వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం: ప్రశాంత్ కిషోర్
posted on May 12, 2024 @ 1:30PM
జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో అద్భుతాలు సృష్టించింది అని చెప్పుకుంటూ వుంటారు. తెలుగు మీడియం లేకుండా మొత్తం ఇంగ్లీషు మీడియం చేయడమే ఆ అద్భుతం. ప్రభుత్వం మీడియం మార్చిందే తప్ప, స్కూళ్ళలో పరిస్థితులను మార్చలేదు. ఇంగ్లీషు మీడియం చేసినందువల్ల చదువు వచ్చేస్తుందా? అని ప్రశాంత్ కిషోర్
‘వాలంటీర్లు’ అనే పేరుతో జగన్ వేలాదిమందిని ఒక సైన్యం లాగా క్రియేట్ చేశాడు. దీని ద్వారా రాజ్యాంగాన్ని, పంచాయితీరాజ్ చట్టాన్ని పక్కన పెట్టేశాడు. ఈ ‘వాలంటరీ వ్యవస్థ’ ఐడియా జగన్‌కి నేను ఇచ్చానని చాలామంది అనుకుంటూ వున్నారు. కానీ, ఈ పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ పార్టీ అయినా ఎన్నికలలో గెలవటానికి ఏం చేయాలన్న వ్యూహాలు మాత్రమే నేను ఇస్తాను. ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎంతమాత్రం జోక్యం చేసుకోను. చివరికి ఆ పార్టీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా నేను రాను. జగన్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా నేను రాలేదు. పంచాయితీరాజ్ వ్యవస్థ అనేది ఎంతో ఆలోచించి రూపొందించిన వ్యవస్థ. అధికార వికేంద్రీకరణకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఈ వ్యవస్థలో వున్న ఉద్యోగులు అధికార వికేంద్రీకరణకు ఉపయోగపడతారు. కానీ, జగన్ మాత్రం పంచాయితీరాజ్ వ్యవస్థని పక్కన పెట్టేసి, రెండు లక్షల మంది ఉద్యోగులతో వాలంటీర్ల పేరుతో కొత్త వ్యవస్థని తీసుకొచ్చారు. తన పార్టీ కార్యకర్తలను తన ప్రభుత్వంలో భాగస్వాములను చేసేశారు. అన్ని పథకాలు, డబ్బు వాళ్ళ చేతే ప్రజల దగ్గరకి తీసుకెళ్ళారు. పంచాయితీరాజ్ వ్యవస్థ ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ఆ వ్యవస్థలోని ఉద్యోగులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ వాలంటీర్ల వ్యవస్థని జగన్ పెంచి పోషించారు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.