రైల్వే బడ్జెట్ గమ్యానికి చేరుతుందా!
posted on Feb 24, 2016 @ 10:42AM
దేశమంతా ఎదురుచూసే రైల్వే బడ్జట్ రేపు అవిష్కృతం కాబోతోంది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన బడ్జట్ ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారా అని సామాన్యులంతా ఆసక్తిగా ఉన్నారు. ఈసారి రైల్వే బడ్జట్‌లో కూడా ప్రయాణికుల మీద పెద్దగా భారాన్ని మోపబోమంటూ ముందుగానే సంకేతాలు అందించారు సురేష్ ప్రభు. అయితే మరి వేలకోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్న రైల్వేలని ఎలా గట్టెక్కిస్తారన్నది ఓ ముఖ్య సందేహం!
రైల్వేలు దేశానికి జవసత్వాలందించే వ్యవస్థలు. ప్రయాణాలు సాగాలన్నా, వ్యాపారం వృద్ధి చెందాలన్నా రైల్వేల అవసరం అంతా ఇంతా కాదు. అందుకే బ్రిటిష్‌వారు మన దేశం మీద అధికారాన్ని విస్తరించుకునేందుకు చేసిన మొట్టమొదటి పని రైల్వేలను విస్తరించడం. దురదృష్టవశాత్తూ అప్పట్లో వారు నిర్మించిన వంతెనలనే ఇప్పటికీ చాలాచోట్ల వాడుతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకూ వచ్చిన రైల్వే బడ్జట్లు చాలావరకు మౌలిక సదుపాయాల మీద శ్రద్ధ పెట్టలేదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునో, తమ రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకునో రూపకల్పన చేసినవే ఎక్కువ. తన పుట్టింటి నుంచి అత్తవారింటికి రైలు వేసుకున్న ఘనులు కూడా ఉన్నారు.
రైల్వే బడ్జెట్లో ఒక ప్రాజెక్టుని కానీ, కొత్త రైలుని కానీ, డబ్లింగ్ వంటి ఆధునీకరణ పనులను కానీ చేపట్టేటప్పుడు అది ఆర్థికంగా నష్టమా, లాభమా అన్న మాటను అటుంచితే... కనీసం వీలైనంత ఎక్కువ జనాభాకి ఉపయోగమా లేదా అని కూడా ఆలోచించకుండా ప్రతిపాదలను చేయడం సర్వసాధారణంగా మారింది. అలా తూతూమంత్రంగా మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏళ్లతరబడి సాగుతూ కాంట్రక్టర్లను పోషించాయే కానీ ప్రజలకి ఉపయోగం లేకుండా పోయాయి. పోనీ ఉన్న రైళ్లనన్నా సక్రమంగా నర్వహిస్తున్నారా అంటే ఆ దాఖలా కూడా కనిపించడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏళ్లు దాటిపోయినా మన రైళ్లు ఆలస్యానికీ, అపరిశుభ్రతకు, రద్దీకి మారుపేరుగానే ఉన్నాయి. వీటన్నింటికీ తోడు ఏటికేడు పెరిగిపోతున్న ఖర్చులు కూడా రైల్వేలకు పెనుభారంగా మారిపోతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టుల వల్లా, కాలం చెల్లిన యంత్రాల వల్లా, ఇంధనంలో వృధా వల్లా.... ఇలా రైల్వేల కుంటినడకకి వేల కారణాలు కనిపిస్తాయి. వీటికి తోడు ఇప్పడు 7వ వేతన కమీషన్ సిఫార్సులను కనుక అమలు చేస్తే ఉద్యోగులకు చెల్లించవలసిన జీతాల వల్ల రైల్వేల మీద 32,000 కోట్ల అదనపు భారం పడనున్నదని అంచనా! పోనీ ఆ మేరకు ఆదాయం పెరుగుతోందా అంటే అదీ కనుచూపు మేరలో లేదు.
పైన పేర్కొన్న విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిగారు ఈసారి బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. ప్రయాణికుల మీద పెనుభారం మోపకుండానే ఆదాయవనరులను పెంచుకోవాలనీ, రైల్వేలకు పునరుత్తేజం తీసుకురావాలనీ ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రవాణా మీద ఈసారి ఎక్కువ దృష్టిని పెట్టబోతున్నారట. రైల్వేలకు ముఖ్య ఆదాయవనరైన రవాణాలో తగిన వృద్ధిని ఇప్పటివరకూ సాధించలేకపోయారు. గత ఏడాదితో పోలిస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే రవాణా నుంచి ఆదాయం పెరిగింది. ఈ పరిస్థితిలో మార్పు రావల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇక కొత్త ప్రాజెక్టుల సంగతి అలా ఉంచి, ఇప్పటివరకూ ప్రతిపాదించిన ప్రాజెక్టులను వీలైనంతగా పూర్తిచేయడం కూడా మంచిది. ఇంధనాన్ని పొదుపుగా వాడేందుకు కూడా కొన్ని నిర్దుష్ట చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా రైల్వేలకు ఇతర ఆదాయ వనరులైన ప్రకటనలు, క్యాటరింగ్, పర్యాటకం... వంటి రంగాల అభివృద్ధి మీద మరింత శ్రద్ధ చూపాల్సిన సమయం వచ్చింది. అన్నింటికీ మించి ప్రయాణికులకు యాత్ర సాఫీగా సాగిపోయేలా... ఆహారం మొదలుకొని పరిశుభ్రత వరకూ మౌలికమైన సదుపాయాలని కల్పించే దిశగా ఈ రైల్వే బడ్జట్ కృషి చేస్తుందన్నది సగటు ప్రయాణికుడి ఆశ. మరి ఆ ఆశ ఎంతవేరకు నెరవేరనుందో తెలుసుకోవాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే! – శుభయాత్ర!