సీఎం రేవంత్ గోల్...మెస్సీ చప్పట్లు
posted on Dec 13, 2025 @ 7:35PM
గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో ఉప్పల్ వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ముఖ్యమంత్రి ఆర్ ఆర్9 టీమ్‌తో బరిలో దిగారు. అపర్ణ టీమ్ తరుపున మెస్సీ ఆడారు. ఈ మ్యాచ్‌లో రేవంత్‌రెడ్డి ఒక గోల్ కొట్టగా.. మెస్సి రెండు గోల్స్ రాబట్టాడు.
మరోవైపు మోస్సీని దగ్గర నుంచి చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలి రావడంతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ ఈవెంట్, మంగ్లీ పాటలతో స్టేడియం హోరెత్తింది. లేజర్ షో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
కోల్‌కతాలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియం లో మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలు, నీళ్ల బాటిళ్లు విసిరిన ఘటనలు జరగడంతో, ఇలాంటి పరిస్థి తులు హైదరాబాద్‌లో పునరావృతం కాకూడదని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా 34 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. స్టేడియం చుట్టూ సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మొత్తం మీద మెస్సీ హైదరాబాద్ పర్యటనను సురక్షితంగా, ఘనంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాది