మహిళల పట్ల రామ్ దేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలు
posted on Nov 26, 2022 @ 1:54PM
పురుషాధిక్య సమాజంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా.. మహిళలపై అఘాయిత్యాల సంఖ్య ఇంతింతై అన్నట్లుగా పెరిగిపోతోంది. అన్నిటికంటే బాధాకరమైన విషయమేమిటంటే మహిళల పట్ల చులకన భావంతో వ్యాఖ్యలు చేసే వారిలో ప్రసిద్ధులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఏకంగా మంత్రులు కూడా ఉండటం.
ఏపీలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. అలాగే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో బాగోతమూ తెలిసిందే. తమిళనాడు విద్యాశాఖ మంత్రి కూడా ఇటీవల ఒక సందర్భంగా తమ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై చులకన భావంతో వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు. అయితే కాషాయ బట్టలు వేసుకుని ఆధ్మాత్మిక బోధలు చేస్తూ, యోగాతో జీవన శైలిని మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఉద్బోధనలు చేసే యోగాగురు రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం చీదరించుకునేలా ఉంది. ఇలా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారే మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా రామ్ దేవ్ బాబా పతంజలి యోగా పీఠ్ ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం థానేలోని హాయ్ల్యాండ్ ప్రాంతంలో యోగా సైన్స్ క్యాంపు మహిళల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ కార్యక్రమంలో మాట్లాడిన రామ్ దేవ్ బాబా మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలు చీరలోనూ, సల్వార్ కమీజ్ సూట్లోనూ అందంగా ఉంటారు అని.. అక్కడితో ఊరుకోకుండా వారు దుస్తులు ధరించకున్నా అందంగానే ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే వంటి వారు కూడా ఉన్నారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబా రామ్ దేవ్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అన్నివర్గాల నుంచీ వస్తోంది. ఆధ్యాత్మికత ముసుగులో వ్యాపార సామ్రాజ్యాన్నినిర్మించుకున్న బాబారామ్ దేవ్ కాషాయ వస్త్రధారణ మాటున తన పురుషాధిక్య వికృత స్వరూపాన్ని చూపారని విమర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో బాబారామ్ దేవ్ ను నెటిజనులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఉచ్ఛనీచాలు లేకుండా అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడిన రామ్ దేవ్ ను కఠినంగా శిక్షించాలని, ఆయన పతంజలి గ్రూప్ ఉత్పత్తులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.