వ్యాక్సిన్ వేస్ట్.. రాందేవ్ బాబా మరో రచ్చ...
posted on May 30, 2021 @ 7:00PM
ఈ రాందేవ్ బాబా ఉన్నడే... అస్సలు నోరు కంట్రోల్‌లో ఉంచుకోవడం లేదు. వరుసపెట్టి అల్లోపతి వైద్యాన్ని ఆటాడుకుంటున్నారు. విమర్శలతో ఇంగ్లీష్ మెడిసిన్‌ను పోస్ట్‌మార్టం చేస్తున్నారు. అల్లోపతి అసలు వైద్యమే కాదంటూ.. రచ్చ స్టార్ట్ చేశాడు. అది.. ఎక్కడికో దారి తీసి.. దేశంలో అల్లోపతి వర్సెస్ ఆయుర్వేద యుద్ధంగా వివాదం ముదురుతోంది. రాందేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్ మండిపడటం.. కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం.. అల్లోపతి వైఫల్యాలపై బాబా అనేక ప్రశ్నలు సంధించడం.. తనను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం.. మీ బాబులకు కూడా లేదంటూ తొడగొట్టి సవాల్ చేయడం.. ఇలా కొన్ని వారాలుగా అల్లోపతిపై బాబా రాందేవ్ ఒంటికాలిపై రెచ్చిపోతున్నారు. అల్లోపతి వైద్య విధానంలోని లోటుపాట్లను తన ప్రశ్నలు, మాటలతో తూట్లు పొడుస్తున్నారు.
తాజాగా, బాబా రాందేవ్ కొవిడ్ వ్యాక్సిన్ సమర్థతపై విమర్శలు చేశారు. కొవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నా.. కొందరు మరణిస్తున్నారని.. అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయడం లేదనడానికి ఇదే నిదర్శనమంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.
‘‘కొన్ని దశాబ్దాలుగా నేను యోగాభ్యాసం చేస్తున్నాను. అలాగే ఆయుర్వేద విధానాన్ని కూడా అనుసరిస్తున్నాను. నాకు వ్యాక్సిన్ అవసరమే లేదు. ఆయుర్వేదమనే పురాతన చికిత్సకు భారత్‌తో పాటు విదేశీయులు కూడా ఫాలో అవుతున్నారు. దాదాపు 100 కోట్ల మందికి పైగా ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నవారు ఉన్నారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభిస్తుంది. ఆయుర్వేద వైద్య విధానాన్ని అల్లోపతి విధానంతో పోల్చుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపిస్తున్నారు’’ అంటూ రాందేవ్ బాబా తీవ్రంగా మండిపడ్డారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ హెచ్చరించినా.. బాబా రాందేవ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పతాంజలి సంస్థ తీసుకొచ్చిన కొరోనిల్ మందు ప్రమోషన్ కోసమో.. మరి దేని కోసమో.. తెలీదు కానీ.. కరోనా సమయంలో ప్రమాణికమైన అల్లోపతి మెడిసిన్‌ను పనికి మాలిన వైద్యంగా తీసిపారేస్తూ.. ఆయుర్వేదం ప్రాముఖ్యతను గొంతెత్తి చాటుతున్నారు. అయితే, ఆయుర్వేదం గురించి గొప్పలు చెప్పడంలో తప్పేమీ లేకపోయినా.. అల్లోపతి వైద్యాన్ని కించపరిచేలా రాందేవ్ బాబా వ్యాఖ్యలు ఉంటుండటంపైనే ఐఎంఏ తీవ్ర అభ్యంతరం చెబుతోంది.
ఆయనే అన్నట్టు తననెవరూ అరెస్ట్ చేయలేరనే మొండి ధైర్యంతో.. అల్లోపతిపై నోటికొచ్చినట్టు వాగుతున్నారనేది ఐఎంఏ ఆగ్రహం. ఇప్పటికే రాందేవ్ బాబాపై ఉత్తరాఖండ్ ఐఎంఏ శాఖ ఏకంగా వెయ్యి కోట్ల పరువునష్టం దావా వేసినా.. తగ్గేదే లే.. అంటూ రాందేవ్ బాబా రెచ్చిపోతుండటంతో దేశంలో అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం వివాదం రచ్చ రంబోలాగా మారుతోంది.