తీవ్ర ఆందోళన వల్లే నానికి అస్వస్థత!.. తేల్చేసిన వైద్యులు?
posted on May 24, 2024 @ 9:32AM
గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు శుక్రవారం కొద్ది సేపు హల్ చల్ చేశాయి. అయితే ఆ తరువాత తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ నాని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది పక్కన పెడితే కొడాలి నానికి ఇంతకు ముందు నుంచీ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. దాంతోనే కొడాలి నానికి తీవ్ర అస్వస్థత అనగానే అందరూ నమ్మారు. సరే తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ కొడాలి నాని ఆ వార్తలకు చెక్ పెట్టారు అది వేరే సంగతి.. కానీ విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కొడాలి నాని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులూ అక్కడే ఉన్నారు. శుక్రవారం( మే 23) కొడాలి నాని ఒక్కరే హైదరాబాద్ నుంచి గుడివాడ వచ్చారు. తన నివాసంలో నియోజకవర్గ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఒక్కసారిగా స్ఫృహ కోల్పోయారు. వెంటనే తేరుకున్నారు. వైద్యులు వచ్చి పరీక్షలు చేశారు. చాలా నీరసంగా ఉన్నారంటూ సెలైన్ కూడా పెట్టారు.
ఇంతకీ నాని ఒక్కసారిగా స్ఫృహ కోల్పోయి, అస్వస్థతకు గురి కావడానికి కారణమేంటి? అంటే వైద్యులు చెప్పిన దానిని బట్టి ఆయన తీవ్ర మానసిక వేదనలో ఉన్నారట. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారట. అది మానుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారట. ఇంతకీ ఆయన అంతగా ఆలోచిస్తున్నది దేని గురించి? ఆరోగ్యం చెడిపోయేంతగా ఆయన మానసికంగా ఎందుకు వేదన పడుతున్నారు? పరిశీలకులే కాదు.. ఆయన సన్నిహితులు, పార్టీ శ్రేణులూ సైతం కొడాలి నాని ఎన్నికల గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారనీ, విజయంపై అనుమానంతోనే తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారనీ అంటున్నారు.
కాగా ఆ విషయాన్ని జనం కూడా నమ్ముతున్నారు.
ఎందుకంటే చీటికీమాటికీ, అవసరం ఉన్నా లేకున్నా, సందర్భం అయినా అసందర్భమైనా కొడాలి నాని ఎప్పుడూ తెలుగుదేశంపైనా, ఆ పార్టీ అధినేతపైనా, అలాగే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పైనా తనకు మాత్రమే ప్రత్యేకమైన అనుచిత భాషలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి కొడాలి నాని ఎన్నికలు పూర్తయిన నాటి నుంచీ నోట మాట లేకుండా మౌనంగా ఉండిపోయారు. దీంతో ఆయన గుడివాడలో మరో సారి విజయం సాధించే అవకాశాలు లేవా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. పార్టీ శ్రేణులే ఈ సారి గుడివాడలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యం అన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో గుడివాడ నాని అస్వస్థతకు కారణం తీవ్రంగా ఆలోచించడం, మానసిక ఆందోళన అన్న వైద్యుల మాటలు వాస్తవమేనని అంటున్నారు.
ఇలా ఉండగా కొడాలి నానిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకువెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆయనను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాలని భావిస్తున్నారనీ..కొద్ది కాలం పాటు గుడివాడకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.