జూనియర్ ఆర్టిస్టు ఇంట్లోనే దందా! 14 ఏళ్ళ కూతుర్ని కూడా విడిచిపెట్టలేదు!
posted on May 12, 2024 @ 1:33PM
‘ఆ పాడుపని’ నేను చేయలేనమ్మా అని వేడుకున్నా చిత్రహింసలు పెట్టేదట. ఏడుస్తున్నా కనికరించకుండా బాలికతో వ్యభిచారం చేయించింది. ఆ అమ్మతల్లి చెరలో చిన్నారి ఏకంగా రెండేళ్లు నరకం చూసింది. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ, జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ తన ఇంటినే వ్యభిచార కొంపగా మార్చివేసింది. తన వ్యాపారం కోసం ఆమె 14 ఏళ్ళ క్రితంమే ఓ ఆడబిడ్డను తెచ్చుకుని పెంచుకుంది. బడికీ పంపింది. అయితే పెంపుడు కూతురు అనే సంగతి బాలికకు చెప్పకపోవడంతో ఆమే తన తల్లి అని, చిన్నారి భావిస్తూ వచ్చింది. కన్నతల్లి అయివుండి తన పట్ల ఎందుకింత నిర్దయగా వ్యవహరిస్తోందనే విషయం అర్థంకాని ఆ బాధిత బాలికకు తాజాగా ఆమె తన తల్లే కాదనే విషయం తెలిసింది.
అయితే ఆమె ఇంటికి వచ్చే విటుల్లో కొందరు బాలికపై కన్నేసి, ఎక్కువ డబ్బులిస్తామని మహిళకు ఆఫర్ చేశారు. దీంతో బాలికనూ పాడుపనిలోకి దించాలని భావించి, రెండేళ్ల క్రితమే బడి మాన్పించింది. అప్పటి నుంచి చిన్నారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. ఇంట్లోంచి బాలిక కేకలను విని స్థానికులు, పోలీసులకు సమాచారమిచ్చారు. వెస్ట్ జోన్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య తన బృందంతో ఆ మహిళ ఇంటిపై దాడిచేశారు. బాలిక చేతులు, కాళ్లపై అట్లకాడతో కాల్చిన గాయాలతో పాటు మెడ, పెదవిపైనా గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒంటినిండా గాయాలతో ఇంట్లో బందీగా ఉన్న బాలికను చూసి పోలీసులు చలించిపోయారు. వెంటనే బాధిత బాలికను వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
వేలాది మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఇప్పటికీ తేలనవి ఎన్నో వున్నాయి. ఆ అమ్మాయిలంతా ఇలా వ్యభిచార కేంద్రాలకు తరలించబడుతున్నారు. మైనర్ బాలికల్ని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించి, వారితో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలు దేశంలో పెరిగిపోతున్నాయి. మహిళల్ని భోగ వస్తువుగా భావించి, వారి శరీరాలతో వ్యాపారం చేసే వాళ్లకు ఈ సమాజంలో కొదవలేదు. అలాంటి వారి పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- ఎం.కె.ఫజల్