రైతులకు మొబైల్‌లో వాతావరణ సమాచారం?
posted on Oct 20, 2012 @ 11:08AM
రంగారెడ్డి జిల్లా రైతాంగానికి మొబైల్‌లో వాతావరణ సమచారం అప్‌డేట్‌గా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందస్తుగా పట్టు పరిశ్రమ, హార్టికల్చర్, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో మూడు వేల మంది రైతులకు తెలుగులో వాయిస్‌మెసేజ్‌లను పంపించనున్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ప్రయత్నాలు సాగుతాయి. దీని కోసం ప్రభుత్వం ఎయిర్ టెల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం అయిన చేవెళ్లలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని ప్రతీ మండలంలోనూ మూడు వేల మంది రైతులను ఎంపిక చేసి వారికి ఈ మెసేజ్‌లు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఈ మెసేజ్‌లు కూడా తెలుగులో ఉండటం వల్ల వెంటనే రైతులు అప్రమత్తం అయ్యే అవకాశాలుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన హైబ్రిడ్ వంగడాలు గురించి కూడా సమాచారం అందజేస్తామని అంటున్నారు. భూసారం ఆధారంగా వ్యవసాయం చేస్తే వచ్చే ప్రయోజనాలూ విశదీకరిస్తామని వివరించారు. ఇప్పటికే మోడల్‌ఫామ్స్‌ను గుర్తించి వ్యవసాయాభివృద్థికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.