మోడీ తర్వాత బీజేపీకి భవిష్యత్ లేదా? కాషాయ దళంలో కలవరం?
posted on Jan 2, 2020 @ 10:37AM
ఎప్పట్నుంచో వింటోన్న 2020లోకి ప్రవేశించడంతో అసలు ఈ దశాబ్దం ఎవరిదనే చర్చ మొదలైంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ ఈ దబాబ్దం (2020-2030) తమదేనని చెప్పుకుంటున్నాయి. అయితే, అన్ని పార్టీల కంటే బీజేపీ ముందే ఎక్కువ సవాళ్లు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే, అనూహ్యంగా దేశ నాయకుడిగా అవతరించి రాజ్యమేలుతున్న నరేంద్రమోడీ... ఎవరూ ఊహించనివిధంగా బీజేపీని ఎవరికీ అందనంత అగ్రస్థానంలో కూర్చోబెట్టారు. 2014 వరకు ఒక లెక్క... 2014 తర్వాత మరో లెక్క అన్నంతగా బీజేపీ తలరాతను మార్చేశారు. దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ శక్తిగా మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అవతరించింది. అయితే, మోడీ తర్వాత కూడా ఇదే జోరును బీజేపీ కొనసాగించగలదా అనేదే ఇఫ్పుడు ప్రశ్నార్ధకమవుతోంది.
వాజ్ పేయి తర్వాత బీజేపీలో నెలకొన్న నాయకత్వ కొరతను అందిపుచ్చుకుని 2014కి ముందు దేశ రాజకీయాల్లో ప్రవేశించిన నరేంద్రమోడీకి అప్పటి రాజకీయ, సామాజిక, కాంగ్రెస్ వ్యతిరేక పరిస్థితులు కలిసొచ్చాయి. దాంతో, దేశం మొత్తం మోడీలో కొత్త నాయకుడిని చూసింది. దాంతో, తిరుగులేని నేతగా అవతరించారు. సొంతంగానే 282 సీట్లను గెలుచుకుని ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఇక రెండోసారి అంతకంటే ఎక్కువగా 303 సీట్లను కైవసం చేసుకుని సెకండ్ టైమ్ ప్రధాని పీఠమెక్కారు. అయితే, మోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టారో లేదో... అప్పుడే మోడీ తర్వాత ఎవరనే చర్చ బీజేపీలో మొదలైంది. నిజానికి 2014లో మోడీకి లభించినంత మద్దతు 2019 ఎన్నికలకు ముందు కనిపించలేదు. కానీ, జాతీయ రాజకీయాల్లో మోడీకి ధీటైన ప్రత్యామ్యాయం ప్రజలకు కనిపించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది. అయితే, వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టగలదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
అయితే, మోడీ తర్వాత అమిత్ షా పేరే వినిపిస్తోంది. కానీ, మోడీ మాదిరిగా అమిత్ షా దేశ ప్రజలను ఆకట్టుకోగలరా? అనేది బీజేపీని సంధిస్తోన్న ప్రశ్న. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి మోడీ అంతటి నాయకుడిని బీజేపీ తయారు చేసుకోలేకపోతే మళ్లీ పాత పరిస్థితులకు పడిపోక తప్పదు. అంతేకాదు, మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మోతాదుకు మించాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లోనూ మెల్లమెల్లగా వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లో అధికారాన్ని కోల్పోగా, హర్యానాలో మాత్రం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. దాంతో, బీజేపీ వ్యతిరేక గాలి మొదలైందని, ఇక మోడీ మానియా పనిచేయదని అంటున్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే ముందుముందు బీజేపీ భవిష్యత్తే ప్రశ్నార్ధకమవుతుందని అంటున్నారు.
అందుకే, కొత్త దశాబ్దంలో మోడీ ముందు... బీజేపీ ముందు పెను సవాళ్లు ఉన్నాయంటున్నారు. మూడోసారి మోడీ ప్రభంజనం వీచే అవకాశమే ఉండదని, అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ రూపాంతరం చెందాలంటున్నారు. ఒకవేళ తనను తాను మార్చుకోకపోతే మోడీ అయినా... అమిత్ షా అయినా.... బీజేపీని కాపాడలేరని అంటున్నారు.