జైలు బయట కరోనా.. విడుదల వద్దంటూ ఖైదీల ఆందోళన..
posted on May 31, 2021 @ 11:36AM
జైలుకు వెళ్లడమంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఏదైనా కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చినా ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అని ఎదురుచూస్తుంటారు ఖైదీలు. జైలు నరకం లాంటిది. సమాజం నుంచి దోషులను వేరు చేసి.. నాలుగు గోడల మధ్య బంధించే కార్ఖానాలాంటింది జైలు. చుట్టూ ఖైదీలు మినహా మరో ప్రపంచం లేకుండా పోతుంది. అందుకే, జైలులో ఉండటం టార్చర్‌గా ఫీలవుతారు. మరోసారి జైలుకు రావొద్దని నేరాలు చేయకుండా కంట్రోల్‌లో ఉంటారు. ఇదంతా జైలు సిద్ధాంతం. కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది.
కరోనా కాలంలో ఖైదీలు తెలివి మీరారు. బయటకు వెళితే ఎక్కడ కరోనా కాటేస్తుందోనని భయపడిపోతున్నారు. లాక్‌డౌనూ ఉండటంతో తిండికి కూడా కష్టమని ఆందోళన చెందుతున్నారు. అందుకే, తాము జైలు వీడి బయటకు వెళ్లమని పట్టుబడుతున్నారు. అందుకే, తమకు పెరోలో వద్దంటూ 21మంది ఖైదీలు.. ఏకంగా జైలు ఉన్నతాధికారులకే లేఖలు రాయడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
యూపీలోని గజియాబాద్, గౌతంబుద్ధ్ నగర్, మేరఠ్, మహరాజ్‌గంజ్, గోరఖ్‌పుర్, లఖ్‌నవూ జైళ్లలోని ఖైదీలు తమకు పెరోల్ వద్దంటూ లేఖలు రాసినట్టు జైళ్ల పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ‘ఈ పరిస్థితుల్లో బయటికి వెళితే తిండి, ఆరోగ్యానికి భరోసా ఉండదు. ఇక్కడైతే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయిస్తాం. గంట కొట్టగానే అన్నం పెడతాం. పైగా వాళ్లకిచ్చే 90 రోజుల పెరోల్ కాలాన్ని మళ్లీ శిక్షాకాలంలో కలుపుతాం’ అందుకే ఖైదీలు పెరోల్ మీద బయటకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారంటూ ఆ అధికారి వివరించారు.
జైళ్లలో సామాజిక దూరం సమస్యపై ఇటీవల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, కేసులు విచారణలో ఉన్నవారికి పెరోల్ కానీ, మధ్యంతర బెయిలు కానీ, మంజూరు చేసే విషయం పరిశీలించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీం సూచనలతో.. యూపీలో 2,200 మందిని పెరోల్‌పైన.. 9,200 మందిని మధ్యంతర బెయిలుపైన జైలు నుంచి రిలీజ్ చేశారు. అయితే.. ఈ కోటాలో తమనెక్కడ జైలు నుంచి బయటకు పంపిస్తారోనని ఆందోరళన చెందిన వివిధ జైళ్లలోని 21మంది ఖైదీలు.. బయట కరోనా ఉంది.. తమను పెరోల్ మీద రిలీజ్ చేయవద్దంటూ ఉన్నతాధికారులకు లేఖలు రాయడం ఆసక్తికరంగా ఉంది. జైళ్ల శాఖ నిబంధనల మేరకు లేఖ రాసిన ఖైదీలను.. విడుదల చేయబోమంటున్నారు.
ఎంతైనా జైలు నుంచి బయటకు వెళ్లమంటూ ఖైదీలే కోరుతుండటం విడ్డూరంగా లేదు. కరోనానా.. మజాకా.. ముందుముందు ఇలాంటి విచిత్రాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో...