Read more!

ఈ ఆలోచ‌న మ‌హారాష్ట్ర‌తోనే ఆపుతారా..!

మ‌హారాష్ట్ర ఆర్ధికాభివృద్ధి ఫ‌లాలు అందుకునేలా అభివృద్ధి బాట‌లోకి ముస్లింల‌ను తేవాల‌న్న ల‌క్ష్యంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అస‌లు రాష్ట్రంలో ముస్లింల జ‌నాభా లెక్క తేల్చ‌మ‌ని టాటా ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ సోష‌ల్ సైన్స‌స్‌(టిస్‌)కి బాధ్య‌త‌లు అప్ప‌జెప్పింది. ఈ ప్రాజెక్టుపై ప‌నిచేయ‌డానికి ప్ర‌భుత్వం రూ.33.92 ల‌క్ష‌లు కేటాయించింది.

ముస్లింల విద్యా, ఆర్ధిక‌, సామాజిక స్థాయిని, ప‌రిస్థితుల‌ను మ‌రింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకే ఈ కార్య క్ర‌మం  చేప‌ట్టామ‌ని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  అంతేగాక టిస్ తో పాటు ప్ర‌భుత్వ అధికా రులు కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొంటార‌ని తెలిపారు.

అయితే ఇపుడు ఈ ఆలోచ‌న చేయ‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌న్న‌ది విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. మ‌హారాష్ట్ర లో చేప‌ట్టాల‌నుకుంటున్న ఈ ప్రాజెక్టు ఇత‌ర రాష్ట్రాల‌కూ విస్త‌రిస్తార‌న్న అనుమానాలూ విప‌క్షాలు వ్య‌క్తం చేస్తున్నాయి.  వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండా చేసుకోవాల‌ని మ‌హా ప్ర‌భుత్వం ఆలోచ‌న చేసింది. అయితే ఇది కేవ‌లం మ‌హారాష్ట్ర‌కే ప‌రిమిత‌మ‌వుతుందా బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రా ల‌కీ విస్త‌రిస్తారా అన్న‌ది చూడాలి. బీజేపీ యేత‌ర పార్టీల పాల‌న‌లోని రాష్ట్రాల్లో రాజ‌కీయంగా గంద‌ర‌గోళం సృష్టించి ఆ త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైన‌దంటూ ప్ర‌చారం చేయ‌డం అవ‌మానించ‌డం బీజేపీ నాయ‌కుల‌కు ప‌రిపాటిగా మారింది. 

ఇటీవ‌లి కాలంలో బీజేపీ సీనియ‌ర్ నేత‌లు బీజేపీయేత‌ర పార్టీల రాష్ట్రాల పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ నేప‌థ్యంలో చూస్తే అన్ని రాష్ట్రాల్లోనూ ముస్లింల జ‌నాభా విష యంలో కూల‌క‌షంగా చ‌ర్చించ‌డ‌మో, వివ‌రాలు సేక‌రించ‌డానికో పూనుకున్న‌ట్టే ఉంద‌ని విశ్లేష‌కుల మాట‌. 

ఇప్ప‌టికే బీజేపీ మ‌త‌రాజ‌కీయాల‌తో దేశంలో ఐక్య‌త‌ను దెబ్బ‌తీస్తోంద‌న్న అప‌వాదు ఎదుర్కొంటున్న‌ది. అయిన‌ప్ప‌టికీ ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వ‌ర‌కూ త‌మ ఆలోచ‌న‌ను అమ‌లు చేయ‌డానికే బీజేపీ నాయ కులు కంక‌ణం క‌ట్టుకున్నారు. దేశ‌భ‌క్తి పేరుతో ఇప్ప‌టికే అనేక‌ప్రాంతాల్లో చాలాకాలం నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌త విభ‌జ‌న‌కు పాల్ప‌డుతోంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇపుడు మ‌ళ్లీ మ‌హారాష్ట్ర‌లో ఈ విధంగా ముస్లిం జ‌నాభా విష‌యంలో నివేదిక తెప్పించుకోవాల‌న్న ఆలోచ‌న ఏమేర‌కు స‌బ‌బు అవుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.