పొరుగింటికి అంటుకొన్న మంటలను అందరూ కలిసి ఆర్పివేయడమే మంచిది లేకుంటే...
posted on Dec 26, 2015 @ 6:59PM
గత ఆరు దశాబ్దాలుగా భారత్ పట్ల మారని పాక్ వైఖరి ప్రధాని నరేంద్ర మోడి ఆకస్మిక పర్యటనతో మారిపోతుందని ఎవరూ భ్రమలలో లేరు కానీ పాక్ తో సంబంధాలు మెరుగుపడటానికి ఇది ఎంతో కొంత వరకు సహాయపడుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదం, మత ఛాందసవాదం, సైనిక పెత్తనం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్, మంటలు అంటుకొన్న పొరుగిల్లు వంటిది. ఆ సెగ ఇప్పటికే మనకి చాలా తగిలింది. ఇంకా దానిని పట్టించుకోకుండా వదిలివేస్తే ఏదో ఒకనాడు ఆ మంటలు భారత్ కి కూడా అంటుకోకమానవు.
కొన్ని రోజుల క్రితం “అవసరమయితే భారత్ పై అణుబాంబు ప్రయోగించడానికి కూడా వెనుకాడబోము,” అని పాక్ సైన్యాధ్యక్షుడు అన్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా, పాక్ సైనికాధికారుల యుద్దోన్మాదానికి, ఉగ్రవాదులు, మత చాందసవాదులు కూడా తోడయి ఉన్నప్పుడు వారి చేతిలో అణుబాంబు ఉండటం ఎంత ప్రమాదమో తేలికగానే ఊహించవచ్చును. “పాక్ అణుబాంబు ప్రయోగిస్తే, భారత్ కూడా ప్రయోగించలేదా? పాక్ ప్రయోగించిన అణుబాంబుని అడ్డుకోలేదా?” అని ప్రశ్నించవచ్చును. కానీ అణుబాంబుల ప్రయోగం వరకు వెళితే అది వినాశనానికే దారి తీస్తుంది తప్ప విజయానికి కాదనే సంగతి గ్రహించాల్సి ఉంటుంది.
కనుక పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం బలంగా ఉండటం భారత్ కి అన్నివిధాలా చాల అవసరం. అందుకోసం యిష్టం ఉన్నా లేకపోయినా దానితో బలమయిన స్నేహ సంబందాలు కలిగి ఉండటమే ఇరువురికీ మంచిది. పాకిస్తాన్ కి నిలకడ ఉండని మాట నిజమే. కానీ దానికి కారణం పాక్ ప్రభుత్వంపై యుద్ధోన్మాదంతో తహతహలాడిపోతున్న సైనికాధికారుల పెత్తనం, ఉగ్రవాదులు, మత చాందసవాదుల నుండి వస్తున్న ఒత్తిళ్ళే కారణమని చెప్పవచ్చును.
అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న పాక్ ప్రజా ప్రభుత్వానికి భారత్ అండ చాలా అవసరం ఉంది. ఒకవేళ భారత్ సహకారంతో పాక్ ప్రభుత్వం గట్టిగా నిలబడగలిగితే పాకిస్తాన్ లో క్రమంగా పరిస్థితులలో మార్పు రావచ్చునని ఆశపడటం తప్పేమీ కాదు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అంటూ అమెరికా ప్రతీ ఏటా పాకిస్తాన్ కి కొన్ని లక్షల డాలర్లు ఇస్తోంది. ఇస్తోంది అనే కంటే చెల్లిస్తోంది అని చెప్పడమే సమంజసంగా ఉంటుందేమో? అందుకు చాలా చాలా కారణాలు ఉండవచ్చును.కానీ వాటిలో ప్రధానమయినది పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు, మత చాందసవాదులను అదుపు తప్పకుండా నియంత్రించడం కూడా ఒకటని చెప్పవచ్చును. లక్షల డాలర్లు కప్పం చెల్లించి చేస్తున్న అమెరికా పనినే, ప్రధాని నరేంద్ర మోడి దౌత్యపద్దతుల ద్వారా సవరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చును.
పాక్ లో తిష్టవేసిన ఉగ్రవాదులు, మత చాందసవాదులు ఈ ప్రయత్నాలని ఎంత కాలం సాగనిస్తారో తెలియదు. కానీ ఈ ప్రయత్నాలు ఏమాత్రం సఫలమయిన ఖచ్చితంగా పాకిస్తాన్ అంతర్గత పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు రావచ్చును. అదే జరిగితే భారత్ పట్ల పాక్ వైఖరిలో కూడా తప్పకుండా మార్పు రావచ్చునని ఆశించవచ్చును.
నిన్న మోడీ ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసినప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచిన బాష్యం వారు చెప్పారు. కానీ ఇరు దేశాల ప్రజలు, ముఖ్యంగా పాక్ ప్రజలు మోడీ దౌత్యాన్ని చాలా హర్షించడం గమనార్హం. అంటే పాక్ ప్రజలు భారత్ తో స్నేహం కోరుకొంటునప్పటికీ, ప్రభుత్వాల వైఖరే ప్రజల వైఖరిగా పైకి ప్రదర్శించబడుతోందని స్పష్టం అవుతోంది. వివిధ కారణాల చేత ఇరు దేశాల ప్రభుత్వాలు ఘర్షణ పడుతుంటే అదే ఇరుదేశాల ప్రజల వైఖరి కూడా అని భావించడం పొరపాటని, ఇరు దేశాల ప్రజల స్పందన చూసినట్లయితే అర్ధమవుతుంది.
ముందే చెప్పుకొన్నట్లు పొరుగిల్లు తగలబడుతుంటే అందరూ కలిసి ఆ మంటలు ఆర్పాలి. ఆ ప్రయత్నంలో ఆ మంటలు అదుపులోకి రావచ్చును లేదా ఇంకా పెరగవచ్చును. కానీ అసలు ప్రయత్నమే చేయకుండా ఊరుకొంటే? అందుకే మోడీ పర్యటనకి ఎవరు ఎన్ని బాష్యాలు, కారణాలు చెప్పుకొన్నా అదొక మంచి ప్రయత్నమే కనుక అందరూ సమర్ధించడమే మంచిది.