ర‌జ‌నీకాంత్‌కి చంద్ర‌బాబు....అంటే ఎందుకంత ఇష్టం!?

 

ఏ ట్రిబ్యూట్ టు త‌లైవ అంటూ షారుక్ ఖాన్ త‌న చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో లుంగి డ్యాన్స్ పెట్టాడంటే.. ప‌రిస్థితి ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే ఖాన్ త్ర‌యంలో ఒక‌రైన షారుక్ కి బాలీవుడ్ బాద్షా వంటి బిరుదులున్నాయి. అంటే ఆయ‌న మార్కెట్ ర‌జ‌నీ మార్కెట్ క‌న్నా ఎంతో పెద్ద‌ది. ఆయ‌న నెట్ వ‌ర్క్, నెట్ వ‌ర్త్ ఎంత లార్జ్ అయినా స‌రే ర‌జ‌నీకాంత్ కి ఎంత విలువ ఇచ్చారో చెప్ప‌డానికిదో మ‌చ్చు తున‌క‌. 

ఇది ఎప్పుడో పాత‌కాలం ముచ్చ‌టే కాద‌న‌డం లేదు. కానీ ర‌జ‌నీకి బాబా సినిమా  కాలం నాటి నుంచే దేశ విదేశీ అభిమాన భ‌క్తులున్నారు. తొలి ద‌క్షిణాది  పాన్ వ‌ర‌ల్డ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంతంటే  అతిశ‌యోక్తి కాదేమో. అంత‌గా ర‌జ‌నీకాంత్ త‌న‌దైన ఫ్యాన్ మెయిల్ ప్ర‌పంచ‌మంతా ప‌రిచేశారు. ఇక త‌మిళులు అధికంగా  ఉండే మ‌లేసియా, సింగ‌పూర్ లో ఆయ‌న అభిమాన‌గ‌ణం గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది.

న‌ట‌న ప‌రంగా  క‌మ‌ల్ హాస‌న్  ని కొట్టే వాడు లేక పోయినా.. ఆయ‌నంత అందం, అభిన‌యం లేక పోయినా త‌న‌దైన స్టైల్లో ర‌జ‌నీ మాస్ ప్రేక్ష‌క జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డం  పీహెచ్డీ  చేయ‌ద‌గ్గ‌ర స‌బ్జెక్ట్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక ర‌జ‌నీకాంత్ జాలి, ద‌య‌.. దాన గుణాల గురించి చెబితే ఒక నాన్ డీటైల్డ్ బుక్ లో పెట్ట ద‌గ్గ‌ అతి పెద్ద పాఠ‌మే అవుతుంది. త‌నను తొలినాళ్ల‌లో ఆద‌రించిన వారెవ‌రినీ ఆయ‌న మ‌ర‌చి పోలేదంటారు. 

తాను వేషాల కోసం వెతుక్కుంటున్న రోజుల్లో పూట‌గ‌డ‌వ‌ని ప‌రిస్థితుల్లో కాసింత ఎక్కువ ప్ర‌సాదం పెట్టిన పూజారి  ర‌జ‌నీకి ఇంకా గుర్తే. త‌న  డ్రైవ‌ర్ ఇంటికి చాటుగా వెళ్లి వారికి కొత్త ఇల్లు కొనిచ్చిన ర‌జ‌నీ దాతృత్వం కూడా చాలా చాలా పెద్ద‌ది. ర‌జ‌నీకి ఎదురుప‌డ్డ ఎవ‌రైనా స‌రే, ల‌బ్ధి  పొందాల్సిందేనంటారు. అంత‌గా ఆయ‌న ఫీల‌వుతార‌ని  చెబుతారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఆయ‌న ఎప్పుడైనా హైదరాబాద్ వ‌స్తే మోహ‌న్ బాబు గెస్ట్ హౌసుల్లో దిగుతుంటారు. రాత్రి పూట సిట్టింగ్ కి ఏర్పాట్లు చేసే ఆఫీసు బాయ్ కి కూడా ఆయ‌న 500లో, వ‌య్యో చేతిలో పెడ‌తారట‌. ఈ విష‌యం ఆ ఆఫీస్ బాయ్ గ‌ర్వంగా  చెప్పుకుంటాడు.

ఇక సింప్లిసిటీ విష‌యంలో ర‌జ‌నీ త‌ర్వాతే  ఎవ‌రైనా. ఒక సాదా సీదాగా కృష్ణానగ‌ర్, ఇంద్ర‌న‌గ‌ర్ గ‌డ్డ మీద సాయం కాలం వేడి  వేడి పునుగుల‌ను తిన్న ఉదంతాలున్నాయి. ఒక  సాధార‌ణ ప్ర‌యాణికుడిలా..  హిమాల‌యాల‌కు వెళ్ల‌డం వంటి వార్త‌ల‌ను త‌ర‌చూ వింటూనే ఉంటాం. ఆయ‌న మొన్నా మ‌ధ్య శ్రీశైలం వెళ్లి అక్క‌డ ద‌ర్శ‌నం ముగిశాక‌.. రోడ్డుపై కూర్చుని ఉంటే, ఒక మ‌హిళా భక్తురాలు ప‌ది రూపాయ‌ల‌ను దానం చేసింద‌న్న వార్త గుప్పు మంది. దీన్నిబ్ట‌టీ ఆయ‌న ఎంత  సింపుల్ గా  క‌నిపిస్తారో చెప్పొచ్చు.

ఇలా చెప్పుకుంటూ  పోతే ర‌జ‌నీకాంత్ గురించిన విశేషాలు కోకొల్ల‌లు. దాదాసాహేబ్ తో పాటు ప‌లు ప‌ద్మ అవార్డుల‌తో పాటు ఇంకా ఎన్నో ఘ‌న‌కీర్తులు సాధించిన ర‌జ‌నీకాంత్ మార్కెట్ స్టామినా ఎంత స్ట్రాంగ్ అంటే రీసెంట్ గా ఆయ‌న జైల‌ర్ అనే మూవీ రూ.500 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించింది. సూప‌ర్ స్టార్ ఈజ్ ఆల్వేస్ సూప‌ర్ స్టార్ అన్న పేరు సాధించారు. 

75 ఏళ్ల వ‌య‌సులోనూ ఇంకా మార్కెట్ రారాజుగా వెలుగొందే ర‌జ‌నీకాంత్ రాజ‌కీయంగా అడుగులు వేయాల‌ని భావించారు. కానీ, ఆయ‌న త‌మిళ‌నాడు లోక‌ల్ కాదు. ఎక్క‌డో మ‌హారాష్ట్ర‌లో పుట్టి క‌ర్ణాట‌క‌లో పెరిగిన వాడు కావ‌డం వ‌ల్ల‌... ఆయ‌న‌కు త‌మిళ‌నాట రాజ‌కీయం చేయ‌డానికి త‌గిన ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు.

ర‌జ‌నీకాంత్ అంటే చ‌ప్పున గుర్తుకు వ‌చ్చేది ఒక‌టి ఉంది. అదే  కండ‌క్ట‌ర్ టు సూప‌ర్ స్టార్ గా ఆయ‌న ఎదుగుద‌ల దాని ప‌రిణామ క్ర‌మం. అంతే కాదు.. తొలినాళ్ల‌లో నెగిట‌వ్ కేరెక్ట‌ర్స్ కెరీర్ స్టార్ట్ చేసి ఆపై ఒకానొక‌ సూప‌ర్ స్టార్ గా ఎద‌గ‌డం ఎలా.. అన్న‌ది. ఈ విష‌యంలో ఆయ‌నొక  రూట్ మ్యాప్ వేసి  సినీ గైడ్ గా అవ‌త‌రించారన‌డం అబ‌ద్దం కాదేమో. ఈ పంథాలో తెలుగులో చిరంజీవితో పాటు మ‌రెంద‌రో త‌మిళ, మ‌లయాళ, క‌న్న‌డ‌ హీరోలు సైతం ఫాలో అయ్యారంటే అతిశ‌యం కాదు. 

ఇక‌ 1995లో విడుద‌లైన ర‌జ‌నీకాంత్- బాషా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే అది తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ, క‌న్న‌డ అన్న భాషా బేదాల్లేకుండా ఇర‌గ‌దీసేసింది. ఆ త‌ర్వాత బాషాలాంటి ప్యాట్ర‌న్  తో వ‌చ్చిన సినిమాల ప‌రంప‌ర  కూడా లెక్క‌లేన‌న్ని.  ఇదొక స‌క్సెస్ ఫుల్ సినీ ఫార్ములాగానూ చెలామ‌ణి అయ్యిందంటే అర్ధం చేసుకోవ‌చ్చు ఇంపాక్ట్ ఆఫ్ ర‌జ‌నీకాంత్ ఆన్ సౌత్ సినిమా ప‌వ‌రేంటో.

తెలుగు రాజ‌కీయాల‌తో కూడా ర‌జ‌నీకాంత్ కి ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఇటీవ‌ల  ఆయ‌న ఏపీలో జ‌రిగిన‌ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి  ఉత్స‌వాల‌కు హాజ‌ర‌య్యారు. బేసిగ్గా ర‌జ‌నీకాంత్ తాను రాజ‌కీయాల్లో రాణించ‌లేక పోయినా.. చంద్ర‌బాబు, ఆయ‌న మార్క్ పాలిటిక్స్ అంటే ఎంతో విలువ‌నిచ్చి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తారు. గ‌తంలో చంద్ర‌బాబు సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా  ఉండ‌టం కూడా ర‌జ‌నీతో ప‌రిచ‌యానికి ఒక కార‌ణంగా  చెబుతారు కొంద‌రు. 

దానికి తోడు ఒకానొక రోజుల్లో సీఈఓ ఆఫ్ ద స్టేట్ గా చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు అతీతంగా సాధించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి సైతం ర‌జ‌నీకీ బాగా  ఇష్టం. అందుకే ఆయ‌న బాబును ఎంత‌గానో అభిమానిస్తారు. త‌న‌కు కోట్లాది మంది అభిమానులున్నా.. తాను మాత్రం బాబుకు పెద్ద ఫ్యాన్ అంటూ బాహ‌టంగానే ప్ర‌క‌టిస్తారు ర‌జ‌నీకాంత్.  త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ర‌జ‌నీ  ప్ర‌భావం ఎంత అంటే  సాక్షాత్ ప్ర‌ధాని  మోడీయే పంచ క‌ట్టుకుని ర‌జ‌నీని వ‌చ్చి క‌లిశారంటే దటీజ్ మేజిక్ ఆఫ్ సూప‌ర్ స్టార్.  అలాంటి ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం నార్త్ లో బిగ్ బీ అమితాబ్ ఎలా నాన్ స్టాప్ సినీ మార‌థాన్ చేస్తున్నారో.. సౌత్ లో అక్కినేని త‌ర్వాత అంత‌టి మూవీ  మార‌థాన్ చేస్తున్న వ‌న్ అండ్ ఓన్లీ ర‌జ‌నీకాంత్. హ్యాపీ బ‌ర్త్ డే ర‌జ‌నీ సార్!


  

మధుర జ్ఞాపకంగా మిగిలిన మెస్సీ టూర్ : రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో శనివారం (డిసెంబర్ 13) జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఫుట్ బాల్ అభిమానులకు మధురానుభూతిని ఇచ్చింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి , అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో  ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.  మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్న రేవంత్.. మాతో చేరి శనివారం సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని ప్రపంచానికి చాటామన్నారు. నగరం అంతటా విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం తరపున, మా అతిథులకు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం పర్యటన బిజీ బిజీగా ఉంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆదివారం (14న) ఢిల్లీలో జరిగే మహార్యాలీ కార్యక్రమంలో సీఎం  రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు .

మెస్సీ టూర్ ఖ‌ర్చు ఎవ‌రిది?

