ్చే మార్చి నెలలోగా పూర్తిచేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తథ్యం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.