రంభ నగల చోరీ.. కుటుంబ గొడవ...
posted on Feb 1, 2015 9:29AM
సినీ నటి రంభ కుటుంబానికి సంబంధించిన గొడవ మరోసారి పోలీస్ స్టేషన్‌కి ఎక్కింది. రంభకు చెందిన బంగారు, వజ్రాల నగలను ఆమె వదిన, ఆ వదిన సోదరి కాజేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. రంభ సోదరుడు వై.శ్రీనివాస్ ఈ మేరకు చెన్నైలోని విరుంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర రంభ సోదరుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తాము పెట్టిన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘నా భార్య పల్లవి, ఆమె సోదరి శాంతిసింగ్ చౌహాన్, నా బావమరిది, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్, ఆయన భార్య, వాణిజ్య పన్నుల శాఖ అధికారిణి సంయుక్త... వీళ్ళందరూ రంభకు చెందిన నాలుగున్నర కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాల నగలను కాజేశారు. అలాగే మా కుటుంబం మీద గతంలో అకారణంగా వరకట్నం వేధింపుల కేసు పెట్టారు. అలాగే నా కుమారుడిని నాకు గత ఏడాదిగా చూపించడం లేదు. ఈ విషయంలో పశ్చిమ మండలం డీసీపీకి ఫిర్యాదు కూడా చేశాను. గత మూడేళ్ళ నుంచి రంభ కెనడాలో వుంటోంది. రెండు నెలల క్రితమే హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చింది. గతంలో మేమెవ్వరం ఇక్కడ లేని సమయంలోనే వీరందరూ మామీద వేధింపుల కేసు పెట్టారు. ఇప్పుడు రంభ నగలను దొంగతనం చేశారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అన్నారు.