ఈ కార్ రేస్ ద్వారా 55 కోట్ల  రూపాయ‌ల మేర స్కామ్ జ‌రిగింది. హైద‌రాబాద్ లో ఉన్న రోడ్ల‌కూ, డ్రైనేజీల‌కూ ఇత‌ర‌త్రా వ‌స‌తులు లేవు. వాటిని ప‌ట్టించుకోకుండా ఈ హంగామా అవ‌స‌ర‌మా?   హెచ్ఎండీఏ డ‌బ్బు ఇలా ఎవ‌రైనా దుబారా చేస్తారా?  అంటూ ఇదే రేవంత్ స‌ర్కార్ ధూమ్ ధామ్ చేయ‌డంతో పాటు.. కేసులు కూడా  నమోదు చేసింది. అంతే కాదు కేటీఆర్ అరెస్టుకు  గ‌వ‌ర్న‌ర్ ని అనుమ‌తి  కూడా కోరింది. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి  రాలేద‌ని కూడా  రేవంత్  పెద్ద ఎత్తున దుమ్మెత్తి  పోశారు గత జూబ్హీహిల్స్ ఉప  ఎన్నిక‌ల ప్ర‌చారంలో. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజనం మెస్సీ హైద‌రాబాద్ రాక‌.. అనే ఈవెంట్ కి ఇంత భారీ ఎత్తున  ఖ‌ర్చు చేయ‌డం అవ‌స‌ర‌మా? అనే  ప్ర‌శ్న త‌లెత్తింది.. అయితే ఇందుకు ప్ర‌భుత్వం కూడా రియాక్ట‌య్యింది. ఇద‌స‌లు ప్ర‌భుత్వ  కార్య‌క్ర‌మం కానే కాదు.  ఇది ఒక  ప్రైవేటు కార్య‌క్ర‌మం. అయితే మెస్సీ ఎలాగూ ప‌ద‌నాలుగు ఏళ్ల త‌ర్వాత ఇండియా వ‌స్తున్నారు కాబ‌ట్టి.. ఇటీవ‌లే అంటే డిసెంబ‌ర్ 8, 9 తేదీల్లో ఇక్క‌డ తెలంగాణ రైజింగ్ ఈవెంట్ జ‌రిగింది కనుక ఇంట‌ర్నేష‌న‌ల్ గా తెలంగాణ రైజింగ్ స్లోగ‌న్ వినిపించాలంటే ఇదే అవ‌కాశ‌మ‌ని.. ఈ టూర్ ని పార్వ‌తీ  రెడ్డి అనే ఒక టూర్ ప్యాట్ర‌న్, స‌ల‌హాదారు సాయంతో మెస్సీని హైద‌రాబాద్ ర‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది. అస‌లు మెస్సీ టూర్ ప్లాన్ చేసింది శ‌త‌ద్రు ద‌త్తా. శ‌త‌ద్రు ద‌త్తా ఎవ‌రంటే.. ఈయ‌న ప‌శ్చిమ‌ బెంగాల్ లోని హుగ్లీకి  చెందిన వ్య‌క్తి. శ‌త‌ద్రు ద‌త్తా  ఇనిషియేటివ్ పేరిట ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండ‌క్ట్ చేస్తుంటారు. క్రీడ‌ల‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్ల  నిర్వ‌హ‌ణ  చేయ‌డం శ‌త‌ద్రు ద‌త్త ఇనిషియేటివ్ సంస్థ చేసే ప్ర‌ధానమైన ప‌ని. గ‌తంలోనూ పీలే, రొనాల్డినో, మార‌డోనా వంటి ప్ర‌ముఖ ఆట‌గాళ్ల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్లు నిర్వ‌హించారు శ‌త‌ద్రు ద‌త్తా. అందులో భాగంగానే 2022 లో అర్జెంటీనా ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌డంలో కీ రోల్ ప్లే చేసిన మెస్సీ  గోట్ ఇండియా టూర్- 2025 నిర్వ‌హించారు.  అయితే  ఈ విష‌యంలోనూ రాజ‌కీయ వివాదం రాజుకుంది. ఇప్ప‌టికే గ్రేట‌ర్ ని అతి పెద్ద డివిజ‌న్ల మ‌యంగా తీర్చిదిద్ద‌డంలో స‌ర్కార్ ని ఏకి  ప‌డేస్తున్న బీజేపీ.. ఈ విష‌యంలోనూ పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారం చెల‌రేగేలా చేసింది. మెస్సీ పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఖ‌ర్చు ఎంత‌? ఈ  నిధులు ఎక్క‌డి నుంచి తీసుకొచ్చారో చెప్పాలంటూ బీజేపీఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెస్సీతో క‌ల‌సి సీఎం రేవంత్ ఉప్ప‌ల్ స్టేడియంలో ఫుట్ బాల్ ఆడ్డానికి అయ్యే ఖ‌ర్చు ఏయే శాఖ‌లు నిర్వ‌హిస్తున్నాయో ఆ ఫుల్ డీటైల్స్ కావాలంటూ..డిమాండ్ చేస్తున్నారు బీజేపీ  నాయ‌కులు. అయితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మెస్సీ ప‌ర్య‌ట‌న కోప‌రేట్ చేస్తుందంటారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు. మెస్సీ రావ‌డంతో ప్ర‌పంచ వేదిక‌పై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ వినిపిస్తుంది. కనిపిస్తుంది.  తెలంగాణ‌కు మరింత మంచి పేరు వ‌స్తుంది. కనుక ఈ కార్య‌క్ర‌మం స‌రైన‌దే అంటున్నారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. అందులో భాగంగానే చివ‌ర్లో రేవంత్ రెడ్డి.. మెస్సీని ప్ర‌పంచ‌మంతా చూస్తుండ‌గా... తెలంగాణ  రైజింగ్ క‌మ్ జాయిన్ ద రైస్.. అంటూ నిన‌దించారు.  కాబ‌ట్టి ఇదంతా ప్ర‌భుత్వమే  అంతా ఖ‌ర్చు చేసి నిర్వ‌హించిన  కార్య‌క్ర‌మం కాదు వంద‌ల వేల కోట్ల ఖ‌ర్చు అస‌లే చేయ‌లేదు. ఇండియా టూర్ వ‌చ్చిన మెస్సీని హైద‌రాబాద్ కూడా వ‌చ్చి పొమ్మ‌ని ఒక చిన్న అడ్జ‌స్ట్ మెంట్ చేశామంతే.. ఆయ‌న్ను తెలంగాణ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తామ‌ని చెప్పామంటున్నారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు. ఇది తెలంగాణ‌లో యువ‌జ‌న  క్రీడాభివృద్ధికి తోడ్ప‌డుతుంది కాబ‌ట్టి ఇందులో దురుద్దేశాల‌ను ఆపాదించ‌వ‌ద్ద‌ని కోరుతోంది తెలంగాణ ప్ర‌భుత్వం.

పాక్‌కి భారత్ అండర్ -19 టీమ్ నో షేక్‌హ్యాండ్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయని విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని యువ భారత్ అండర్ 19 ఆసియా కప్‌లో కొనసాగించింది. అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ మ్యాచులోనూ ‘నో హ్యాండ్ షేక్’ ఘటన పునరావృతం అయింది. పహల్గాం అటాక్ తర్వాత భారత్-పాక్ మధ్య వైరం తీవ్రతరమైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపించారు. ట్రోఫీ గెలిచినప్పటికీ.. పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ కూడా తీసుకోలేదు. ఇదే విధానాన్ని యువ భారత్ ఈ అండర్ 19 టోర్నీలోనూ కొనసాగించింది. అయితే భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేసేలా చూడాలని బీసీసీఐను ఐసీసీ అభ్యర్థించినట్లు సమాచారం. కానీ నిర్ణయాన్ని బీసీసీఐకే వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

బ్రౌన్ వర్సిటీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలో, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్.. ఇలా జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ కాల్పుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ బ్రౌన్ యూనివర్సిటీ ఆవరణలో నల్లని దుస్తులు ధరించిన అగంతకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. వర్సిటీలో పరీక్షలు జరుగుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి బ్రౌన్ యూనివర్సిటీ భవనంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై విచారణ కొనసాగుతోంది.   ఘటన జరిగిన వెంటనే కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఆ తరువాత ఇంకా పట్టుకోలేదని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు కూడా బ్రౌన్ వర్సిటీలో కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించి, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.  ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా కాల్పుల ఘటనను ఖండించారు.  దర్యాప్తులో ఎఫ్‌బీఐ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 

సీఐసీ ప్రధాన కమిషనర్ గా రాజ్ కుమార్ గోయెల్

కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన కమిషనర్ సహా ఖాళీగా ఉన్న ఎనిమిది పోస్టులనూ భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 9 సంవత్సరాల తరువాత కేంద్ర సమాచార కమిషన్ పూర్తి స్థాయికి చేరుకుంది. కేంద్ర సమాచార కమిషనర్ గా రిటైర్డ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ నియమితులయ్యారు.  ప్రధాని మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు ఈ నియామకాలు జరిగాయి.  రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సీఐసీ ప్రధాన కమిషనర్ చేత సోమవారం (డిసెంబర్ 15) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఆయనతో పాటు నిమమితులైన ఎనిమిది మంది సీఐసీ కమిషర్లలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్‌ రమేశ్‌, అశుతోష్‌ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి   వంటి ప్రముఖులు ఉన్నారు.  గత ఏడాది సెప్టెంబర్ నుంచీ సీఐసీ ప్రధాన కమిషనర్ పోస్టు, అలాగే 2023 నుంచి ఎనిమిది మంది డైరెక్టర్ల పోస్టులూ ఖాళీగా ఉన్నాయి.   ఇక సీఐసీ కమిషనర్ గా నియమితులైన ఏపీకి చెందిన సుధారాణి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, లా గ్రాడ్యుయేషన్ చేశారు. గతంలో సీబీఐ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ గా, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా చేశారు. ప్రస్తుతం పీఎన్జీఆర్బీ సభ్యురాలిగా ఉన్నారు.  

అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు.. తెలంగాణ పోలీసులకు మెస్సీ బృందం అభినందనలు

హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు పోలీసులు కల్పించిన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లపై ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్‌ మెస్సీ మేనేజర్‌,  ఆయన భద్రతా బృందం కూడా  ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భం గా రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)  బి. శివధర్‌రెడ్డి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌   సుధీర్‌బాబులను వారు ప్రత్యేకంగా అభినందించారు. మ్యాచ్ అనంతరం, మెస్సీ బృందం సంతృప్తి  వ్యక్తం చేసింది. అంతర్జా తీయ స్థాయిలో జరిగిన ఈ హైప్రొఫైల్‌ క్రీడా కార్యక్రమానికి పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉన్నాయని పేర్కొంది. స్టేడియం లోపలా బయటా కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, వేలాది మంది ప్రేక్షకుల రాకపోకలను సజావుగా నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపింది. ముఖ్య అతిథులు, మెస్సీ బృందం రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా పోలీసులు తీసుకున్న జాగ్రత్తలు తమను ఎంతగానో ఆకట్టుకున్నా యని మెస్సీ మేనేజర్‌ పేర్కొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చినా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకో కుండా, ప్రశాంత వాతావరణంలో మ్యాచ్‌ ముగియడం పోలీసుల ప్రొఫెషనల్ ఎఫిషియెన్సీకి నిదర్శనమని పొగడ్తల వర్షం కురిపించారు. మెస్సీ, ఆయన బృందానికి కల్పించిన ఎస్కార్ట్‌ సేవలు, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. మెస్సీ బృందం నుంచి వచ్చిన ఈ అభినందనలు రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణంగా నిలవడమే కాకుండా, వారి సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా మారాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం  ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, పోలీసు అధికారులు, సిబ్బందిని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్    బి. శివధర్ రెడ్డి అభినందించారు. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ సందర్భంగా  చిన్న లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా విజయవంతంగా ముగిసేలా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారని డీజీపీ ప్రశంసించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ  బి. శివధర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం (డిసెంబర్ 13) ఉదయం కోల్‌కతా లో జరిగిన ఘటనను దృష్టి లో పెట్టుకుని అప్రమత్తమై, అక్కడ చోటుచేసుకున్న లోపాలను విశ్లేషించి, ఉప్పల్ స్టేడియంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. అభిమానులు ఎవరూ గ్రౌండ్‌లోకి ప్రవేశించ కుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు.మ్యాచ్ ప్రశాంతం గా, విజయవంతంగా ముగియడంలో సహ కరించిన ఫుట్‌బాల్ క్రీడాభిమానులు, మెస్సీ అభిమానులకు డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

జగన్, షర్మిల ఎడతెగని ఆస్తుల పంచాయతీ..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత చెల్లి షర్మిలతో ఆస్తుల పంచాయతీ ఎడతెగకుండా సాగుతోంది.  ఈ ఆస్తుల పంచాయతీలో జగన్, ఆయన భార్య భారతీ రెడ్డీ ఒక వైపు ఉంటే.. షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ నిలిచారు.  ముఖ్యంగా సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కు ఎక్కింది. ఇరు వర్గాలూ అంటే జగన్ , భారతీ, విజయమ్మ, షర్మిలలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ కేసులో ఎన్సీఎల్టీలో ఎప్పటికప్పుడు విజయమ్మ, జగన్ లు పిటిషన్లు, కౌంటర్లు దాఖలు చేసుకుంటున్నారు. ఒకరు ముందు దాఖలు చేసిన పిటిషన్ పై మరొకరు కౌంటర్ దాఖలు చేస్తున్నారు. దానినీ కౌంటర్ చేస్తూ మళ్లీ పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి.    తాజాగా జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి షర్మిల దెబ్బతీయాలని ప్రయత్నించిందంటూ  ఎన్సీఎల్టీకి నివేదిక అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో చెల్లితో చేసుకున్న ఆస్తుల   ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తన కౌంటర్‌లో పేర్కొన్నారు. వివాదానికి కారణమైన ఆస్తులన్నీ తన స్వార్జితమని పేర్కొంటూ జగన్  ఎన్సీఎల్టీలో సమగ్ర కౌంటర్‌ దాఖలు చేశారు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో వాటాల బదిలీ అంశంపై గతంలో వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమకు చెందిన షేర్లను అక్రమంగా తల్లి వైఎస్‌ విజయమ్మ   బదిలీ చేశారని ఆరోపిస్తూ, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై వైఎస్‌ షర్మిల అప్పీల్‌ చేయడంతో, ఆమెకు ఈ వ్యవహారంలో ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవనీ, . అప్పీల్‌ చేసే అర్హత కూడా షర్మిలకు లేదని జగన్‌ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. చెల్లిపై ఉన్న ప్రేమాభిమానాలతో గతంలో భవిష్యత్తులో ఆస్తులు బదిలీ చేయాలనే ఉద్దేశంతో ఒప్పందం కుదిరిందని పిటిషన్ లో పేర్కొన్న జగన్.. అయితే ఆ మేరకు జరిగిన వాటాల బదిలీకి మూడేళ్లు పూర్తైనప్పటికీ, ఇంతకాలం మౌనంగా ఉన్న షర్మిల ఇప్పుడు అప్పీల్‌ చేయడం వెనుక ఉద్దేశాలపై  సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ, తన వాదనలను ట్రిబ్యునల్‌ ముందు జగన్‌ ఉంచారు.

ఓటేసేందుకు వెడుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు వెడుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడినవిషాద ఘటన ఇది. మెదక్ జిల్లా పెద శంకరం పేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పంచాయతీ ఎన్నికలలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామరెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది   బైక్ పై వెడుతున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో  ఎనిమిదేళ్ల చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను లింగమయ్య, సాయమ్మ, సాయిలు, మానసలుగా గుర్తించారు.సమాచారం అందుకున్న   పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసిటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఆదివారం (డిసెంబర్ 14) పోలింగ్ ఉండటంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం (డిసెంబర్ 14)  బయలుదేరిన ఈ కుటుంబం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంమాగీ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  ప్రాణం తీసిన ఓటు  అంటూ   గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సీఎం రేవంత్ గోల్...మెస్సీ చప్పట్లు

  గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో ఉప్పల్ వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ముఖ్యమంత్రి ఆర్ ఆర్9 టీమ్‌తో బరిలో దిగారు. అపర్ణ టీమ్ తరుపున మెస్సీ ఆడారు. ఈ మ్యాచ్‌లో రేవంత్‌రెడ్డి ఒక గోల్‌ కొట్టగా.. మెస్సి రెండు గోల్స్‌ రాబట్టాడు. మరోవైపు మోస్సీని దగ్గర నుంచి చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలి రావడంతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ ఈవెంట్, మంగ్లీ పాటలతో స్టేడియం హోరెత్తింది. లేజర్ షో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.  కోల్‌కతాలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియం లో మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలు, నీళ్ల బాటిళ్లు విసిరిన ఘటనలు జరగడంతో, ఇలాంటి పరిస్థి తులు హైదరాబాద్‌లో పునరావృతం కాకూడదని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.  వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా 34 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. స్టేడియం చుట్టూ సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మొత్తం మీద మెస్సీ హైదరాబాద్ పర్యటనను సురక్షితంగా, ఘనంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాది  

ఉప్పల్ స్టేడియానికి లియోనెల్ మెస్సీ

  గ్లోబల్ సాకర్ లెజెండ్ లియోనెల్ మెస్సీ శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొనన్నున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేవలం 250 మందికి మాత్రమే మోస్సీని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు.  అనంతరం  మెస్సీ బృందం ఉప్పల్‌ స్టేడియానికి చేరుకుంటుంది. మెస్సి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత  ఏర్పాటు చేశారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఫలక్‌నుమా ప్యాలెస్‌, ఉప్పల్ స్టేడియం వద్ద  బందోబస్తు పెంచారు.