Read more!

తూచ్ పదవీ విరమణ పెంపు అందరికీ కాదు.. వారికి మాత్రమే.. ఏపీ సర్కార్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జగన్ సర్కార్ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అరకొరగానే.. వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉంటుందన్నది విదితమే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు విషయంలో కూడా అదే చేసిందని స్పష్టమైంది.

ఈ విషయంపై ఆర్ధిక శాఖ జారీ చేసిన సర్క్యులర్ మెమోలో పదవీ విరమణ పెంపు  రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వేతనాలు తీసుకుంటున్న స్థానిక సంస్థలు, రాష్ట్ర సచివాలయం, శాసన పరిషత్ ఉద్యోగులు, అధికారులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. న్యాయాధికారులు, గ్రామ అధికారులు మినహా 309 అధికరణ కింద నియమితులైన ఉద్యోగులు అధికారులకు మాత్రమే పదవీ విరమణ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

కాగా 62 ఏళ్ల ఉద్యోగ విరమణ పెంపు వర్తిస్తుందంటూ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో ఆదేశాలు ఇవ్వటం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థలు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఆదేశాలు ఇవ్వజాలరని స్పష్టం చసింది.

ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా పదవీ విరమణ పెంపు నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. అలా చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఏపీ ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ మెమో జారీ చేశారు. ఈ వ్యవహారంపై జరిగిన ఉల్లంఘనలపై నివేదిక పంపాలంటూ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 30వ తేదీ లోగా ఆర్ధికశాఖకు ఇందుకు సంబంధించిన నివేదికను పంపాలని కోరుతూ సర్కులర్ మోమో ఇచ్చింది.