స‌రికొత్త సనాత‌న సార‌ధి.... సాయిరెడ్డి!?

 

విజ‌య‌సాయి రెడ్డి హిందుత్వ వైపు అడుగులు వేస్తున్నారా? ఎందుకీ మాట అనాల్సి వ‌స్తోంది? జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా  సాయిరెడ్డి స‌నాత‌న‌త్వం అని ఒక‌టి వెలుగు చూస్తోందా? ఇలా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోంద‌ని చూస్తే ముచ్చ‌ట‌గా మూడు కామెంట్ల‌లో ఆయ‌న  ప్ర‌య‌త్నం, ప్ర‌యాణం, ప‌ద ప్ర‌యోగం ఏంటో చూడొచ్చు..

అందులో భాగంగా స్టెప్ వ‌న్.. ఢిల్లీ వేదిక‌గా ఆయ‌న వైసీపీ  నుంచి అన్ని ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి  పేరు ప‌దే ప‌దే చెప్పారు.  తాను రాజ‌కీయ స‌న్యాసం  త‌ర్వాత వ్య‌వ‌సాయం  చేస్తాన‌ని  చెప్పుకొచ్చారు. వీలుంటే  మీడియా సంస్థ పెడ‌తానేమోగానీ రాజ‌కీయాల్లోకి రాను. రాలేను. రాబోను.. అంటూ కుండ  బ‌ద్ధ‌లు కొట్టారు.

క‌ట్ చేస్తే మ‌రో కీల‌క‌మైన కామెంట్ ఏం చేశారో చూస్తే.. సిక్కోలు గ‌డ్డ మీద నుంచి తాను ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ పార్టీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని.. బీజేపీలో చేర‌బోతున్న మాట అవాస్త‌వ‌మ‌నీ.. అన్నారు విజ‌య‌సాయిరెడ్డి. అదే స‌మ‌యంలో ఆయ‌న అవ‌స‌ర‌మైతే పార్టీ పెట్ట‌డానికి కూడా వెన‌కాడ‌న‌ని అన్నారు. 

ఈ టైంలో ఆయ‌న చివ‌రాఖ‌రిగా అన్న మాట‌లేంట‌ని చూస్తే.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త‌న‌కు రెండు ద‌శ‌కాల‌కు పైగా  సాన్నిహిత్య‌ముంద‌ని ఒక చిన్న‌హింట్ ఇచ్చారు. సేనాని ప్ర‌స్తుతం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారో మ‌నంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డో త‌మిళ‌నాడులోని మ‌ధురైలో జ‌రిగిన‌ మురుగ‌న్ మానాడుకు హాజ‌ర‌య్యారు. 

నిన్న మొన్న  త‌మిళ కార్తీక దీపోత్స‌వం వ్య‌వ‌హారంలో తీర్పునిచ్చిన స్వామినాథ‌న్ అనే ఒకానొక జ‌డ్జిపై ఇండి కూట‌మి ఎంపీలు అవిశ్వాసం పెట్టే  య‌త్నం జ‌రిగింది. ఇలాంటి విష‌యాల్లో హిందుత్వ వాదుల వైపు పోరాడ్డానికి స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్యావ‌శ్య‌కంగా సెల‌విచ్చారు సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్. 

రీసెంట్ గా విజ‌య‌సాయి రెడ్డి  హిందుత్వ ప్రోగా అన్న మాట‌ల విష‌యానికి వ‌స్తే.. హిందూ దేవాలయాలపై ఒక‌ ట్వీట్ చేశారు. దీని సారాంశ‌మేంటో చూస్తే.. హైంద‌వ‌ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.. దేవాలయాలపై ప్రభుత్వ  నియంత్రణ- ఆర్టికల్ 14కు విరుద్ధమని అన్నారు. 

ఇతర మతాలకు చెందిన ప్రార్ధ‌నాలయాలు స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయనీ.. అన్ని మతాలకు సమానత్వం కల్పించాలనీ కోరారు స‌రికొత్త స‌నాత‌న సార‌ధి సాయిరెడ్డి. రాజ్యంగ బద్ధంగా మతాల మధ్య సమానత్వం ఉండాలనీ.. ప్రస్తుత విధానాలను కేంద్రం పున:పరిశీలించాలనీ డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. హోంమంత్రి అమిత్ షా ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాలని కూడా కోరారాయన.

వీట‌న్నిటిని బ‌ట్టీ.. సాయిరెడ్డి పోక‌డ చూస్తుంటే హిందుత్వ‌కే బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన బీజేపీలో చేర‌డ‌మా?  లేక స‌నాత‌నాన్ని భుజానికెత్తుకుని తిరుగుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచ‌న చేర‌డ‌మా రెండిట్లో ఏదో ఒక‌టి జ‌రగ‌డం ఖాయంగా తెలుస్తోందంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. ఎనీహౌ అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ ఫ‌ర్ యువ‌ర్ లేటెస్ట్ స‌నాత‌న సార‌ధ్యం అని మ‌నం కూడా ఓ శుభాకాంక్ష‌లు చెప్పి ఉంచుదాం. ఎప్ప‌టికైనా ప‌నికొస్తుందేమో చూద్దాం.

టోలిచౌక్‌లో ఓ యువకుడి దారుణ హత్య

ఘర్షణ ఆపడానికి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ టోలీచౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం (డిసెంబర్ 14) రాత్రి జరగింది. వివరాలిలా ఉన్నాయి.  పరమౌంట్‌ కాలనీలో ఆదివారం రాత్రి సమయంలో టోలిచౌక్‌ కుంట విరాట్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌ తన తమ్ముడు అదనాన్‌  బిలాల్‌ లమధ్య గొడవ జరుగుతున్నట్లు  తెలుసుని ఆ గొడవ ఆపేందుకు అక్కడకు వెళ్లాడు.  అయితే చినికి చినికి   గాలి వాన అయినట్లుగా ఆ గొడవ కాస్తా పెద్దదైంది.  బిలాల్ ఒక్కసారిగా ఇర్ఫాన్‌పై  కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇర్ఫాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మరణించాడు.  సమాచారం అందుకున్న  టోలిచౌక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు బిలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేశారు, గొడవకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో పరమౌంట్‌ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. గొడవ ఆపడానికి వెళ్లిన కొడుకు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో  అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సఫారీలను చిత్తు చేసిన టీమ్ ఇండియా

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అలవోక విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సఫారీ సేన.. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి కేవలం 117 పరుగులకే ఆలౌటైంది.  118 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమ్ ఇండియా   15.5 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంలో  5 టీ ట్వంటీల సిరీస్ లో టీమ్ ఇండియా  2-1 ఆధిపత్యంలోకి దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో భారత బౌలర్లు చెలరేగారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. అసాధారణ ప్రదర్శన చేసింది. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా విజృంభించి సౌతాఫ్రికాను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఆ తరువాత  ఛేదనలొ భారత్ మూడు వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఓటమిపై  సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ మాట్లాడుతూ..  బ్యాటింగ్‌కు కఠినమైన పరిస్థితులు ఉన్నాయన్నాడు. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. తాము వరుసగా ఐదు వికెట్లు కోల్పోయామన్న మార్కరమ్,  భారత బౌలర్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలన్నాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ఓటమికి కారణమన్న మార్కరమ్..  భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. వాటిని ఎదుర్కోవడానికి.. తిరిగి ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన మార్గాలు కనుగొనాలని అభిప్రాయపడ్డాడు.   టీమ్ ఇండియా బౌలర్లు తమకు పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదనీ,  తాను ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని,  తాను ఇంకాస్త దూకుడు పెంచి 140-150 పరుగుల స్కోరు జట్టుకు అందించి ఉంటే.. మ్యాచ్ రసవత్తరంగా జరిగేదన్నాడు. డెత్ ఓవర్లలో తాను ఔటైన బంతి భారీ షాట్ కొట్టగలిగేదేనని, ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలనుకునే బౌలర్‌పై మాత్రమే విరుచుపడాలని తెలిపాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ప్రొటీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి సఫారీల బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఛేదనకు దిగిన టీమిండియా 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది.

ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్  పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం (డసెంబర్ 14) ఆవిష్కరించారు. ఇదే పుస్తకాన్ని 'విలీనం -విభజన' పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి  అనువదించారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన  అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన  22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ను తెలుగులోని విలీనం- విభజన పేరిట అనువదించిన అనూరాధను అభినందించారు.  

కరీంనగర్ లో పునుగుపిల్లి

తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పునుగుపిల్లి తెలంగాణలోని కరీంనగర్ లో దర్శనమిచ్చింది. సాధారణంగా దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన క్షీరజం మైదాన ప్రాంతంలో కనిపించడం విస్మయం గొలిపింది. కరీంనగర్ లోని హిందుపురి కాలనీలో ఆదివారం (డిసెంబర్ 14) ఓ వ్యక్తి ఇంట్లో పునుగుపల్లి కనిపించింది. వెంటనే ఆ ఇంటి యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ఈ పునుగుపిల్లిని క్షేమంగా పట్టుకుని డీర్ పార్క్ కు తరలించి వైద్యం అందించారు. అది పూర్తిగా కోలుకున్న తరువాత  దానిని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టనున్నారు.  ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శేషాచలం కొండల్లో మాత్రమే అధికంగా కనిపించే పునుగుపిల్లి   తైలాన్ని తిరుమల శ్రీవారి అభిషేక సేవలో ఉపయోగిస్తారు.  అలాగే ఈ పునుగు పిల్లి విసర్జన నుంచి సేకరించిన గింజలతో తయారుచేసే  కోపి లువాక్' కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ప్రసిద్ధి చెందింది.   

కీలక రంగాల్లో దూసుకుపోతున్న ఏపీ.. పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఫస్ట్

ఆంధ్రప్రదేశ్ పలు కీలక రంగాల్లో ముందంజ వేస్తున్నది. ముఖ్యంగా పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రిజర్వబ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.  ఆంధ్రప్రదేశ్  1 కోటి 93 లక్షల టన్నుల పండ్లను ఉత్పత్తితోనూ,  51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో నూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.   అంతే కాకుండా ఏపీ ఆర్థికంగానూ  స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.   2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర  జీఎస్డీపీ రూ.15.93 లక్షల కోట్లు ఉండగా  జీఎస్‌డీపీ రూ.2.66 లక్షలుగా నమోదైందని ఆ నివేదిక పేర్కొంది. అదే విధంగా విద్యుత్ లభ్యతలో ఏపీ1481 యూనిట్లతో దేశంలో 14వ స్థానంలో ఉంది. ప్రజారోగ్యం విషయంలో  ఏపీ సగటు ఆయుర్దాయం 70 ఏళ్లుగా నమోదైంది. ఇందులో పురుషుల సగటు జీవితకాలం 68 సంవత్సరాలు కాగా, మహిళల సగటు జీవితకాలం 73 ఏళ్లుగా ఉంది.

మధుర జ్ఞాపకంగా మిగిలిన మెస్సీ టూర్ : రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో శనివారం (డిసెంబర్ 13) జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఫుట్ బాల్ అభిమానులకు మధురానుభూతిని ఇచ్చింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి , అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో  ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.  మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్న రేవంత్.. మాతో చేరి శనివారం సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని ప్రపంచానికి చాటామన్నారు. నగరం అంతటా విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం తరపున, మా అతిథులకు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం పర్యటన బిజీ బిజీగా ఉంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆదివారం (14న) ఢిల్లీలో జరిగే మహార్యాలీ కార్యక్రమంలో సీఎం  రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు .

మెస్సీ టూర్ ఖ‌ర్చు ఎవ‌రిది?

ఈ కార్ రేస్ ద్వారా 55 కోట్ల  రూపాయ‌ల మేర స్కామ్ జ‌రిగింది. హైద‌రాబాద్ లో ఉన్న రోడ్ల‌కూ, డ్రైనేజీల‌కూ ఇత‌ర‌త్రా వ‌స‌తులు లేవు. వాటిని ప‌ట్టించుకోకుండా ఈ హంగామా అవ‌స‌ర‌మా?   హెచ్ఎండీఏ డ‌బ్బు ఇలా ఎవ‌రైనా దుబారా చేస్తారా?  అంటూ ఇదే రేవంత్ స‌ర్కార్ ధూమ్ ధామ్ చేయ‌డంతో పాటు.. కేసులు కూడా  నమోదు చేసింది. అంతే కాదు కేటీఆర్ అరెస్టుకు  గ‌వ‌ర్న‌ర్ ని అనుమ‌తి  కూడా కోరింది. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి  రాలేద‌ని కూడా  రేవంత్  పెద్ద ఎత్తున దుమ్మెత్తి  పోశారు గత జూబ్హీహిల్స్ ఉప  ఎన్నిక‌ల ప్ర‌చారంలో. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజనం మెస్సీ హైద‌రాబాద్ రాక‌.. అనే ఈవెంట్ కి ఇంత భారీ ఎత్తున  ఖ‌ర్చు చేయ‌డం అవ‌స‌ర‌మా? అనే  ప్ర‌శ్న త‌లెత్తింది.. అయితే ఇందుకు ప్ర‌భుత్వం కూడా రియాక్ట‌య్యింది. ఇద‌స‌లు ప్ర‌భుత్వ  కార్య‌క్ర‌మం కానే కాదు.  ఇది ఒక  ప్రైవేటు కార్య‌క్ర‌మం. అయితే మెస్సీ ఎలాగూ ప‌ద‌నాలుగు ఏళ్ల త‌ర్వాత ఇండియా వ‌స్తున్నారు కాబ‌ట్టి.. ఇటీవ‌లే అంటే డిసెంబ‌ర్ 8, 9 తేదీల్లో ఇక్క‌డ తెలంగాణ రైజింగ్ ఈవెంట్ జ‌రిగింది కనుక ఇంట‌ర్నేష‌న‌ల్ గా తెలంగాణ రైజింగ్ స్లోగ‌న్ వినిపించాలంటే ఇదే అవ‌కాశ‌మ‌ని.. ఈ టూర్ ని పార్వ‌తీ  రెడ్డి అనే ఒక టూర్ ప్యాట్ర‌న్, స‌ల‌హాదారు సాయంతో మెస్సీని హైద‌రాబాద్ ర‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది. అస‌లు మెస్సీ టూర్ ప్లాన్ చేసింది శ‌త‌ద్రు ద‌త్తా. శ‌త‌ద్రు ద‌త్తా ఎవ‌రంటే.. ఈయ‌న ప‌శ్చిమ‌ బెంగాల్ లోని హుగ్లీకి  చెందిన వ్య‌క్తి. శ‌త‌ద్రు ద‌త్తా  ఇనిషియేటివ్ పేరిట ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండ‌క్ట్ చేస్తుంటారు. క్రీడ‌ల‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్ల  నిర్వ‌హ‌ణ  చేయ‌డం శ‌త‌ద్రు ద‌త్త ఇనిషియేటివ్ సంస్థ చేసే ప్ర‌ధానమైన ప‌ని. గ‌తంలోనూ పీలే, రొనాల్డినో, మార‌డోనా వంటి ప్ర‌ముఖ ఆట‌గాళ్ల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్లు నిర్వ‌హించారు శ‌త‌ద్రు ద‌త్తా. అందులో భాగంగానే 2022 లో అర్జెంటీనా ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌డంలో కీ రోల్ ప్లే చేసిన మెస్సీ  గోట్ ఇండియా టూర్- 2025 నిర్వ‌హించారు.  అయితే  ఈ విష‌యంలోనూ రాజ‌కీయ వివాదం రాజుకుంది. ఇప్ప‌టికే గ్రేట‌ర్ ని అతి పెద్ద డివిజ‌న్ల మ‌యంగా తీర్చిదిద్ద‌డంలో స‌ర్కార్ ని ఏకి  ప‌డేస్తున్న బీజేపీ.. ఈ విష‌యంలోనూ పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారం చెల‌రేగేలా చేసింది. మెస్సీ పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఖ‌ర్చు ఎంత‌? ఈ  నిధులు ఎక్క‌డి నుంచి తీసుకొచ్చారో చెప్పాలంటూ బీజేపీఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెస్సీతో క‌ల‌సి సీఎం రేవంత్ ఉప్ప‌ల్ స్టేడియంలో ఫుట్ బాల్ ఆడ్డానికి అయ్యే ఖ‌ర్చు ఏయే శాఖ‌లు నిర్వ‌హిస్తున్నాయో ఆ ఫుల్ డీటైల్స్ కావాలంటూ..డిమాండ్ చేస్తున్నారు బీజేపీ  నాయ‌కులు. అయితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మెస్సీ ప‌ర్య‌ట‌న కోప‌రేట్ చేస్తుందంటారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు. మెస్సీ రావ‌డంతో ప్ర‌పంచ వేదిక‌పై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ వినిపిస్తుంది. కనిపిస్తుంది.  తెలంగాణ‌కు మరింత మంచి పేరు వ‌స్తుంది. కనుక ఈ కార్య‌క్ర‌మం స‌రైన‌దే అంటున్నారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. అందులో భాగంగానే చివ‌ర్లో రేవంత్ రెడ్డి.. మెస్సీని ప్ర‌పంచ‌మంతా చూస్తుండ‌గా... తెలంగాణ  రైజింగ్ క‌మ్ జాయిన్ ద రైస్.. అంటూ నిన‌దించారు.  కాబ‌ట్టి ఇదంతా ప్ర‌భుత్వమే  అంతా ఖ‌ర్చు చేసి నిర్వ‌హించిన  కార్య‌క్ర‌మం కాదు వంద‌ల వేల కోట్ల ఖ‌ర్చు అస‌లే చేయ‌లేదు. ఇండియా టూర్ వ‌చ్చిన మెస్సీని హైద‌రాబాద్ కూడా వ‌చ్చి పొమ్మ‌ని ఒక చిన్న అడ్జ‌స్ట్ మెంట్ చేశామంతే.. ఆయ‌న్ను తెలంగాణ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తామ‌ని చెప్పామంటున్నారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు. ఇది తెలంగాణ‌లో యువ‌జ‌న  క్రీడాభివృద్ధికి తోడ్ప‌డుతుంది కాబ‌ట్టి ఇందులో దురుద్దేశాల‌ను ఆపాదించ‌వ‌ద్ద‌ని కోరుతోంది తెలంగాణ ప్ర‌భుత్వం.

