నాగ‌పూర్‌లో రోహిత్ ప‌రుగుల వ‌ర‌ద‌...భార‌త్ విజ‌యం

వ‌ర్షం, ఔట్‌ఫీల్డ్ బాగోలేక‌పోవ‌డంతో ఆల‌స్యంగా ఆరంభ‌మైన రెండ‌వ టీ-20 మ్యాచ్‌లో భార‌త్ 6వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ స‌మం చేసింది. మూడ‌వ, చివ‌రి మ్యాచ్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డుతున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నాగ‌పూర్‌లో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న బ్యాటింగ్ స‌త్తా ప్ర‌ద‌ర్శించాడు. మ్యాచ్ 20 ఓవ‌ర్లు కాకుండా జ‌ట్టు ఎనిమిదేసి ఓవ‌ర్లు ఆడేట్టు, 16 ఓవ‌ర్ల‌కు ఆట‌ను కుదించారు. ఆసీస్ 8 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 90 పరు గులు చేసింది. భార‌త్ ఇన్నింగ్స్‌లో ఇంకా నాలుగు బంతులు ఉండ‌గానే,  4 వికెట్ల న‌ష్టానికి 92 ప‌రుగులు చేసింది. 

భార‌త్ టాస్ గెలిచి ఆసీస్‌కు బ్యాటింగ్ కి అవ‌కాశం ఇచ్చింది. పాండ్యా మొదటి ఓవ‌ర్లో ప‌ది ప‌రుగులు ఇచ్చాడు. కెప్టెన్ ఫించ్ ముందునుంచే దూకుడుగా ఆడ‌టం ఆరంభించాడు. రెండో ఓవ‌ర్ కే స్పిన్న‌ర్ అక్ష‌ర్ రంగంలోకి వ‌చ్చాడు. రాగానే అద్భుతం చేసాడు. వ‌రుస‌గా మూడు, నాలుగు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆసీస్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ 19 ప‌రుగులే ఉంది. అయితే మూడో ఓవ‌ర్‌కి మ‌రో స్పిన్న‌ర్ చాహ‌ల్ వ‌చ్చాడు. కానీ ఫించ్ అత‌న్ని బాగానే ఆడుకున్నాడు. మూడో బంతికే సిక్స్‌కొట్టి త‌న ప్ర‌త్యేక‌త చాటాడు. అక్ష‌ర్ త‌న రెండో ఓవ‌ర్లో మ‌ళ్లీ వికెట్ తీసేడు. మొదటి బంతికే డేవిడ్ వికెట్ కోల్పో యాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ 3 వికెట్ల న‌ష్టానికి 31 ప‌రుగులు ఉంది. త‌ర్వాత ఎంతో మంచి ఫామ్‌లో ఉన్న వేడ్ బ్యాటింగ్‌కి వ‌చ్చాడు. టీ-20 జ‌ట్టులోకి వ‌చ్చిన పేస‌ర్ బుమ్రా మొద‌టి ఓవ‌ర్‌లోనే 11 ప‌రుగులు ఇచ్చాడు. కానీ చివ‌రి బంతికి మంచి యార్క‌ర్‌తో ఫించ్‌ని పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. దీంతో ఆసీస్ 4 వికెట్ల న‌ష్టానికి 46 ప‌రుగులు చేసింది. 

అత‌ని త‌ర్వాత స్మిత్ వ‌స్తూనే మంచి షాట్స్ ఆడాడు. హ‌ర్ష‌ల్ వేసిన 6వ ఓవ‌ర్లో 11 ప‌రుగులు ఇచ్చు కున్నాడు. త‌ర్వాత బుమ్రా కూడా 12 ప‌రుగులు ఇవ్వడంతో ఆసీస్ 7 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 71 ప‌రుగులు చేసింది. చివ‌రి ఓవ‌ర్ ర్ష‌ల్ వ‌చ్చాడు. రెండో బంతికే  వేడ్ భారీ సిక్స్ కొట్టాడు. 8వ ఓవ‌ర్ ఆసీస్ ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్లో 19 ప‌రుగులు సాధించారు. వేడ్‌, స్మిత్‌లు క‌లిసి 14 బంతుల్లో 32 ప‌రుగులు చేశారు. అలా ఆసీస్ 5 వికెట్ల న‌ష్టానికి 90 ప‌రుగులు చేశారు. అక్ష‌ర్ త‌న 2 ఓవ‌ర్ల‌లో 16 ప‌రుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 

91 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన భార‌త్ 8వ ఓవ‌ర్ రెండో బంతికే ల‌క్ష్యం సాధించింది. భార‌త్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎంతో నిల‌క‌డ‌గా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌టంలో భారీ సిక్స్‌లు, ఫోర్ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొ ట్టాడు. మొది ఓవ‌ర్లోనే భార‌త్ 20, రెండో ఓవ‌ర్లో 10 ప‌రుగులు చేసింది. 3 ఓవ‌ర్‌కి స్పిన్న‌ర్ జాంపా వ‌చ్చి రాహుల్ వికెట్ తీయ డంతో ఆసీస్ ప్లేయ‌ర్లు కొంత ఊపిరిపీల్చుకున్నారు. రాహులు 6 బంతుల్లో 10 ప‌రుగులు చేశాడు. త‌ర్వాత కోహ్లీ రావ‌డం జ‌ట్టు విజ‌యానికి దారితీస్తుంద‌నే అనుకున్నారు. కానీ నాలుగోఓవ‌ర్లో సామ్స్ ఓవ‌ర్లో దొరికిపోయాడు. అప్ప‌టికి జ‌ట్టుస్కోర్ 50కి చేరుకుంది. కోహ్లీ 6 బంతుల్లో 11 ప‌రుగులు చేశాడు.  త‌ర్వాత సూర్యా రాగానే లెగ్‌బిఫోర్ అయి జాంపాకు రెండో వికెట్‌గా దొరికి పోయాడు. అత‌ని స్థానంలో వ‌చ్చిన పాండ్యా కాస్తంత ధాటిగా ఆడుతూ కెప్టెన్‌కి స‌హ‌క‌రించ‌డంతో స్కోర్ పెరిగింది. కానీ 7వ ఓవ‌ర్లో క‌మిన్స్‌కి దొరికిపోయాడు. పాండ్య 9 బంతుల్లో 9 ప‌రుగులుచేశాడు. 

అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ విజ‌యావ‌కాశానికి కాస్తంత దూరంలో ఉంది. చివ‌రి 8వ ఓవ‌ర్లో 9 ప‌రుగులు కావాల్సి వ‌చ్చాయి. హిట్ట‌ర్‌, ఫినిష‌ర్‌గా పేరున్న దినేష్ కార్తీక్ వ‌చ్చాడు. రాగానే ఒక సిక్స్ బాదాడు. ఆ త‌ర్వాత బంతిని ఫోర్‌కి త‌ర‌లించ‌డంతో భార‌త్ విజ‌యం సాధించింది. అద్భుత బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శించిన రోహిత్ శ‌ర్మ 20 బంతుల్లో 46 పరుగుల‌తో అజేయంగా నిలిచాడు.  మూడ‌వ మ్యాచ్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది.

Advertising
Advertising