తీవ్ర నేరాలకు పాల్పడిన మైనర్లను మేజర్లుగానే పరిగణించాలి.. కేంద్రం ప్రతిపాదన
posted on Nov 26, 2022 @ 3:14PM
అత్యాచారాలు, హత్యలు వంటి దారుణ నేరాలకు పాల్పడినప్పుడు నేరస్థులు మైనర్లయినా వారిని మేజర్లుగానే పరిగణనలోనికి తీసుకుని కఠిన శిక్షలు విధించాల్సిందేనన్న ప్రతిపాదనలు పలు సందర్భాలలో పలువురు ప్రతిపాదనలు చేశారు.
అలా చేసిన వారిలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీచ . ఆమె కంటే ముందు ఇదే మంత్రిత్వ శాఖను నిర్వహించిన కృష్ణ తీరథ్ కూడా ఉన్నారు. అయితే బాలల హక్కుల ఉద్యమకారులు ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. దాంతో తీవ్ర నేరాల విషయంలో మైనర్లను మేజర్లుగా పరిగణించి చర్యలు తీసుకోవాలన్న వాదన మరుగున పడిపోయింది. అయితే తాజాగా మరో సారి మేనకా గాంధీ ఇదే ప్రతిపాదనను మళ్లీ ముందుకు తీసుకు రావటంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రతిపాదనపై చర్చ మొదలైంది. దారుణ లేదా క్రూరాతి క్రూర నేరాల విషయంలో న్యాయమూర్తులు పెద్దల విషయంలో వ్యవహరించినట్టే మైనర్ల విషయంలోనూ వ్యవహరించే విధంగా చట్టాలను సవరించాలని ఆమె అంటున్నారు.
నిర్భయ కేసు విషయంలో పెద్దవారికి ఒక విధంగా, మైనర్ కు మరో విధంగా శిక్ష పడటం అనేది తీర్పునకు ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని, ఆ తర్వాత మైనర్లు కూడా ఎక్కువగా అత్యాచారాలకు పాల్పడటం ఎక్కువైందని ఆమె చెబుతున్నారు. నిర్భయ కేసులో 18 ఏళ్లు పైబడిన వారికి మరణ శిక్ష విధించగా, వారితో కలిసి అదే నేరానికి పాల్పడిన ఓ మైనర్ కు మూడేళ్లు మాత్రమే శిక్ష విధించి ఆ తర్వాత విడుదల చేసిన సంగతి విదితమే. అయితే, నిర్భయ తండ్రి మాయ మాటలు చెప్పి నిర్భయను బస్సులోకి పిలిచింది, ఆమెను చిత్రహింసలు పెట్టింది ఈ మైనరేనని చెప్పిన సంగతిని మరిచిపోకూడదు. ఆమె మరణానికి ప్రధాన కారకుడు అతనేనని కూడా నిర్భయ తండ్రి కేసు విచారణ సందర్భంగా చెప్పారు.
అతను మైనర్ కనుక చట్ట ప్రకారం అతని నేరాన్ని రికార్డుల నుంచి పూర్తిగా తొలగించడం సరి కాదన్న అభిప్రాయం నిర్భయ కేసు సందర్భంగా సర్వత్రా వ్యక్తమైంది. పలువురు న్యాయ నిపుణులు సైతం అప్పట్లో మైనర్ అన్న కారణంగా శిక్ష తగ్గించడాన్ని సమర్ధించలేదు. కాగా ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించాలని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరిన సంగతి విదితమే. 2015లో జువైనల్ జస్టిస్ యాక్ట్‌కు చేసిన చట్ట సవరణను పోలీసులు ఆ సందర్భంగా ఉదహరించారు. తీవ్ర నేరం చేసే మైనర్లను చట్ట ప్రకారం మేజర్‌గా పరిగణించవచ్చని వారు అప్పట్లో పేర్కొన్నారు. ఇదలా ఉంటే ఉగ్రవాదులు సైతం చట్టంలోని మైనర్ అన్న లొసుగును ఉపయోగించుకుంటున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తోయిబా సంస్థ ఈ అస్త్రాన్ని ఆధారం చేసుకుని మైనర్లకు ఉగ్రశిక్షణ ఇచ్చి సరిహద్దు దాటిస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయని మిలిటరీ వర్గాలు చెబుతున్నాయి.
అలాంటి వారు భద్రతా సిబ్బందికి పట్టుబడిన సందర్బంలో మైనర్లు కనుక శిక్ష లేకుండా తప్పించుకునే అవకాశాలుంటాయని ఉగ్ర సంస్థలు ఈ దారిని ఎన్నుకున్నాయని అంటున్నారు. అందుకే మైనర్లు తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు వారిని మేజర్లుగానే పరిగణించి శిక్షలు విధించాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలలో తీవ్ర నేరాలకు పాల్పడిన వారు మైనర్లైనా, మేజర్లైనా ఒకే విధమైన శిక్షలు విధిస్తున్నారు. అయితే ప్రపంచంలో ఎక్కువ దేశాలు మాత్రం మైనర్లకు చట్ట ప్రకారం వెసులుబాటు ఇస్తున్నారు. అయితే దేశంలో హింసాప్రవృత్తి పెచ్చుమీరుతున్న నేపథ్యంలో తీవ్ర నేరాలకు పాల్పడిన మైనర్ల విషయంలో ఉదారత కూడదన్న వాదనకు బలం పెరుగుతోంది. కేంద్రం కూడా తీవ్ర నేరాల విషయంలో మైనర్లను కూడా మేజర్లుగానే పరిగణించాలన్న యోచనలో ఉందని కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి.