సచివాలయం తరలింపుకి మళ్ళీ ఆటంకం
posted on Apr 18, 2015 8:22AM
ఎర్రగడ్డలో ఉన్న మానసిక, ఛాతి వ్యాధుల ఆసుపత్రులను వేరే చోటికి తరలించి, అక్కడ కొత్తగా సచివాలయం నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం భావించింది. దానిని వ్యతిరేకిస్తూ ఇదివరకు హైకోర్టులో ఒక పిటిషనుపడింది. అటువంటి ప్రభుత్వ నిర్ణయాలలో తాము తల దూర్చబోమని హైకోర్టు స్పష్టం చేస్తూ ఆ పిటిషనుని కొట్టివేసింది. ఎర్రగడ్డ ఆసుపత్రులున్న ప్రాంగణంలో ఒక చారిత్రక భవనం ఉందని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, “మనం నివసిస్తున్న భూమి కూడా చాలా పురాతనమయినదే. అంత మాత్రాన్న భూమిని ముట్టుకోవద్దంటే కుదురుతుందా?” అని వితండవాదం చేసి వారి నోళ్ళు మూయించారు. కానీ అటువంటి వాదనలతో కోర్టులని ఒప్పించడం మాత్రం వీలుపడదని, ఆ భవనం తొలగింపుపై స్టే విధించడం ద్వారా హైకోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు బి.మద్దిలేటి, తెలంగాణ నవ నిర్మాణ సేన అధ్యక్షుడు కె.వెంకటయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషను వేసారు. చారిత్రిక ప్రాధాన్యమున్న ఆ భవనాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చవలసి ఉంటుందని కానీ దానిని తెలంగాణా ప్రభుత్వం కూలద్రోసి ఆ ప్రదేశంలో సచివాలయం నిర్మించాలనుకొంటోందని, కనుక ఆ భవనాన్ని కాపాడాలంటూ వారు తమ పిటిషనులో పేర్కొన్నారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆ భవనానికి చారిత్రిక ప్రాధాన్యం ఉందా లేదా అనే విషయం తేలేవరకు దానిని కూల్చవద్దని స్టే విధించింది. దాని చారిత్రిక ప్రాధాన్యం నిర్దారించేందుకు తక్షణమే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, వారి చేత ఆరు వారాలలో నివేదిక తయారు చేయించి తనకు సమర్పించాలని హైకోర్టు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ భవనం కూల్చితేగాని ఆ ప్రదేశంలో కొత్త సచివాలయ భవన నిర్మాణం మొదలుపెట్టడానికి వీలుపడదు. తెలంగాణా ప్రభుత్వం తన బడ్జెట్ లో కొత్త సచివాలయ భావన నిర్మాణానికి రూ. 150కోట్లు కేటాయించింది. కానీ ఈ కేసు తేలేవరకు పనులు మొదలు పెట్టడానికి వీలులేకుండాపోయింది. తెలంగాణా ప్రభుత్వం తరపున వాదించిన కె.రామకృష్ణారెడ్డి భవనాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చాలా? వద్దా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే ఒక కమిటీ వేసి నివేదిక తయారు చేసి కోర్టుకు సమర్పిస్తామని హామీ ఇచ్చేరు.