మళ్లీ గ్రేటర్ రాయలసీమ నినాదం! జగన్ పై ఫైరవుతున్న సీమ జనం..
posted on Jul 21, 2021 @ 7:45PM
గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ ఊపందుకుంటుందా? రాయల సీమ సమస్యలను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారా? అంటే ఆ ప్రాంత జనాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో తెరపైకి వచ్చిన గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల వివాదం, బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం గెజిట్ తో భవిష్యత్ లో ఈ ప్రాంతానికి నష్టం కల్గుతుందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. దీంతో గ్రేటర్ రాయలసీమతోనే తమ హక్కులను కాపాడుకుంటామనే ఆలోచనకు ఆ ప్రాంత ప్రజలు వచ్చారని తెలుస్తోంది.
కృష్టా జల వివాదంపై మాట్లాడిన మాజీ మంత్రి, రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నేత మైసూరా రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు ఘర్షణకు దిగారని.. దానివల్ల రాయలసీమ నీటి ప్రాజెక్టులను గందరగోళంలోకి నెట్టేశారని మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్న ఆయన.. వీరికి ఎందుకు భేషజాలు అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు, వీరిద్దరూ తెగేదాక లాగడం వల్లనే పరిస్థితి ఇంతదాకా వచ్చిందన్నారు మైసూరా రెడ్డి. పోలవరంపై ఐదు రాష్ట్రల ముఖ్యమంత్రులు కలసి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు సీఎంలు మాట్లాడుకోలేరా? అని వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మూడు టీఎంసీలు మాత్రమే వినియోగించాలని, ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంటే సీఎం జగన్ ఎందుకు మట్లాడరని మైసూరారెడ్డి ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్ వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని మైసూరా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్ సీమ ప్రాంతానికి గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదని అన్నారు.ఈ పరిస్థితి వల్ల.. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అంశం తెరపైకి వస్తోందని అన్నారు. తమకు కూడా రాష్ట్రం ఏర్పడితే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం జనాల్లో వస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చిన ఈ గెజిట్ ను జగన్ ప్రభుత్వం ఆహ్వానించడం పూర్తిగా తప్పేనని మైసూరా రెడ్డి మండిపడ్డారు. గెజిట్‌ను స్వాగతించే ముందు ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. రాయలసీమను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదంటూ మైసూరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించాలని ప్రతిపక్షనేతగా జగన్ డిమాండ్ చేసింది నిజం కాదా? అని అడిగారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉండుంటే.. రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం జరిగేది కాదు కదా అని అన్నారు. కేసీఆర్, జగన్ లు రాజకీయ లబ్ది కోసం కీచులాడుకుని జట్టును కేంద్రం చేతిలో పెట్టారని వ్యాఖ్యానించారు. ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకోకపోవటం వలనే బోర్డులు మితిమీరి జోక్యం చేసుకున్నాయన్నారు. శ్రీశైలం జలాశయాన్ని తెలంగాణ ఖాళీ చేస్తుంటే... ఆంధ్రా పాలకులు నిద్రపోతున్నారని మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.