రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికో తెలుసా ?
posted on Jul 17, 2021 @ 12:01PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని మోడీతో డైరెక్ట్’గా తలపడేందుకు సిద్దమవుతున్నారా? పదవులతో పని లేకుండా పార్టీని పట్టాల మీదకు తెచ్చేందుకు, వ్యూహకర్త తోడుగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ వార్తల్లో వ్యక్తిగా మీడియా దృష్టిని గట్టిగా ఆకర్షిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం (జులై 13వ తేదీన) ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రాతో సమావేసమయ్యారు. నిజానికి ఈ సమావేశంలో ఏమి చర్చించారు, ఏమి డిసైడ్ చేశారు అనేది,పార్టీ నాయకులకు కానీ, ప్రపంచానికి తెలియదు. కానీ, రాహుల్ గాంధీని, ప్రతిపక్షాల ప్రదాని అభ్యర్ధిగా ఫోకస్ చేసే విషయంపై అయితే చర్చ జరిగిందని పార్టీ వర్గాలే కాదు రాజకీయ పరిశీలకులు కూడా గట్టిగా విశ్వశిస్తున్నారు.
రాహుల్ గాంధీ లోక్ సభలో పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. అయితే, ఎందుకనో ఏమో గానీ,రాహుల్ వెనకడుగు వేశారు. ఆ ప్రతిపాదన పక్కకు పోయింది. దానితో పాటే అంతకు ముందునుంచే సాగుతున్న అధీర్ రంజన్ చౌదరి మారుస్తారన్న ప్రచారం కూడా వెనక్కి పోయింది. జూలై 19 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వరకు అధీర్ రంజన్ చౌదరే లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా కొనసాగుతారని అంటున్నారు.
పార్టీలో బుసలు కొడుతున్న అసమ్మతిపై రాహుల్ గాంధీ తొలిసారిగా చాలా ఘాటుగా స్పందించారు. నిజాలను, నిర్భయంగా ఎదుర్కొనేందుకు భయపడేవారు పార్టీ చేయివదిలి పోవాలని భీకర ప్రకటన చేశారు. భయం లేనివాళ్లే తమకు కావాలని, అలాంటివాళ్లు ఎక్కడి నుంచి వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు.కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సీనియర్ నాయకుల(జీ 23)ను ఉద్దేశింఛి ఆయన ఈమాటలు అన్నారా లేక పంజాబ్’లో ముఖ్యమంత్రి అమరేదర్ పార్టీ రెబెల్ నేత నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్య సాగుతున్న అంతర్గత కుమ్ములాటలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో లేక కిశోర్ మాస్టారు స్క్రిప్ట్’నే చదివారో కానీ ఆయన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమావేశంలో చేసిన ఈ ప్రకటన పార్టీలో చర్చకు దారి తీసింది.
ఓ వంక, పార్టీ వదిలిపోయిన వారందరూ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా వెనక్కిరావాలని పార్టీ పెద్దలు ‘ఘర్ వాపసీ’ ప్రయత్నాలలో ఉన్న సమయంలో, ‘ఉంటే ఉండండి పోతే పొండి’ అన్న అర్థం వచ్చే విధంగా రాహుల్ గాంధీ చేసిన ప్రకటన పట్ల పార్టీ వర్గాలు విస్మయాన్ని వ్యక్త పరుస్తున్నాయి. అంతే కాకుండా, పరోక్షంగానే అయినా పార్టీ సీనియర్ నాయకులకు ఆర్ఎస్ఎస్ ముద్ర వేసి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.సోషల్ మీడియా సమవేశంలో మాట్లాడిన రాహుల్,” పార్టీలో కొందరు పిరికి వాళ్ళున్నారు. వారిని బయటకు విసిరేయండి. పిరికి వాళ్ళంతా పార్టీని విడిచి వెళ్ళండి. ఆర్ఎస్ఎస్ వైపు పరుగులు తీయండి. మీరు మాకొద్దు. పార్టీకి మీ అవసరం లేదు” అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య వివాదంగా మారింది.
రాహుల్ ధోరణి పిల్ల వచ్చి గుడ్డును ఎక్కిరించినట్లుందని పార్టీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. తరతరాలుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులకు ఆర్ఎస్ఎస్ ముద్రవేసి అలాటి వారు పార్టీ వదిలి పోవాలని అనడం ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ తనదైన ధోరణిలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ ‘ను ప్రభావవంతంగా వినియోగించుకుంటున్న రాహుల్ గాంధీ ఇక నుంచి ట్విట్టర్ వేదికగా ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రదాని మోడీ విధానాలు, వైఫల్యాల మీద బీజేపీ,ఆర్ఎస్ఎస్ భావజాలం పైన నిరంతరం అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు, ట్విట్టర్’తో పాటుగా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మోడీ ఫై యుద్దానికి సిద్దమవుతున్నారు. ఇక మోడీ రాహుల్ దాడిని ఎలా తట్టుకుంటారో చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.