అప్పుడు బూతుల గని.. ఇప్పుడు మౌన ముని
posted on Feb 18, 2025 @ 3:33PM
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి పూర్తిగా జ్ణానోదయం అయ్యింది. తన మౌనానికి కారణమేంటో ఆయన తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో మీడియాకు వివరించారు. అధికారంలో ఉన్నంత కాలం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై అనుచిత భాషతో ఇష్టారీతిగా రెచ్చిపోయి, పచ్చి బూతులతో విరుచుకుపడిన కొడాలి నాని.. ఓటమి తరువాత నోరెత్తడమే గగనం అన్నట్లుగా మారిపోయారు.
మీడియాకు కనిపించడమే మానేశారు. దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారా అన్నట్లుగా కొడాలి నాని మారిపోయారు. నోటి వెంట బూతుల సంగతి పక్కన పెడితే.. అసలు మాటే రావడం లేదు.
అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం (ఫిబ్రవరి 18) విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చి, మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్ వెంట కొడాలి నాని కూడా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తరువాత తన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని పార్టీ అధినేత కోసం అనివార్యంగా బయటకు వచ్చారు. జిల్లా జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడిన సమయంలో కొడాలి నాని కూడా పక్కనే ఉన్నారు. దీంతో మీడియా ఆయనతో కూడా మాట్లాడించింది. ఆ సందర్బంగా కొడాలి నాని తన మౌనానికి కారణం చెప్పేశారు.
జనం తన ఉద్యోగం ఊడగొట్టేశారనీ, నోరెత్తద్దని ఓటు ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చారనీ కొడాలి నాని అన్నారు. అందుకే మాట్లాడటం లేదనీ చెప్పారు. అంతే తప్ప అరెస్టులకు భయపడననీ, మూడు కాదు ముఫ్ఫై కేసులు పెట్టుకున్నా లేక్క చేయననీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అధినేత పక్కనుండటంతో ఆ మాత్రం డాబు ప్రదర్శించారు కానీ, వాస్తవానికి వంశీ అరెస్టుతో కొడాలి నాని జావగారిపోయారనీ, ఏ క్షణంలో కటకటాలు లెక్కించాల్సి వస్తుందోనన్న భయంతో ఉన్నారనీ ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మాటలు విని బూతులతో రెచ్చిపోయిన తనను జనం ఛీకొట్టారని అంగీకరించిన కొడాలి నాని.. ఇకపై జగన్ చెప్పినా తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శించే ధైర్యం చేసే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత పక్కనుండగా, జనం ఛీకొట్టారనీ, నోరెత్తొద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారనీ అంగీకరించడమే.. కొడాలి నాని చేతులెత్తేసి, చేసిన తప్పులకు చెంపలేసుకుంటున్నారని అర్ధమని విశదీకరిస్తున్నారు.