లాక్ డౌన్ లో బోరు.. ఉరి సీన్ ప్లాన్..
posted on May 31, 2021 @ 11:53AM
కరోనా, లాక్ డౌన్. బయటికి వెళ్తే పోలీసులు బ్యాండ్ వేస్తారు. టీవీ చూస్తే కరోనా వార్తలతో లేనిపోని తలనొప్పి, సినిమాలు చూడలేం, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. ఎప్పటి లాగే అమ్మానాన్నలు అడిగే ప్రశ్నలు, నెక్స్ట్ ఏంటి? టైం ఎందుకు వెస్ట్ చేస్తావ్.. ఏదైనా చదువొచ్చుకదా అని. చాలా మంది సినిమాలో హీరో, హీరోయిన్ అవ్వాలని టిక్ టాక్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలో ఫైట్ సీన్స్ కూడా తెగచేస్తున్నారు యువకులు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం అప్పారెడ్డ గూడెం గ్రామంలో జగన్, శ్రీను ఇద్దరు స్నేహితులు. ఇద్దరిదీ ఒక్కటే ఊరు. లాక్ డౌన్‌తో పని పాట లేకుండా ఖాళీగా ఉన్న వీరు.. ఉరి సీన్ తీయాలనుకున్నారు. ఇంటి దగ్గరే చెట్టుకు ఉరి తీసుకుంటూ.. వీడియో తీశారు. అది వైరల్ కావడంతో జగన్ తల్లిదండ్రులకు విషయం తెలిసి కొడుకు నిర్వాకాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు యువకులను పిలిచి చీవాట్లు పెట్టారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నాలుగు వాయిస్తామన్నారు. సరదాకు కూడా ఇలాంటి వీడియోలు చేయొద్దని చెప్పి హెచ్చరించి వదిలేశారు.
మరి అంత బోరు కొడితే పాఠ్య పుస్తకాలు కాకుండా.. కొంచం సమాజాన్ని స్టడీ చేసే పుస్తకాలు చదవాలిగాని, అమెజాన్ నెట్ఫ్లిక్ ఆహ లాంటి ప్లాట్ ఫామ్ లో సినిమాలు చూడాలి. అదికూడా చేత కాదంటే అమ్మానాన్నలకు ఇంట్లో పని చేసిపెట్టాలిగాని.. మరి సినిమాలు చూసి.. అందులో వీడియోలు చేస్తే ఇలాగే ఉంటది.. ఇంకా నాయ్యం ప్రాణాలు పోలేదు. ఒక వేళ ప్రాణాలు పోతే.. సినిమాలో ఐతే నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు.. అందులో చేసినట్లు మనం చేస్తే అప్పుడప్పుడు ఇసుర్రాయి బొడ్డుకు వస్తుంది.