కేసీఆర్ సాయం కోరిన కాంగ్రెస్ నేత! కేటీఆర్ క్విక్ రియాక్షన్..
posted on May 30, 2021 @ 8:39PM
దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. చాలా రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులున్నాయి. కరోనా రోగులను సరైన చికిత్స అందడం లేదు. అదే సమయంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కాసుల కక్కుర్తికి పాల్పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. లక్షలకు లక్షలు బిల్లులు వేస్తున్నాయి. ఒకవేళ కరోనా రోగి మరణిస్తే..మొత్తం డబ్బులు కట్టే వరకు మృతదేహాన్ని బంధువులకు ఇవ్వడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలపై ఎంతో మంది ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదుచేస్తున్నారు. వాటిపై ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అధిక వసూలు వసూలు చేస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని సర్కార్ హెచ్చరిస్తున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మారడం లేదు.
కరోనా రోగి చికిత్స విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత. కర్నాటక పీసీసీ చీఫ్ డి.కే. శివకుమార్ హైదరాబాద్‌లో ఇబ్బందులు పడుతున్న కర్నాటక మహిళను ఆదుకోవాలని ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. కర్నాటకలోని మాండ్యా ప్రాంతానికి చెందిన శశికళ మంజునాథ్ భర్త కరోనాతో హైదరాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోవిడ్ చికిత్సకు రూ.7.5 లక్షల బిల్లు వేశారు. ఐతే తాను రూ.2 లక్షలే కట్టగలనని, అంతకు మించి కట్టేందుకు తమకు స్థోమత లేదని చెప్పింది. కానీ ఆస్పత్రి యాజమాన్యం వినలేదు. మొత్తం డబ్బులు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆమె బంధువులు కర్నాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డి.శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
తన దృష్టికి వచ్చిన సమస్యను వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు డీకే శివకుమార్. మంజునాథ్ కుటుంబానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు డీకే శివ కుమార్. ఆయన విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. వారి వివరాలను అందజేయాలని కోరారు. మెడికవర్ ఆస్పత్రితో తక్షణం మాట్లాడాలని తన సిబ్బందిని ఆదేశించారు కేటీఆర్.