సార్వత్రిక ఎన్నికల ముంగిటా ఇండియాలో కనిపించని ఐక్యత!
posted on Jan 2, 2024 @ 1:07PM
సార్వత్రిక ఎన్నిక సమయం దగ్గర పడుతున్న తరుణంగా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన హిందీ రాష్ట్రాలను కోల్పోవడం ఆ పార్టీ ఆశలే కాకుండా, ఇండియా కూటమి ఆశలు కూడా నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడింది. 28 పార్టీల ఇండియా కూటమిలో ఇంతవరకూ ఉమ్మడి అజెండా రూపుదిద్దుకోకపోవడం, తాజా ఎన్నికలలో ఆ కూటమికి నేతృత్వం వహించాల్సిన పార్టీ కీలక రాష్ట్రాలలో ఓటమి పాలు కావడంతో ఇండియా కూటమి కొనసాగే అంశమే సందిగ్ధంలో పడింది. దీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి దీటైన పోటీగా అభ్యర్థిని ఎంపిక చేసుకోలేని ఆశక్తత ఎటూ ఇండియా కూటమికి ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాహుల్ ప్రధాని అభ్యర్థి అన్న విషయంలో కూటమిలో ఏకాభిప్రాయం లేదన్నది వాస్తవం. ఇప్పుడు తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి కనుచూపు మేరలో ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు లేవని స్సష్టం చేసింది. అయినా కూడా రాజకీయ అవసరాలు ఇండియా కూటమిని ఇన్ టాక్ట్ గా ఉంచుతుందనడంలో సందేహం లేదు.
ఇక ఇండియా కూటమికి ఎవరు ఔనన్నాకాదన్నా నాయకత్వం వహించాల్సింది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ ను కలుపుకోకుండా మూడు, నాలుగు అంటూ ఎన్ని ప్రత్యామ్నాయాలు తెరమీదకు వచ్చినా ప్రయోజనం ఉండదు. అయితే కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలు కూడా ప్రధాని అభ్యర్థి విషయానికి వచ్చేసరిని భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ పరిస్థితులలో లోక్ సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమి ఇన్ ాక్ట్ గా ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కూటమిలోని పార్టీ నాయకులలో ఎవరూ కూడా మోడీకి దీటైన పోటీ ఇవ్వగల స్టేచర్ ఉన్న వారు లేకపోవడమే అని అంటున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల లాగే ఈ సారి కూడా బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా, తన ప్రధాన ఎన్నికల ప్రచార సారథిగా మోదీని ప్రజల ముందుంచడం ఖాయమని అర్థం అవుతూనే ఉంది. అలాగే విపక్ష కూటమి అలా ప్రకటించగలదా అన్న సవాల్ ను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. 2014లో ప్రతిపక్ష కూటమి ‘మై నహీ, హమ్’అనే నినాదాన్ని తెరమీదకు తెచ్చినా, మధ్యలోనే ఆ నినాదాన్ని వదిలేశారు. నాయకత్వం, ప్రధాని అభ్యర్థి వంటి విషయాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం పక్కన పెడితే ఇండియా కూటమిలో అనుభవజ్ణులకు కొరత లేదు. అయితే అందరూ సమష్టిగా పని చేయడం విషయంలో మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జనంలో ఇండియా కూటమి ఐక్యతపై నమ్మకాన్ని కలిగించడంలో విఫలమౌతున్నారు. అయితే అటు అధికార కూటమి ఎన్డీయేలో కూడా పరిస్థితి ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగానే ఉంది.
ఎందుకంటే పేరుకు ఎన్డీయేయే కానీ, బీజేపీతో మైత్రికి ఇప్పుటికీ సుముఖంగా ఉన్న పార్టీల సంఖ్య ఎంతున్నా చట్ట సభలలో వాటి ప్రాతినిథ్యం సింగిల్ డిజిట్ కూడా దాటదు. ఔను జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ) కథ దాదాపు ముగిసినట్లే.. ఇప్పుడు ఆ పేరు మీద బీజేపీ ఆధిపత్యం కింద అణిగిమణిగి ఉండే పార్టీలు వినా మరేవీ లేవు. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్ పేయి సారథ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎ చిత్రానికి శుభం కార్డు పడిపోయింది. నిన్నమొన్నటి వరకూ జాతీయ స్థాయిలో ఎంతో కొంత గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ (యు) ఎన్డీయే కూటమిలో కొనసాగడంతో ఎన్డీయే ఉనికి మాత్రంగానైనా ఉంది. కానీ ఎప్పుడైతే నితీష్ కుమార్, కూటమికి గుడ్ బై చెప్పేశారో అప్పుడే ఎన్డీయే కథ ముగిసింది. వాస్తవానికి 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ కంచికి చేరడానికి రెడీ అయ్యింది. ఇంచు మించుగా మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272) కంటే 10 సీట్లు అదనంగా (282) గెలిచి, మూడు దశాబ్దాల చరిత్రను తిరగ రాసింది. అలాగే, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరింది.
అయినా 2014లో తిరిగి 2019లో బీజీపీ ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చింది.
2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు కలిసి పోటీచేశాయి. కానీ, ఇప్పుడు ఆ చిన్నా చితక పార్టీలలో కొన్ని మాత్రమే కూటమిలో మిగిలాయి. బీజేపీ సహజ మిత్ర పక్షాలు శివసేన, అకాలీ దళ్ అలాగే జేడీ(యు) సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలు అన్నీ ఎన్డీఎ గూడు వదిలి పోయాయి.. ఇక ఇప్పుడు ఎన్డీఎలో ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా ప్రభావం చూపగలిగే పార్టీలు కావు. ఏ పార్టీకీ కూడా లోక్ సభలో ఒకటి రెండు స్థానాలకు మించి లేవు. బీజేపీకి పెత్తందారీ పోకడలకు విసిగి వేసారి మిత్రపక్షాలన్నీ ఎన్డీయేను వీడిపోతున్నాయి? అటువంటి పరిస్థితుల్లో అవకాశాలను అందిపుచ్చుకుని మిత్రుల సంఖ్యను పెంచుకోవలసిన కాంగ్రెస్ ఆ విషయంలో పెద్దగా విజయం సాధించలేకపోతున్నది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటికీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మాత్రమే. అందుకే ఇండియా కూటమి పట్ల ఇప్పుడు జనంలో సానుకూలత వ్యక్తం అవుతున్నది. ఆ సానుకూలతను ఓట్లుగా మార్చుకోవడానికి కాంగ్రెస్ త్యాగాలకూ సిద్ధం కావాలి. మిత్రపక్షాల అనుమానాలను నివృత్తి చేసి వాటిని కలుపుకుని పోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరగనుందో?