అయోనిజ సీతమ్మ!!
posted on May 10, 2022 @ 9:30AM
చాలామందికి కొన్ని పదాల పేర్లు వాటి అర్థాలు అసలు తెలియవు. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ వాళ్లకు చాలా పదాలు కొత్త, వాటి అర్థాలు వింత. అయితే అవన్నీ ఇప్పుడు అనవసరమే.
అయోనిజ అనే పేరు చాలా మంది తెలుగు కథలు చదివేవారికి, ఇంకా పురాణాల గురించి తెలిసిన వారికి పరిచయమే. సీతమ్మను అయోనిజ అని అంటారు. యోని ఆడవారి మర్మస్థానం. అదే మరొక ప్రాణికి జన్మస్థానం. కానీ సీతమ్మ ఏ ఆడదాని యోని నుండి జన్మించలేదు. అందుకే ఆమెను అయోనిజ అని అన్నారు. రాముడు పితృవాఖ్య పాలకుడిగా, అసత్యం చెప్పని వాడుగా రాజ్యాన్ని కూడా వదులుకుని అడవులకు వెళ్లి ఎలాగైతే పురాణాలలో పుణ్యపురుషుడిగా పేరు పొందాడో రాముడి వెంట తనూ అడవులకు వెళ్లి రాముడితో పాటు వనవాసం చేసి చివరికి రాక్షసుడి చేతిలో చిక్కి భరించరాని బాధలు పడింది. అంతేనా రామ రావణ యుద్ధం తరువాత తిరిగి రాముడి చెంతకు చేరినా ఎవరో మాట్లాడిన మాటకు గర్భవతిగా మళ్ళీ అడవులకు చేరి అక్కడే లవ కుశలకు జన్మనిచ్చింది. చివరకు జనక మహారాజుకు తను ఎలా భూమిలో దొరికిందో అలాగే తిరిగి వెళ్ళిపోయింది.
చాలా చోట్ల రామయ్య బాల్యం గురించి కథలు కథలుగా చెబుతారు. కానీ సీతమ్మ బాల్యం గురించి ప్రస్తావన తక్కువగా ఉంటుంది. సీతమ్మ జనకమహారాజు ముద్దుల కూతురుగా సకలకళా శాస్త్రాలు అవపోషన పట్టిన బాలిక. ఆమె ఎంతో నెమ్మదితనం కలిగిన వ్యక్తిగా అందరికీ అనిపిస్తారు. ముఖ్యంగా సీతమ్మ అంటే లవకుశలో అంజలీదేవిలా ఉంటుందని అందరికీ అనిపిస్తుందేమో కానీ సీతమ్మ ఎప్పుడూ దుఃఖితురాలిగా ఉండలేదు. సినిమాలలో సెంటిమెంట్ కోసం సీతమ్మ పాత్రకు ఎమోషనల్ టచ్ ను ఎక్కువగా జొప్పించారు దర్శక నిర్మాతలు అంతే.
రామాయణంలో గమనిస్తే సీతాదేవి పరిచయం గురించి చెబుతూ ఆమె ఎలా పుట్టింది అనే విషయం మాత్రమే ప్రస్తావన ఉంటుంది. ఆ తరువాత సీతారాముల పరిణయం అయ్యాక సీతమ్మ కూడా ప్రధాన పాత్రగా సాగుతుంది.
సీతమ్మ రహస్యం!!
సీతమ్మ గత జన్మలో ఒక ముని కూతురు. ఆమె పేరు వేదవతి. రావణాసుడి చేతిలో ఘోరంగా అవమానం ఎదుర్కొన్న వేదవతి తగిన ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తుంది. పాలితంగా సీతమ్మగా పుట్టి రాముడి చేత రావణ చేయించింది.
లొంగిపోని తత్వం!!
అయిదు వేల మంది నీకింద పనిమనుషులుగా పడి ఉంటారు, నువ్వు ఊహించనంత బంగారు, వజ్రం వంటి ఆభరణాలు ఉంటాయి. ఎవరి దగ్గరా లేని పుష్పక విమానం నాదగ్గర ఉంది ఇప్పుడు. జకు భార్యవైపో నిన్ను ఎంతో సంతోషపెడతాను అని అంటాడు రావణాసుడు. సీతమ్మ మాత్రం రావణాసుడి వైపు కన్నెత్తి చూడదు. లొంగిపోని తత్వం ఉండాలంటే ఎంతో ఆత్మస్థైర్యం కలిగి ఉండాలి. స్థిరమైన మనసు కలిగి ఉండాలి.
తొణకని వ్యక్తిత్వం!!
సీతమ్మ వ్యక్తిత్వం తొణికిపోనిది. రావణుడి యుద్ధం తరువాత రాముడు అగ్నిపరీక్ష పెడితే భయపడకుండా ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకోవాలి అనే వాదన చాలామందిలో ఉండచ్చు. తప్పు చేయనప్పుడు వెనకడుగు వేయకూడదని ఆమె వ్యక్తిత్వం చెబుతుంది. అలాగే రాముడు సీతమ్మను గర్భవతిగా ఉన్నప్పుడు అడవుల్లో వదిలిపెడితే నిస్సహాయురాలిలా పుట్టింటికి వెళ్ళలేదు, అలాగని పిరికిదానిలా భయపడలేదు. మనోనిబ్బరంతో బిడ్డల్ని కని, వాళ్ళను మంచి వ్యక్తిత్వం కలిగినవాళ్లుగా తీర్చిదిద్దింది.
సీతమ్మ వ్యక్తిత్వం ఎంతోమంది ఆడవాళ్లకు స్ఫూర్తి కలిగిస్తూ ఉంటుంది. భర్తను గౌరవించడం అతని అడుగుజాడల్లో వెళ్లడం ఫెమినిజానికి నచ్చకపోవచ్చేమో కానీ భర్తను గౌరవిస్తూ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అనేది సీత నుండి నేర్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే సీత కూడా ఈ భూమ్మీద సగటు మహిళగా బతికింది మరి.
◆వెంకటేష్ పువ్వాడ.