పాక్‌కి భారత్ అండర్ -19 టీమ్ నో షేక్‌హ్యాండ్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయని విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని యువ భారత్ అండర్ 19 ఆసియా కప్‌లో కొనసాగించింది. అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ మ్యాచులోనూ ‘నో హ్యాండ్ షేక్’ ఘటన పునరావృతం అయింది. పహల్గాం అటాక్ తర్వాత భారత్-పాక్ మధ్య వైరం తీవ్రతరమైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపించారు. ట్రోఫీ గెలిచినప్పటికీ.. పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ కూడా తీసుకోలేదు. ఇదే విధానాన్ని యువ భారత్ ఈ అండర్ 19 టోర్నీలోనూ కొనసాగించింది. అయితే భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేసేలా చూడాలని బీసీసీఐను ఐసీసీ అభ్యర్థించినట్లు సమాచారం. కానీ నిర్ణయాన్ని బీసీసీఐకే వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

బ్రౌన్ వర్సిటీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలో, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్.. ఇలా జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ కాల్పుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ బ్రౌన్ యూనివర్సిటీ ఆవరణలో నల్లని దుస్తులు ధరించిన అగంతకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. వర్సిటీలో పరీక్షలు జరుగుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి బ్రౌన్ యూనివర్సిటీ భవనంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై విచారణ కొనసాగుతోంది.   ఘటన జరిగిన వెంటనే కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఆ తరువాత ఇంకా పట్టుకోలేదని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు కూడా బ్రౌన్ వర్సిటీలో కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించి, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.  ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా కాల్పుల ఘటనను ఖండించారు.  దర్యాప్తులో ఎఫ్‌బీఐ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 

సీఐసీ ప్రధాన కమిషనర్ గా రాజ్ కుమార్ గోయెల్

కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన కమిషనర్ సహా ఖాళీగా ఉన్న ఎనిమిది పోస్టులనూ భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 9 సంవత్సరాల తరువాత కేంద్ర సమాచార కమిషన్ పూర్తి స్థాయికి చేరుకుంది. కేంద్ర సమాచార కమిషనర్ గా రిటైర్డ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ నియమితులయ్యారు.  ప్రధాని మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు ఈ నియామకాలు జరిగాయి.  రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సీఐసీ ప్రధాన కమిషనర్ చేత సోమవారం (డిసెంబర్ 15) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఆయనతో పాటు నిమమితులైన ఎనిమిది మంది సీఐసీ కమిషర్లలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్‌ రమేశ్‌, అశుతోష్‌ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి   వంటి ప్రముఖులు ఉన్నారు.  గత ఏడాది సెప్టెంబర్ నుంచీ సీఐసీ ప్రధాన కమిషనర్ పోస్టు, అలాగే 2023 నుంచి ఎనిమిది మంది డైరెక్టర్ల పోస్టులూ ఖాళీగా ఉన్నాయి.   ఇక సీఐసీ కమిషనర్ గా నియమితులైన ఏపీకి చెందిన సుధారాణి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, లా గ్రాడ్యుయేషన్ చేశారు. గతంలో సీబీఐ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ గా, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా చేశారు. ప్రస్తుతం పీఎన్జీఆర్బీ సభ్యురాలిగా ఉన్నారు.