పిన్నెల్లికి హైకోర్టులో ఊరట
posted on May 24, 2024 6:20AM
మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన హైకోర్టులో శుక్రవారం (మే23) ముందస్తు బెయిలు కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
అనంతరం హైకోర్టు జూన్ 6వ తేదీవరకూ పిన్నెల్లిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో జూన్ 6 ఉదయం పది గంటల వరకూ మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారించింది.
తాడిపత్రి తెలుగుదేశం అభ్యర్థి అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో, పిన్నెల్లి న్యాయం గెలిచింది అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు.