ఈటల బీజేపీలో చేరితే లాభమెవరికి? అంతా కేసీఆర్ స్కెచ్ ప్రకారమేనా!
posted on May 30, 2021 @ 6:43PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నట్లే జరుగుతోందా? ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో ఏదో జరుగుతుందని ఆశించిన జనాలకు షాక్ తప్పదా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ వ్యవహారం గులాబీ బాస్ కు గుబులు రేపడం ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అంతా ఆయన కోరుకున్నట్లే... ఆయనకు లాభించే విధంగానే రాజకీయ సమీకరణలు మారిపోయాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటారని భావించిన ఈటల రాజేందర్.. ఎందుకో వెనకంజ వేశారని కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. కేసీఆర్ వేసిన ఎత్తుల నుంచి ఆయన బయటపడలేకపోయారని అంటున్నారు.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో ఒక విధమైన జోష్ కనిపించింది. అధికార టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయం బీజేపీనే అనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. కానీ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. కథ మళ్ళీ మొదటి కొచ్చింది.
టీఆర్ఎస్ ప్రత్యాన్మాయం ఎవరు? కమల దళమా, కాంగ్రెస్ పార్టీనా ? అన్న ప్రశ్న మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్సీ, సాగర్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటే.. గులాబీ పార్టీకి బలమైన శక్తి ప్రస్తుతానికి లేదనే అనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే, రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందా అన్న సందేహం కూడా కలుగుతుంది. సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకు, అదే నిజం.
ఎంత చెడ్డా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇప్పటికీ పునాదులు ఎంతో కొంత గట్టిగానే ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు తమ మధ్య ఉన్న విబేధాలను విస్మరించి కలిసి పనిచేస్తే, బలమైన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత అయ్యే పనికాదు. ఎండమావిలో నీళ్ళు తాగవచ్చేమోకానీ, కాంగ్రెస్ పార్టీలో ఐక్యత, కష్టం. అలాగే, కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువమంది కారెక్కి తెలంగాణ భవన్’కు చేరడంతో పార్టీ విశ్వసనీయతను కోల్పోయింది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ దినదిన ప్రవర్తమానంగా దిగజారి పోతోంది. జాతీయ స్థాయిలోనే, పార్టీకి దిక్కు దివాణం లేదు. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. చుక్కాని లేని నావలాగా, పార్టీ ప్రయాణం సాగిస్తోంది. రేవంత్ రెడ్డి కష్ట పడుతున్నారు, కానీ ఫలితం కనిపించడం లేదు. నాగర్జున సాగర్ ఉప ఎన్నికకు ముందు, రేపో మాపో పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగిపోతుందని, కాంగ్రెస్ నాయకులు సందడి చేశారు. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించినట్లే అని పెద్ద పెట్టున సంచలన కథనాలు వినిపించాయి. కానీ, అంతలోనే, అంతరాయం. ఉపఎన్నికలకు ముందు అధ్యక్షుని మారిస్తే, విబేధాలు భగ్గుమంటాయని, నిర్ణయం వాయిదా వేశారు. ఉపఎన్నిక జరగడం, జానారెడ్డి ఓడిపోవడం జరిగి పోయాయి. అయినా పీసీసీ అధ్యక్షుని నియామకం పై ఉలుకు పలుకు లేదు. కొవిడ్ కారణం చూపి, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక వాయిదా వేసినట్లుగా, పీసీసీ నియామాకం కూడా నిరవధికంగా వాయిదా పడిందో ఏమో .. మొత్తానికి రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగించినా, కోమటి రెడ్డి నెత్తినే కిరీటం పెట్టినా లేక ప్రస్తుత పీసీసీ రెడ్డిగారినే కొనసాగించినా కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయంగా ఎదగడం అంత తేలిక వ్యవహాం కాదు.
రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం కనిపిస్తోంది. కానీ పిల్లి మేడలో గంట కట్టేది ఎవరు? ఈ విషయంలో మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్ నాయకుడు విశ్వేశ్వర రెడ్డి ఉత్సాహం చూపుతున్నారు. కానీ ఆయన ప్రయత్నాలకు కూడా పురిట్లోనే సంధి కొట్టినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల కలిసొస్తే, ఆయన నాయకత్వంలో పార్టీ పెట్టాలని, లేదా ఆయన్ని కాంగ్రెస్ లోకి పట్టుకుపోయి, కోదండ రామ్ లాంటి మరికొందరు కేసీఆర్ బాధితులతో కూటమి కట్టి ... ఇలా అనేక ప్రత్యాన్మాయ ఆలోచనలతో ఎదో విధంగా టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక నిర్మాణం చేయాలని విశ్వేశ్వర రెడ్డి కొంత సిన్సియర్ ప్రయత్నమే చేశారు. అయితే, ఈటల బీజేపీలో చేరేందుకు సిద్డం కావడంతో.. రేవంత్ రెడ్డి , విశ్వేశ్వర రెడ్డి, కోదండరామ్ చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయి. సో.. తెరాసకు ప్రత్యాన్మాయం అవసరంకానీ, అది ఇప్పట్లో అయ్యేలా లేదు. అందుకే ప్రత్యాన్మాయం ప్రశ్న మళ్ళీ మొదటికొచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.