టీటీడీ ఈవోగా శ్యామలరావుకు స్థాన చలనం.. మ్యాటరేంటంటే..?
posted on Sep 9, 2025 @ 10:28AM
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావును తప్పించి.. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా తప్పించినా శ్యామలరావుకు అంతకంటే ప్రధానమైన, ముఖ్యమైనా.. ఒక రకంగా చెప్పాలంటే పోలిటికల్ గా కీలకమైన జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అయితే ఎంత ముఖ్యమైనదైనా, కీలకమైనదైనా జీఏడీ పదవికి టీటీడీ ఈవోకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఉండదు. ఏ ఐఏఎస్ అయినా సరే టీటీడీ ఈవోగా పని చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అటువంటిది రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఏరికోరి నియమించుకున్న శ్యామలరావును ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పించి మళ్లీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పని చేసిన అనిల్ కుమార్ సింఘాల్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేంటి? అనిల్ కుమార్ సింఘాల్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీఈవోగా సమర్ధంగా విధులు నిర్వహించారు. ఆ తరువాత వచ్చిన జగన్ సర్కార్ కూడా ఆయనను అదే పదవిలో కొంత కాలం కొనసాగించినా, జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడిన ధర్మారెడ్డి కోసం ఆయనను తప్పించిందని అంటారు. అయితే టీటీడీఈవోగా ఐఏఎస్ అన్న సంప్రదాయాన్ని వెంటనే బ్రేక్ చేయడం ఎందుకు అనుకుందో ఏమో కానీ.. తొలుత ధర్మారెడ్డిని డిప్యూటీ ఈవోగా తీసుకువచ్చింది. మొత్తం పెత్తనం అంతా ఆయనకే కట్టబెట్టి అనిల్ కుమార్ సింఘాల్ ను డమ్మీ చేసింది. అది కూడా ఎక్కువ కాలం కొనసాగనీయలేదు.. అనిల్ కుమార్ సింఘాల్ ను తప్పించి జవహర్ రెడ్డిని తీసుకువచ్చింది. అయితే ఆ వెంటనే ఆయనను సీఎస్ ను చేసి.. ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా నియమించింది. టీటీడీ చరిత్రలో ఐఏఎస్ కాని వ్యక్తి ఈవో కావడం బహుశా ఇదే తొలిసారి. ఆయన హయాంలో టీటీడీ పవిత్రతకు భంగం వాటిల్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలుత తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించారు. టీటీడీ ఈవోగా శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. తిరుమలలో ప్రక్షాళన ఆరంభమైంది. ప్రస్తుతం తిరుమలలో పవిత్రత, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి టీటీడీ ఈవోగా శ్యామలరావును ఎందుకు తప్పించారు. తప్పించారు సరే మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్ కే అ పోస్టు ఎందుకు కట్టబెట్టారు...
ముందుగా టీటీడీ ఈవోగా శ్యామలరావుకు స్థాన చలనం గురించి చెప్పుకుంటే.. ఆయనకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి మధ్య విభేదాలే శ్యామలరావుకు స్థాన చలనానికి కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇరువురి మధ్యా విభేదాలు తొలి సారి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనే బహిర్గతమయ్యాయి. అప్పట్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సమీక్షకు తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు. అయితే అప్పట్లో చంద్రబాబు ఇద్దరినీ మందలించి సర్ది చెప్పినా.. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి గోశాలలో అవుల మృతి వ్యవహారంలో వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని సరిగా హ్యాండిల్ చేయడంలో శ్యామలరావు విఫలమయ్యారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అంతే కాకుండా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపడంలో కూడా శ్యామలరావు విఫలమయ్యారని, ఈ విషయంలో టీటీడీ చైర్మన్ తో సమన్వయంతో వ్యవహరించకుండా ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇక తాజాగా చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ చైర్మన్ నిర్వహించిన సంప్రదాయక కార్యక్రమానికి టీటీడీ ఈవోగా హాజరు కావలసిన శ్యామలరావు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టడం కూడా ఇరువురి మధ్యా విభేదాలను అద్దంపట్టింది. దీంతో ప్రభుత్వం శ్యామలరావును టీటీడీ ఈవోగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చి ఆయనను బదిలీ చేసింది.
ఇక ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ నే టీటీడీ ఈవోగా ప్రభుత్వం నియమించడానికి కారణాలేమిటన్న విషయానికి వస్తే.. టీటీడీఈవోగా గతంలో ఆయన సమర్ధంగా పని చేయడంతో పాటు చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉండటం కూడా ఒక కారణమంటారు. టీటీడీ ఈవో పోస్టు కోసం ఎందరో పోటీ పడుతున్నా.. ఆ పదవి ఆయననే వరించడానికి మరో ప్రధాన కారణంగా కేంద్రం స్థాయిలో ఆయనకు ఉన్న పలుకుబడి, అక్కడ నుంచి వచ్చిన ఒత్తిడీ కూడా కారణంగా చెప్పుకోవచ్చు.