ఆంధ్రా ఆగమాగముంది.. జగన్ పాలనపై కేసీఆర్ సెటైర్లు..
posted on Jul 21, 2021 @ 6:47PM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలనపై ఇప్పటికే చాలా ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై జనాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏపీలో ప్రస్తుతం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. రుణం దొరకకపోతే ఆ నెలకు వేతనాలు లేనట్టే. పరిమితికి మించి అప్పులు తెచ్చారంటూ జగన్ రెడ్డి సర్కార్ తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ కూడా మొట్టికాయలు వేసింది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుదోనన్న ఆందోళన నెలకొంది. ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీతో ఇతర పార్టీలు కూడా జగన్ అస్తవ్యస్థ, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ ను గండంలోకి నెట్టారని చెబుతున్నారు.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తుందని చెప్పిన కేసీఆర్.. ఆంధ్రా పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రజలు.. విభజన తర్వా త కూడా తెలంగాణ వాళ్లుగా చెప్పుకోవడానికి ఇష్టపడే వారు కాదన్నారు. కాని ప్రస్తుతం ఆ సీన్ మారిపోయిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుండగా.. ఆంధ్రా మాత్రం ఆగమాగం అవుతుందన్నారు. అందుకే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రజలు కూడా ఇప్పుడు తెలంగాణవాసులమని చెప్పుకుంటున్నారని చెప్పారు. గతంలో ఏపీలో వరి ఎక్కువగా పండేదని, ప్రస్తుతం తెలంగాణకు కనీస దూరంలో కూడా లేదని తెలిపారు.
తెలంగాణ వాళ్లకు పండించడం రాదు.. పాలన చేసుకోవడం రాదని మాట్లాడేవారని.. కాని ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందే జనాలు గమనిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. జగన్ సర్కార్ తీసుకున్న మెజార్టీ నిర్ణయాలు వివాదాస్పదం కావడం, కోర్టులు కొట్టివేయడం వంటి ఘటనలు జరిగాయి. కొన్ని రోజులుగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను బట్టే కేసీఆర్.. ఈ కామెంట్లు చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఆంధ్రాను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మరో వాదన కూడా వస్తోంది. ఇటీవల కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం సాగుతోంది. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో కేంద్ర సర్కార్ ఎంటరై బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ ఇచ్చింది. అయినా తెలంగాణ సర్కార్ దూకుడుగానే వెళుతోంది. సుప్రీంకోర్టులో పోరాటానికి సిద్ధమైంది. జల వివాదం నేపథ్యంలోనే గతంలో మిత్రుడిగా చెప్పుకున్న జగన్ టార్గెట్ గా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని కొందరు భావిస్తున్నారు.