పిఠాపురంలో పవన్ విజయానికి జగన్ బాటలు!
posted on Jun 1, 2024 @ 4:09PM
ఎన్నికల ఫలితాలు సరిగ్గా మూడు రోజుల్లో వెలువడతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయని చెబుతున్నారు. అయితే సర్వేలు, అంచనాలూ తెలుగుదేశం కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఖాయమని చెబుతున్నాయి. పోలింగ్ తరువాత నుంచీ వైసీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వారికి కూడా రాబోయేది ఓటమే అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు ఘోర పరాజయం అన్న సంగతి తెలిసిపోయినట్లుగా కనిపిస్తోంది.
ఇక మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. సర్వత్రా ఎగ్జిట్ పోల్స్ పట్ల ఉత్కంఠ, ఉత్సుకత నెలకొంది. తెలిసిపోయిన ఫలితమే అయినా టీవీల్లో చూసి సరిపోల్చుకోవడంలో ఓ కిక్ ఉంటుంది. ఆ కిక్ కోసమే ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలే కాదు, ఈ సారి సామాన్య జనం కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే హాట్ సీట్లలో ఒకటిగా చెప్పుకుంటున్న పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి తీసుకుంటే.. ఇక్కడ ఎగ్జిట్ పోల్ పై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. తుది ఫలితంపై కూడా ఏమంత టెన్షన్ లేదు. ఉన్న టెన్షన్ అంతా ఇక్కడ పవన్ కల్యాణ్ కు వచ్చే మెజారిటీ ఎంత అన్నదే.
2019 ఎన్నికలలో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండింటిలోనూ పరాజయం పాలయ్యారు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో ఆయనను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న జగన్ పిఠాపురంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలోనే కాపు సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో జగన్ పవన్ ను ఓడించడానికి వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలూ అంతిమంగా పవన్ విజయానికి బాటలు వేశాయని చెప్పాలి. పవన్ ను ఓడించడమే లక్ష్యంగా జగన్ మిథున్ రెడ్డికి నియోజకవర్గ ప్రచార బాధ్యతలు అప్పగించారు. పవన్ ను తిట్టడమే లక్ష్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకుని మరీ ఆ పని అప్పగించారు. ఇక కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. అంతే కాదు.. ఎన్నికల ప్రచారం ముగింపు రోజున తన చివరి బహిరంగ సభ కూడా జగన్ పిఠాపురంలోనే నిర్వహించారు. అంతే కాదు వంగీ గీతను పిఠాపురం నుంచి గెలిపిస్తే ఆమెను ఉప ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు.
అయితే జగన్ వ్యూహాలూ ఎత్తుగడలూ అన్నీ పిఠాపురంలో పవన్ కు అనుకూలంగా మారాయని చెప్పవచ్చు. జగన్ ఒక విధంగా పవన్ పై దండయాత్ర చేస్తున్నారని జనం భావించారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వను అంటూ ప్రకటించి, అందుకు అనుగుణంగా అడుగులు వేసి, త్యాగాలకు కూడా సిద్ధపడిన పవన్ పల్ల ప్రజాభిమానం వెల్లువెత్తింది. అదే విధంగా పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఫ్యాక్టర్ తెలుగుదేశం ఓటు సజావుగా సాఫీగా జనసేనకు ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేసింది. ఈ అన్ని అంశాలూ కలిసి పిఠాపురంలో జనసేనాని గెలుపును సునాయాసం చేశాయి. ఇక్కడ ఇప్పుడు వైసీపీ క్యాడర్ కూడా పవన్ కల్యాణ్ కు ఎంత మెజారిటీ అన్న అంశంపైనే మాట్లాడుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.