జగన్ అయితే ఏంటి? మాజీ మంత్రి దాడి రాజీనామా.. పూతలపట్టు ఎమ్మెల్యే ఫైర్!
posted on Jan 2, 2024 @ 3:06PM
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో పార్టీ అస్థిత్వమే ప్రశ్నార్థకమయ్యే స్థాయిలో అసమ్మతి, అసంతృప్తి ప్రజ్వరిల్లుతోందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆర్కే రాజీనామాతో మొదలైన అసమ్మతి అలజడి రోజు రోజుకూ పెరుగుతోంది. ఆ అసంతృప్తి, అసమ్మతి వేడి సెగకు బెదిరిన తన నైజానికి భిన్నంగా సిట్టింగుల మార్పు కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి అసమ్మతీయులను బుజ్జగించి, సముదాయించే బాధ్యతలను రీజనల్ కో ఆర్డినేటర్లకు అప్పగించేసి వారికి ముఖం చాటేస్తున్నారు.
అయితే వైసీపీలో కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల మాట విని తగ్గండి అని అసమ్మతి ఎమ్మెల్యేలకు సూచించినా, వారు అందుకు సుముఖంగా లేరు. తమపై ప్రజా వ్యతిరేకత ఉంటే.. దానికి కారణం జగనే కనుక తమను నియోజకవర్గం నుంచి తప్పించడానికి కారణమేమిటో జగనే చెప్పాలని భీష్మిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఎదుటే నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. నిన్నటి దాకా జగన్ తనను తాను ప్రజాబాంధవుడిగా చెప్పుకుంటూ, పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎమ్మెల్యేలే అంటూ వారిని మార్చేస్తూ సేఫ్ గేమ్ ఆడదామనుకున్నారు. అయితే అత్యంత సహజంగా ఆయన ఆడదామనుకున్న సేఫ్ గేమ్ రివర్స్ అయ్యింది.
నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఎమ్మెల్యేలుగా తాము అనామకులుగా మారిపోయామనీ, ప్రజలలో ప్రభుత్వం పట్ల, తమ పట్ల అసమ్మతి, వ్యతిరేకత ఉంటే అందుకు పూర్తి బాధ్యత జగన్ దేననీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ జగన్ కు ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరైతే తమ అనుచరులతో సహా పార్టీకి రాజీనామాలు చేసేసి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉంటున్నారు. తమ రాజీనామా లేఖలలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ల పేరు కూడా ప్రస్తావించడం లేదు. జగన్ నిర్ణయాలను బాహాటంగా వ్యతిరేకించడానికి, ధిక్కరించడానికీ ఇసుమంతైనా వెనుకాడటం లేదు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏక వాక్య లేఖను ముఖ్యమంత్రి జగన్ కు పంపారు. అందులో తాను తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఒకే ఒక్క వాక్యం పేర్కొన్నారు. ఈ రాజీనామా ప్రతులను ఆయన ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి పంపారు. ఆ వాక్యంలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు.
అలాగే రాజీనామా ప్రతిని కూడా ఆయనకు పంపలేదు. తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన దాడి వీరభద్రరావు 1985 నుంచి 1999 వరకూ వరుసగా నాలుగు సార్లు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో ఆయన ఎన్టీఆర్ కేబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా పని చేశారు. వృత్తి రిత్యా హిందీ టీచర్ అయిన దాడి వీరభద్రరావును ఆయన అనుచరులు, అభిమానులు ప్రేమగా మాస్టారూ అని పిలుస్తారు. తన రాజీనామా లేఖలో అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు పేర్కొన్న దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఇక జగన్ ను ప్రశ్నలతో నిలదీసిన మరో ఎమ్మెల్యే.. అసంతృప్తికి మొత్తం కారణం జగన్ అయితే తనను నియోజకవర్గం మార్చడమేమిటని సూటిగా ప్రశ్నించారు. పూతలపట్టు ఎమ్మెల్్యే ఎంఎస్ బాబు వ్యతిరేకత పేరు చెప్పి తనకు జగన్ పార్టీ టికెట్ నిరాకరిస్తే అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ అంటే జగన్ మాత్రమేననీ, ఆయన తరువాత ఎవరికైనా ఏదైనా పని చేసే అవకాశం ఉందంటే వారు వాలంటీర్లు మాత్రమేనని పేర్కొన్న బాబు ఇప్పుడు అసంతృప్తి పేరు చెప్పి ఎమ్మెల్యేలను బలిచేయడమేమిటని జగన్ ను ప్రశ్నించారు. మీడియా సమావేశంలో నిర్మొహమాటంగా, నిష్కర్షగా ప్రజలలో ఉన్న వ్యతిరేకత అంతా జగన్ పైనే తప్ప ఎమ్మెల్యేలపై కాదని చెప్పారు. అయినా ప్రజల ముందుకు రాలేని ముఖ్యమంత్రి జగన్ ప్రజా వ్యతిరేకత తనపై లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పూతలపట్టు ఎమ్మెల్యేగా తాను జగన్ చెప్పిన ప్రతి పనీ చేశాననీ, గడపగడపకు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లాలని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు అసంతృప్తి అనేది ఉంటే అది తనపై కాదు, జగన్ పైనేనని స్పష్టంగా చెప్పేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ స్థాయిలో జగన్ పై ఫైర్ కావడం దాదాపు ఇదే తొలి సారి అని చెప్పవచ్చు. జగన్ అధికారం చేపట్టిన ఇన్నేళ్లల్లో ఒక్క సారి కూడా నియోజకవర్గ పరిస్థితి గురించి ఒక్కసారి కూడా పిలిపించి మాట్లాడలేదనీ, అసంతృప్తి పేరుె చెప్పి దళిత ఎమ్మెల్యేలను దగా చేస్తున్నారనీ విమర్శించారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ మంత్రి డొక్కా కూడా ఒక్క సారి అప్పాయింట్ మెంట్ ఇప్పించండి అని వేడుకున్న ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వనంటే అంగీకరించేది లేదనీ, వైసీపీలోనే ఉండి పోరాడతానని అన్నారు. జగన్, మంత్రి పెద్దిరెడ్డి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఐ ప్యాక్ సర్వేలను చూపించి వ్యతిరేకత ఉందని చెబుతున్నారని అంటూ డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఐఫ్యాక్ సర్వే ఫలితాలు అనుకూలంగా ఉంటాయన్నారు. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే సంధించిన ప్రశ్నలకు చేసిన విమర్శలకు జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.