జనానికి జగన్ దూరమైపోయారు: ప్రశాంత్ కిషోర్
posted on May 12, 2024 @ 1:32PM
‘‘వాలంటరీ వ్యవస్థను నేను సూచించలేదు. ‘నవరత్నాలు’ అనే వాటిని మాత్రం నేను సూచించాను. ఎన్నికైన తర్వాత ‘నవరత్నాలు’ తప్పనిసరిగా అమలు చేయండి అని జగన్‌కి చెప్పాను. అంతే తప్ప ఈ నవరత్నాలు మాత్రమే చేసి మిగతా అన్నీ మర్చిపొమ్మని మాత్రం చెప్పలేదు. 2019లో గెలిచింది జగన్. ప్రభుత్వం ఆయనది. కేబినెట్ ఆయనది. పవర్ ఆయన దగ్గర వుంది.. మేం సూచించిన నవరత్నాలు కాకుండా ప్రజలకు ఇంకేం కావాలన్నది ఆయన ఆలోచించి అమలు చేయాలి. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది... రాష్ట్రంలోని ప్రజల ఇంకా ఏమేం కోరుకుంటున్నారు... అనేది ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆలోచించాలి. కానీ ఆయన అలాంటి ఆలోచన ఏదీ చేసినట్టు కనిపించలేదు’’ అని జర్నలిస్టు రవిప్రకాష్‌తో జరిగిన ముఖాముఖితో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
జగన్ చేసిన చాలా పెద్ద పొరపాటు ప్రజల్ని అస్సలు కలవకపోవడం. ప్రభుత్వంలో వున్న పెద్దపెద్ద నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జగన్‌ని కలవాలంటే సాధ్యం కాకుండా పోయింది. ఇక ప్రజలు కలిసే అవకాశం ఎక్కడ వుంటుంది? అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
2019లో జగన్‌ని గెలిపించినందుకు నన్ను ప్రజల్లో చాలామంది దోషిగా చూస్తున్నారు. జగన్‌ని ఎలా గెలిపించాలన్న వ్యూహాలు అయితే నేను వేశాను గానీ, ఓట్లు వేసింది మాత్రం ప్రజలేకదా.. జగన్‌ని గెలిపించిన విషయంలో నేను దోషి అయితే, జగన్‌కి ఓటు వేసిన ప్రజలు కూడా దోషులే కదా.. వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో చేసిన తప్పును 2024 ఎన్నికలలో సరిదిద్దుకోవడానికి సిద్ధంగా వున్నారు. ప్రజలకి దూరమైనపోయిన నాయకులకు, ప్రజలను తేలిగ్గా తీసుకునే నాయకులకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారు. ఈసారి ఎన్నికలలో ప్రజల నుంచి జగన్ గుణపాఠం నేర్చుకోబోతున్నారు.. జగన్ భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.