ఎమ్మెల్యే రోజాకు జగన్ షాక్.. ఉన్న పదవి కూడా ఊస్ట్..
posted on Jul 17, 2021 @ 12:01PM
వైసీపీ ఫ్రైర్ బ్రాండ్ లీడర్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఝలక్ ఇచ్చారు. మంత్రిపదవి ఆశించిన రోజాకు ఆ పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. అయితే తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. ఏపీఐఐసీ చైర్మన్ పోస్టును మరో నేతలు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కొంత కాలంగా పార్టీలో రోజాకు పొగ పెడుతున్నారనే ప్రచారం సాగుతుండగా.. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం ఉందనే చర్చ జరుగుతోంది.
నగరి ఎమ్మెల్యే రోజా కొంత కాలంగా చిత్తూరు వైసీపీలో ఒంటరయ్యారనే ప్రచారం ఉంది. రోజాకు పోమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నం జరుగుతోందని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మధ్య మాటల యుద్ధం చాలా కాలం సాగింది. ఒకరిపై ఒకరు ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోసుకున్నారు. నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. జిల్లాలో పార్టీ రాజకీయాలను శాసిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితోనూ రోజాకు విబేధాలున్నాయి. ఇద్దరి మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గంగా ఉన్న కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి దక్కడంలో మంత్రి పెద్దిరెడ్డి పాత్ర ఉందని రోజా ఆరోపించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, రోజా మంత్రి పెద్ది రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవని అదే సోషల్ మీడియాలో ద్వారా చెప్పుకున్నారు. అంతేకాదు సయోధ్య చిహ్నంగా రక్షా బంధన్ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టారు.
తాజాగా వైఎస్సార్ జయంతి వేడుకల్లో మరో మారు పార్టీలో వర్గపోరు భగ్గుమంది. రోజా వర్గం ఆమె ప్రత్యర్ధి వర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కేజే శాంతికి వర్గం విడివిడిగా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించడంతో పార్టీలో వర్గపోరు మళ్ళీ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుందని అంటున్నారు. వైఎస్ జయంతి రోజునే నగరిలో రెండు గ్రూపులు విడివిడిగా నివాళులర్పించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో రోజా టార్గెట్ ఆమె ప్రత్యర్ధి వర్గం పావులు కదపడం చూస్తుంటే.. పార్టీ పెద్దలే తెర వెనక నుంచి కథ నడుపుతున్నారు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.