అవినీతి నేపాళం.. చెల్లించాల్సి వచ్చిన మూల్యం!
posted on Sep 10, 2025 @ 10:35AM
నేపాల్ అట్టుడుకుతోంది. ఆదేశ పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా అధ్యక్షుడు, ప్రధాని నివాసాలతో సహా.. తగలబెట్టేశారు. ప్రధాని రాజీనామా చేసేసి దుబాయ్ లో ఆశ్రయం పొందేందుకు రెడీ అయిపోయారు. ఒక మంత్రి సతీమణి ఆందోళనకారుల చేతిలో దుర్మరణం పాలయ్యారు. ఆందోళనకలిగిస్తున్న నేపాల్ సంక్షోభానికి కారణం ఏంటి? కేవలం సోషల్ మీడియాపై నిషేధమే పరిస్థితి ఇంతలా అదుపుతప్పేందుకు కారణమైందా? అంటే.. నేపాల్ పరిస్థితికి కారణం అవినీతి అని చెప్పాల్సి ఉంటుంది.
సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనలను మొదలైనా.. అవినీతిపై ప్రజాగ్రహం పట్టరానంతా వెల్లువెత్తింది. అందుకే సోషల్ మీడియాపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసినా.. ప్రజల ఆగ్రహం చల్లారలేదు. అవినీతిని అంతమెందించే వరకూ విశ్రమించేది లేదన్నట్లుగా అంతకంతకూ ప్రజ్వరిల్లింది. ఈ క్రమంలో నేపాల్ మొత్తం ఒక్కసారిగా అట్టుడికింది. అచ్చం బంగ్లాదేశ్ లో ఏ విధంగా పాలన మారిందో.. సరిగ్గా నేపాల్ లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది.
పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్షుడు, ప్రధాని నివాసాలతో సహా.. పలువురు మంత్రుల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంత్రులపై జరిగిన దాడులు నేపాల్ రాజకీయాల్లో చరిత్రను తిరగరాశాయి. చివరికి పోలీస్టేషన్లు, పార్టీ కార్యాలయాలు, ఆఖరికి వీరి ఆందోళన, నిరసన కార్యక్యక్రమాలను చూపించే కాంతిపుర్ టీవీ ఆఫీసులపైనా దాడి చేశారంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు.
ఎక్కడి వరకూ వెళ్లిందంటే ఆందోళన హింసా రూపం దాల్చడంతో.. సైన్యం సూచనల మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామాలు చేసేశారు. అయినా ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనకారులు శాంతించడం లేదు. నేపాల్ రాజధాని నగరం ఖాడ్మండూలో నిరవధిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసి శాంతిభద్రతల పరిరక్షించాల్సిన బాధ్యత చేపట్టాల్సి వచ్చింది. ఆందోళనకారుల హింస కారణంగా కాట్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మూసేశారు. భారత్ నుంచి వెళ్లే విమానాలను కూడా నిలిపేశారు. సరిహద్దులో భారత ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. నేపాల్ లోని భారతీయుల రక్షణ కోసం చర్యలకు ఉపక్రమించింది.
నేపాల్ ప్రధాని ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిపై సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ చేపట్టిన ఆందోళన, ప్రచారాలను అదుపు చేయడం కోసం నేపాల్ సర్కార్.. రిజిస్ట్రేషన్ సాకుతో సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో యువత భగ్గుమంది. సోమవారం (సెప్టెంబర్ 8)పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. దీంతో పోలీసులు కాల్పులు జరపగా 19 మంది మరణించారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో.. ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేసింది. ఆయినా పరిస్థితి అదుపులోనికి రాలేదు. అవినీతి పరమైన నేతలపై నిప్పులు చెరిగారు. కర్ఫ్యూను సైతం లెక్క చేయక కాలంకీ, బనేశ్వర్, చపగాన్, థెకోలలో ఆందోళనకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించారు. వందల మంది ఆందోళనకారులు ప్రధాని కార్యాలయంలోకి దూసుకు వెళ్లారు.పార్లమెంటుపై దాడి చేసి నిప్పంటించారు. ఇక అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఇంటిపైనా దాడిచేశారు. అంతకు ముందు బాల్ కోట్ లోని ప్రధాని ఇంటికి నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని పుష్పకమాల్ తో పాటు సమాచార మంత్రి పృధ్వీ, మాజీ హోం మంత్రి రమేష్ ఇళ్లపై దాడి చేశారు.
బుధానికాంతలోని నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ ఇంటిని తగులబెట్టారు. ఆయన భార్య అర్జు దేవ్ బా పై వారు దాడి చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ దాడిలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక దేవ్ బా కుమారుడు జైబీర్ కి చెందిన హిల్టన్ హోటల్ నూ ఆందోళనకారులు తగలబెట్టారు. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆర్ధిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడ్ పై దాడి చేశారు. కొందరు మంత్రిని వీధుల్లోకి పరుగెత్తించారు. మంత్రులను అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలించి ఆర్మీ బ్యారక్స్ లో ఉంచారు. దల్లులోని మాజీ ప్రధాని ఝూలానాథ్ ఖనాల్ నివాసానికి ఆందోళ నకారులు నిప్పంటించారు.
ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి తీవ్ర గాయాలపాలై మరణించారు. ప్రధాని ఓలీ రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని, నేపాల్ సైన్యంతో పాటు భద్రతా సిబ్బంది విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చలతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ప్రధాని ఓలీ రాజీనామాకు అధ్యక్షుడి ఆమోదం లభించింది. వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. తదుపరి ప్రధానిగా కాట్మండూ మేయర్ బాలేంద్ర షా పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం నేపాల్ ఆందోళన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. భారతీయులెవరూ నేపాల్‌కు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది.