సెభాష్ లోకేష్!
posted on Feb 18, 2025 @ 4:08PM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ కు ప్రత్యర్థి పార్టీల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, అడ్మినిస్ట్రేటర్ గా, పాలనా పరంగా సత్తా చాటుతున్న మంత్రిగా నారా లోకేష్ కు అన్ని వర్గాల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తున్నది. 2019 ఎన్నికలలో కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు పడిపోయిన తెలుగుదేశం పార్టీ.. 2024 ఎన్నికలలో అనూహ్య రీతిలో 135 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాలలో విజయం సాధించడం వెనుక లోకేష్ కీలక పాత్ర పోషించారనడంలో అతిశయోక్తి లేదు.
జగన్ అరాచక, కక్షసాధింపు రాజకీయాల కారణంగా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు.. తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు అంటే చాలు జైళ్లు నోళ్లు తెరిచేవి. లాఠీలు స్వైర విహారం చేసేవి. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు చాలా మంది రాజకీయాలకు దూరంగా కేవలం ఇంటికే పరిమితమైపోయిన పరిస్థితి నెలకొంది. పార్టీలో కూడా ఒక విధమైన స్దబ్ధత నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఆ స్తబ్ధతను బద్దలు కొట్టారు. పార్టీ నేతల్లో క్యాడర్ లో కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చారు. స్వయంగా తాను ముందు నిలబడి వైసీపీ నియంతృత్వ పోకడలను ఎదుర్కొన్నారు. దాంతో తెలుగుదేశం నేతలకు తమ భయాలకు చెల్లు చీటీ పాడేసి బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో జగన్ అరాచకపాలనకు చెల్లు చీటీ పాడి.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం వెనుక లోకేష్ పాత్ర విస్మరించజాలనిది. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కూడా లోకేష్ చాలా కీలకంగా మారారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చడమే కాకుండా, ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ చూపుతున్న చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయాలలో, పాలనలో తన సమర్ధతను రుజువు చేసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ ను అన్ని వర్గాల వారూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇందులో వైసీపీ నేతలకూ మినహాయింపు లేదు. ఒకప్పుడు ఆయనను విమర్శించిన వారూ, రాజకీయంగా తొలి అడుగులు పడకముందే వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారూ కూడా ఇప్పుడు లోకేష్ అంటే ప్రజా నాయకుడు అని అంగీకరిస్తున్నారు. తాజాగా అటువంటి ప్రశంసే లోకేష్ కు లభించింది. అదీ వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమేహన్ రెడ్డి సెభాష్ లోకేష్ అంటూ భుజం తట్టి మెచ్చుకున్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి వివాహం నెల్లూరులో ఆదివారం (ఫిబ్రవరి 16) జరిగింది. ఆ వివాహానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆ వివాహ వేడుకకు హాజరైన పలువురు నేతలను పలకరిస్తూన్న లోకేష్ అందులో భాగంగానే మేకపాటి రాజమోహన్ రెడ్డినీ పలకరించారు. లోకేష్ ను చూసీ చూడగానే చటుక్కున కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడిన మేకపాటి సెభాష్ లోకేష్ అంటూ భుజం తట్టి ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. లోకేష్ లో పరిణితి చెందిన నాయకుడే కాదు, పరిపాలనా దక్షత ఉన్న లీడర్ కూడా ఉన్నాడంటూ మేకపాటి రాజమేహన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ప్రశంసలు కురిపించడమే లోకేష్ సత్తా, సామర్ధ్యం, నాయకుడిగా ఎంత ఎత్తుకు ఎదిగారో తేటతెల్లం చేస్తోందనడంలో సందేహం లేదు.