నాగార్జునకొండ కట్టడాలను సందర్శించిన టిబెట్ బౌద్ధ భిక్షువులు
posted on May 24, 2024 6:07AM
శ్రీ పర్వత విజయపురి చరిత్రను వివరించిన శివనాగిరెడ్డి
నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంకులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం వద్ద జరిగిన 2568వ బుద్ధ జయంతి వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న టిబెటన్ బౌద్ధ భిక్షువులు (విజయపురి సౌత్) అనుపు వద్దగల బౌద్ధ కట్టడాలను సందర్శించారని బుద్ధవనం కన్సల్టెంట్ మరియు ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం (మే23) బుద్ధ వనంలో బుద్ధ జయంతి సందర్భంగా మహాయాన సాంప్రదాయ ప్రకారం బుద్ధ వందనం కార్యక్రమం తర్వాత, ఆచార్య నాగార్జునుడు నడియాడిన శ్రీ పర్వత విజయపురి పరమ పవిత్ర స్థావరమని, బుద్ధునికి, ఆచార్య నాగార్జునకి, అనుపు బౌద్ధారామం వద్ద బౌద్ధ భిక్షువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మైసూరు సమీపంలోని బైలుకుప్పేలోని సెరా టిబెటన్ బౌద్ధారామానికి చెందిన గేషే నవాంగ్ జుంగ్నె మరియూ జంపాకుంగ అనే బౌద్ధ భిక్షులకు, నాగార్జునకొండలో తిరుగాడిన ఆచార్య నాగార్జునడు, శ్రీ పర్వత విజయపురిలో విలసిల్లిన ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ. 3వ శతాబ్దం) నాటి బౌద్ధ చరిత్ర, కట్టడాలు, శిల్పాలు, శాసనాలు, స్తూపాలు, చైత్యాలు, విహారాల గురించి శివనాగిరెడ్డి వివరించగా వారు ఆసక్తికరంగా విన్నారు.
బుద్ధ జయంతి రోజున నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, మహాయాన సిద్ధాంతకర్త, మాధ్యమిక, శూన్య వాదాలను స్థిరీకరించిన ఆచార్య నాగార్జునుడు తమకు అత్యంత గౌరవనీయుడని వారు చెప్పారని శివనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కి చెందిన వెంకటేశ్వర్లు, స్థానిక బౌద్ధాభిమానులు గ్రంధి రామకృష్ణ, నాగార్జున పాల్గొన్నారు. బౌద్ధ కట్టడాలను శ్రద్ధతో పరిరక్షిస్తున్న కమలహాసన్ ను వారు అభినందించారు.