జనంలో జంకుతున్న జగన్ .. జైల్లో నిందితుల పరామర్శలకు శ్రీకారం
posted on Feb 18, 2025 @ 3:12PM
గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రజల చీత్కారాలతో 11 సీట్లకే పరిమితమయ్యారు. జనంలో రావడానికి భయపడుతున్నజగన్ జైలు యాత్రలకు మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా శ్రీకారం చుట్టారు. అనేక నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని జగన్ ఠంఛనుగా పరామర్శిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది
తాజాగా విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైకాపా అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. దళితుడైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన వల్లభనేని వంశీని హైద్రాబాద్ రాయదుర్గంలో ఆయన నివాసంలోనే ఎపి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే . గతంలో రెండుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించారు. తనను గెలిపించిన టిడిపి శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన అరాచకాలు ఆగలేదు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి చేసిన కేసులో వంశీ నిందితుడు. దళితుడైన సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని మంగళవారం (ఫిబ్రవరి 18)ములాఖత్ లో పరామర్శించడానికి జగన్ విజయవాడ సబ్ జైలుకు మందీ మార్బలంతో వచ్చారు. జగన్ వెంట వైకాపా నేతలు కొడాలినాని, పేర్ని నాని కూడా ఉన్నారు. జైలులో వీరిరువురు రావడానికి అధికారులు నిరాకరించారు. భద్రతాకారణాల రీత్యా నిరాకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. అనేక కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను కూడా గతంలో జగన్ జైలులోనే పరామర్శించారు. జగన్ విదేశీ పర్యటన ముగిసిన వెంటనే నేరుగా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేశ్ ను పరామర్శించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. జగన్ హాయంలో అరాచకాలు చేసిన నేతలను రెడ్ బుక్ లో పెట్టడంతో నందిగం సురేశ్ సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. అమరావతి రాజధాని చేయాలన్న మహిళలను దూషించిన కేసులో సురేశ్ లొంగిపోయిన సంగతి తెలిసిందే.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసులో జైలులో ఉన్నప్పుడు జగన్ పరామర్శించారు. జగన్ పాలనలో అక్రమాలు , అరాచకాలు జరిపిన నేతలు జైలు జీవితం గడుపుతుంటే జగన్ మాత్రం జైలు యాత్రలు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. తండ్రి వైఎస్ రాజశేశరరెడ్డి చనిపోగానే అధికారంకోసం జగన్ శవ యాత్రలు చేశారు.
వైకాపా పాలనలో అరాచకాలు పెట్రేగిపోవడంతో వరుసగా వైకాపా నేతలు అరెస్ట్ అవుతున్నారు. ప్రజా సమస్యల మీద పోరాడుతా అని మూడుసార్లు తేదీలతో సహా ప్రకటించిన జగన్ జనంలో వెళ్లడానికి మాత్రం జంకుతున్నారు. గత ఐదేళ్లలో అనేక నేరాల్లో నిందితులైన వైకాపా నేతలను జైలులో పరామర్శించడం విమర్శలకు దారి తీసింది.