జగన్మాయ.. రెడ్లకే రెడ్ కార్పెట్!
posted on Dec 13, 2023 @ 2:20PM
ఏపీలో కూడా ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ప్రతిసారి ఎన్నికల సమయానికి కొత్త వారు, రాజకీయ వారసులు ప్రత్యేక్ష రాజకీయాలలోకి రావడం సహజంగా జరిగే ప్రక్రియ. ఇలాగే ఏపీ అధికార పార్టీ వైసీపీలో కూడా ఇప్పుడు కొందరు సీనియర్ నేతల వారసులు కూడా రానున్న ఎన్నికల సీట్లు ఆశిస్తున్నారు. అయితే, వారిలో కొందరికి ఔను కొందరికే.. అదీ సీఎం సామాజిక వర్గానికి చెందని వారికే నిరాశే మిగులుతున్నది. అలా నిరాశ చెందిన వారిలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు మోపిదేవి రాజీవ్, పేర్ని కృష్ణమూర్తి. పేర్లు చదవగానే వారెవరో అర్ధమైపోతుంది. ఔను సీనియర్ నేతలు మోపిదేవి వెంకటరమణ కుమారుడు రాజీవ్, మాజీ మంత్రి పేర్ని నానీ కుమారుడు కృష్ణమూర్తి. ఈ ఇద్దరూ వచ్చే ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. ఈ వారసుల కన్నా వారి తండ్రులే ఎక్కువగా వారసులను రంగంలోకి దించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే, ఈసారి ఈ ఇద్దరికీ సీట్లు కేటాయించడం కష్టమేనని తేలిపోయింది. దీంతో ఇప్పుడు ఇటు మోపిదేవి, పేర్ని నానీ అసంతృప్తిలో ఉన్నట్లు వైసీపీలో చర్చ జరుగుతుంది. మోపిదేవి అయితే బహిరంగంగానే అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారట.
గత ఎన్నికలలో గుంటూరు జిల్లా రేపల్లె నుండి పోటీ చేసిన మోపిదేవి ఓడిపోయారు. అయితే, వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రిని చేసింది. ఆ తర్వాత శాసన మండలి రద్దు అంటూ సీఎం జగన్ హడావుడి చేసి అనంతరం వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే, మండలి రద్దు సమయంలో మోపిదేవిని రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. కాగా, రాబోయే ఎన్నికలలో మోపిదేవి పక్కకి తప్పుకొని రేపల్లె నియోజకవర్గం నుంచి తన కుమారుడిని రంగంలోకి దింపేందుకు చర్యలు ప్రారంభించారు. గడపగడపకి వంటి పార్టీ కార్యక్రమాలలో మోపిదేవి కుమారుడు రాజీవ్ జోరుగా పాల్గొంటూ కనిపించాడు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు రాజీవ్ పనిచేస్తున్న రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జిగా డాక్టర్ ఈవూరు గణేష్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో మోపిదేవి ఇప్పుడు అలకపాన్లు ఎక్కినట్లు తెలుస్తుంది. పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించాలని ప్రయత్నించినా ఆయన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈవూరు గణేష్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న మోపిదేవి వర్గం రేపల్లెలో ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. పలువురు వైసీపీ కౌన్సిలర్ల రాజీనామాకు సిద్దమైనట్లు తెలుస్తుంది. తాడేపల్లిలోని ఓ హోటల్ వద్ద ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని కలసిన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును తిరిగి ఇంచార్జిగా ప్రకటించాలని కోరారు. మోపిదేవిని స్టార్ క్యాంపెయినర్ గా నియమిస్తామని సజ్జల వివరించబోయినా.. ముందు మోపిదేవిని ఇంచార్జిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు మాజీ మంత్రి, కాపు నేత పేర్ని నానీది కూడా ఇలాంటి పరిస్థితే. బందరు నియోజకవర్గం నుండి పేర్ని నాని తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే కృష్ణమూర్తి రెండు మూడేళ్లుగా జనాల్లో తిరుగుతున్నాడు. నానీ ఇక్కడ నుండి ఈసారి పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించగా.. కుమారుడు కోసం బందరు సీటుకు అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ, అధిష్టానం మాత్రం ఇక్కడ నుండి బీసీ అభ్యర్థికి ఈసారి టికెట్ ఇవ్వాలని పరిశీలిస్తుంది. దీంతో నానీకి, ఆయన కుమారుడు రాజీవ్ కి ఈసారి టికెట్ లేనట్లేనని ఖరారైంది.
అయితే, ఇప్పుడు ఇలాంటి సీనియర్ నేతల వారసులను పరిగణలోకి తీసుకొని జగన్.. తమ సొంత సామాజికవర్గ నేతల వారసులకు మాత్రం రెడ్ కార్పెట్ వేసి ప్రోత్సహించడంపై రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతుంది. ఉదాహరణకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే.. తిరుపతి తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఆ పదవి అప్పగించారు. చంద్రగిరికి నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జిగా కూడా మోహిత్ రెడ్డినే ఉండగా వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమైంది. అలాగే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూడా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నుండి పోటీ చేయడం ఖరారైంది. మరోవైపు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా అధికారులంతా సొంత సామజిక వర్గమే కాగా.. సొంత సామజిక వర్గ నేతలకే పదవులు దక్కుతున్నాయి. ఇప్పుడు వారసులు కూడా సిద్ధమయ్యారు. కానీ, మిగతా సామజిక వర్గాల వారసులకు మాత్రం ఈ అవకాశం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.