జయసుధకి రాజకీయ నేపద్యం ఉంటే నేరమా?
posted on Apr 17, 2015 @ 9:17PM
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికయిన రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కొంచెం అతిగా స్వంత డప్పు కొట్టుకొన్నారు. అదేవిధంగా తనపై పోటీ చేసిన జయసుధ వర్గం చాలా అన్యాయంగా, దుర్మార్గంగా వ్యవహరించిందని అనవసరమయిన మాటాలు మాట్లాడేరు. ఎన్నికలలో గెలిచిన తరువాత మరింత హుందాగా వ్యవహరిస్తే బాగుండేది. కానీ ఆయన అనవసరమయిన కామెడీ చాలా చేసారు. ఈ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తారని భావించిన జయసుధ ఓడిపోవడం, గెలిచే అవకాశాలు లేవనుకొన్న ఆయన భారీ మెజార్టీతో గెలవడం వెనుక రాజేంద్రప్రసాద్ వాదిస్తున్నట్లుగా రాజకీయాలు కాక ఇంకా ఇతర కారణాలే చాలానే ఉన్నాయి.
తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న హీరో, హీరోయిన్లకు , జూనియర్ ఆర్టిస్టులకు ఎటువంటి గౌరవం, గుర్తింపు లేదనే సంగతి పెద్ద బ్రహ్మ రహస్యమేమీ కాదు. అయితే వారికి అండగా నిలబడవలసిన ‘మా’ కూడా నిర్లక్ష్యం చేయడం వలన, ఇంతవరకు ‘మా’కు అధ్యక్షుడిగా కొనసాగిన మురళీ మోహన్ జయసుధకు మద్దతు తెలుపడంతో వారందరూ జయసుధను ఓడిస్తే ఆయననే ఓడించినట్లవుతుందనే ఉద్దేశ్యంతోనే రాజేంద్రప్రసాద్ కు ఓటు వేసి గెలిపించారు. అందుకే ఆమె ఓటమి మురళీమోహన్ ఓటమిగానే చూడాలని సీనియర్ నటుడు విజయ్ చందర్ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కి సినీ పరిశ్రమలో చిన్న తారలు, జూనియర్ ఆర్టిస్టులతో సత్సంబంధాలు కలిగి ఉండటం కూడా ఆయనకీ కలిసి వచ్చింది. కానీ జయసుధకు కూడా సినీ పరిశ్రమలో మంచి పేరుంది. ఒకవేళ మురళీ మోహన్ ఆమెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించకపోయుంటే, అప్పుడు తప్పకుండా వారందరి ఓట్లు చీలిపోయేవేమో.
జయసుధ రాజకీయ నేపధ్యం కలిగి ఉండటం, ఆమెకు తెదేపా యంపీ మురళీమోహన్ మద్దతు ప్రకటించడం నేరమేమీ కాదు. కానీ ఆ వంకతో ఆమె వర్గంవారు తమపై చాలా ఒత్తిడి తెచ్చారని చెప్పడం మాత్రం తప్పు. ఒకవేళ నిజంగా జయసుధ వెనుక ఉన్న రాజకీయ నాయకులు రాజేంద్రప్రసాద్ వర్గంపై ఒత్తిడి తెచ్చినా అది ఎన్నికల యుద్దంలో భాగంగానే తీసుకోవాలి తప్ప ఆమెను సినీ పరిశ్రమ ముందు, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించడం చాలా తప్పు.
నిజానికి ఆమె చాలా కాలంగా ఏదో ఒక రూపంగా సమాజసేవ చేస్తున్నారు. ఆమె రాజకీయాలలో ప్రవేశించడానికి కారణం కూడా అదే. కానీ ఆమె ఆ కుళ్ళు రాజకీయాలలో ఇమడలేక బయటకు వచ్చేసారు. మా అధ్యక్షురాలిగా ఎన్నికయితే సినీ పరిశ్రమలో నిరుపేద కళాకారులకు సేవలందించాలనుకొన్నారు తప్ప రాజకీయాలు చేయడానికి ఆమె పోటీ చేయలేదు. తెలుగు సినీ పరిశ్రమలో జయసుధ అందరికంటే సీనియర్ నటి. కనుక సినీ పరిశ్రమ గురించి ఆమెకు మంచి అవగాహన ఉంది. అదేవిధంగా తెలుగు ప్రజలకు కూడా ఆమె పట్ల చాలా ఆదరాభిమానాలున్నాయి.
రాజేంద్ర ప్రసాద్ మా అధ్యక్షడిగా ఎన్నికయిన తరువాత సినీ పరిశ్రమలో అందరికీ తనంటే ఎంతో ఇష్టమని అదేవిధంగా తనకు కూడా సినీ పరిశ్రమలో ఉన్న వారందరూ ఎంతో ఇష్టమని చెప్పుకొన్నారు. కానీ అదే నోటితో జయసుధ వర్గం గురించి అగౌరవంగా మాట్లాడటం సబబు కాదు. ఎన్నికల వరకు ఏవిధంగా మాట్లాడుకొన్నా మళ్ళీ అందరూ కలిసి పనిచేయవలసి ఉంటుందనే విషయం మరిచిపోకూడదు. ఏదో ఒకరోజు వారిరువురూ కలిసి నటించవచ్చును. కానీ ఈవిధంగా చులానగా మాట్లాడుకొన్నాక గౌరవం ఉన్నట్లు నటించడమే చాలా కష్టం అవుతుంది. అటువంటప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం వలన నలుగురిలో చులకన అవడం తప్ప ఒరిగేదేమీ ఉంది?