కోటయ్య మృతి.. ఆనందయ్య మందుపై ఇవాళే నిర్ణయం..
posted on May 31, 2021 @ 10:54AM
కోటయ్య కరోనాతో చనిపోయారు. కోటయ్య ఎవరో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆనందయ్య మందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్. ఆక్సిజన్ లెవెల్స్ 83కి పడిపోయి.. కొనఊపిరితో కృష్ణపట్నం వచ్చాడు కోటయ్య. ఆనందయ్య మందును కంటిలో రెండు చుక్కలు వేశారు. అంతే. ఒక్కసారిగా మేజిక్ జరిగింది. 10 నిమిషాల వ్యవధిలోనే కోటయ్య లేచి కూర్చున్నాడు. ఆయన ఆక్సిజన్ స్థాయిలు పరీక్షిస్తే.. 95కి చేరాయి. సరిగ్గా 10 నిమిషాల్లోనే 83 నుంచి 95కి ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం ఆనందయ్య మందు మహత్యం. నాటు మందు పడితే తిరుగుండదనే కోటయ్య కామెంట్స్ అప్పుడు అక్షర సత్యం. ఇందులో ఎవరికీ, ఎలాంటి డౌట్ అక్కరలేదు.
కోటయ్య కోలుకున్న న్యూస్ తెలిసి.. ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నంకి ప్రజలు పోటెత్తారు. అప్పటి వరకూ రోజుకు 5 నుంచి 6వేల మంది వస్తుండగా.. కోటయ్య ఘటన తర్వాతి రోజు ఏకంగా 30-40వేల మందితో ఆ మారుమూల గ్రామం కిక్కిరిసిపోయింది. జనం రద్దీతో ఆనందయ్య మందు పంపిణీని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
కట్ చేస్తే.. ఆనందయ్య మందుతో ఏ కోటయ్య అయితే కోలుకున్నాడో.. అదే కోటయ్య ఆరోగ్య పరిస్థితి ఆ మరునాడే మళ్లీ సీరియస్‌గా మారింది. ఆక్సిజన్ లెవెల్స్ మళ్లీ దారుణంగా పడిపోయాయి. వెంటనే జీజీహెచ్ హాస్పిటల్‌కి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స చేశారు. కోటయ్య కంటికి ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచీ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న కోటయ్య.. ఈ ఉదయం కరోనాతో చనిపోవడం కలకలం రేపింది. ఆనందయ్య మందు తీసుకుని కోలుకున్నాక కూడా.. 24 గంటలు తిరగక ముందే మళ్లీ అతని ఆరోగ్యం విషమించడం.. చికిత్సకు స్పందించకపోవడం.. మరణించడాతో.. ఆనందయ్య మందుపై అనుమానాలు మొదలయ్యాయి.
ఆనందయ్య మందు కోసం వెళ్లక ముందు.. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆయన ఆక్సిజన్ లెవెల్స్ 95 ఉండేవని నర్సులు చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. మందు వేసుకున్న కొన్ని గంటల్లోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. అంటే.. ఆ మందు కరోనా తీవ్రంగా ఉన్న వారికి పని చేయదా? లేక, ఆనందయ్య మందు ప్రభావం తాత్కాలికంగానే ఉంటుందా? లేదంటే.. కొన్ని డోసులుగా ఆ మందు తీసుకోవాల్సి ఉంటుందా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఆనందయ్య మందు తీసుకున్న మరో 98 మంది సైతం.. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారనే వార్తలూ వినిపిస్తున్నాయి.
అయితే.. ఇక్కడ మరో చర్చ కూడా జరుగుతోంది. కరోనా పాలిట సంజీవనిగా భావించిన రెమ్‌డెసివిర్ తీసుకున్న ప్రతీ పేషెంట్ కోలుకోలేదుగా.. ఆ ఇంజెక్షన్ తీసుకున్నా కొంతమంది చనిపోయారుగా.. ఆనందయ్య మందునూ అలానే చూడాలంటున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్నందున.. ఆనందయ్య మందు విషయంలోనూ అలానే భావించాలని అంటున్నారు. కృష్ణపట్నం గ్రామంలో ప్రతీ ఒక్కరూ ఆనందయ్య మందును తీసుకున్నారు. ఇంత వరకూ ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే మామూలు విషయమేమీ కాదుగా. ఇప్పటికే అన్ని వేల మంది ఆనందయ్య మందు తీసుకోగా.. ఒక్క కోటయ్య విషయంలో మాత్రమే ఇలా జరిగింది. ఆ మాత్రం మినహాయింపు ఏ మందుకైనా ఉంటుంది. ఈ ఒక్క కేసును సాకుగా చూపించి.. ఆనందయ్య మందుపై కుట్ర చేసే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వారాల తరబడి ఆనందయ్యను ఆజ్ఞాతంలో ఉంచి.. ఆయనతో రహస్యంగా మందు తయారు చేయించి.. అయిన వారికి బకెట్లకు బకెట్లు మందు తరలించేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు.. ఇకనైనా ఆనందయ్యను ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మందు తయారీకి కావలసిన కొన్ని వనమూలికలు మరో నెల రోజులు మాత్రమే లభ్యమవుతాయని.. ఆ తర్వాత వాటి సీజన్ అయిపోయి అవి అందుబాటులో ఉండవని అంటున్నారు. అందుకే.. ఇప్పటికే చాలా చాలా ఆలస్యం అయిందని.. వెంటనే ఆనందయ్య మందును ఎప్పటిలానే ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇప్పటికే అన్ని పరీక్షల్లోనూ ఆనందయ్య మందుపై ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. మందు పంపిణీని నిలిపివేయడం పాలకుల కుట్ర అంటూ ప్రజలు మండిపడుతున్నారు. మరింత ఆలస్యం చేస్తే.. జనాలు తిరగబడక తప్పదని హెచ్చరిస్తున్నారు.