మోడీ లాహోర్ పర్యటన: ఒక మంచి ఆలోచన, మంచి ప్రయత్నం
posted on Dec 25, 2015 @ 7:37PM
ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి డిల్లీ వస్తునప్పుడు ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసిరావడం ఇరుదేశాల ప్రజలను ఆశ్చర్యపరిచింది కానీ అందరూ ఆయన చర్యను అభినందించారు. దౌత్య పద్దతులను, నియమ నిబంధనలను పక్కనబెట్టి ఒక ప్రధాని మరొక దేశ ప్రధానిని కలవడం చాలా అరుదు. కానీ ప్రధాని నరేంద్ర మోడి తీసుకొన్న నిర్ణయం వలన భారత్-పాక్ సంబంధాలకు ఒక కొత్త ఊపు తీసుకు వచ్చినట్లయింది. ఇంతవరకు ఇరుదేశాలు ఏదో ఒక కారణంతో ఒకదానిని ఒకటి ద్వేషించుకోవడమే తప్ప ఈవిధంగా స్నేహపూర్వకంగా మెలగలేదు. ఇరువురు ప్రధానుల మధ్య ఏర్పడిన ఈ సత్సబందాల వలన ఇరు ప్రభుత్వాల వైఖరిలో గత కొన్ని రోజులుగా గణనీయమయిన మార్పులు కనబడటం మొదలయ్యాయి. అందుకే ఇరు దేశాల నేతలు, ప్రముఖులు, విదేశాంగ నిపుణులు, ప్రజలు అందరూ కూడా మోడీ చర్యను స్వాగతిస్తున్నారు. సమర్ధిస్తున్నారు.
దీనిపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ “దౌత్యపరంగా ఇది చాలా ముఖ్యమయిన, మంచి నిర్ణయం,” అని అన్నారు. “ప్రధాని లాహోర్ పర్యటన వలన పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. ఇరుదేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది,” అని రక్షణరంగ నిపుణుడు ఖమర్ ఆఘ అభిప్రాయం వ్యక్తం చేసారు. “ప్రధాని మోడీ సరయిన దిశలో ఒకడుగు వేశారని” జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. “అయితే ఏదో ఆర్భాటం కోసం కాక ఇరుదేశాల మధ్య సబందాలు బలపడేందుకు గట్టిగా, నిలకడగా ప్రయత్నాలు సాగించాలని” ఒమర్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ కి చెందిన చాలా మంది ప్రముఖులు ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తూ, మోడీ ఆకస్మిక పర్యాటనని స్వాగతించారు.
“ఇది ఎవరూ ఊహించలేని మంచి ప్రయత్నం. చాలా మంచి ఆలోచన. దీని వలన ఇరుదేశాల ప్రజలకు మంచి సంకేతం పంపినట్లయింది” అని మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ అన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం యధాప్రకారం కోడిగుడ్డుకి ఈకలు పీకే పనిలో పడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ దీనిపై స్పందిస్తూ, “భారత్-పాక్ మధ్య సంబంధాలు ఇంకా బలపడనపుడు, మోడీ మధ్యలో పాక్ లో ఎందుకు దిగారో తెలియడం లేదు. అటువంటి అతి ముఖ్యమయిన సమాచారాన్ని మనం ట్వీటర్ ద్వారా తెలుసుకోవలసి రావడం దురదృష్టకరం. ఈమధ్యనే పార్లమెంటు సమావేశాలు ముగిసాయి. ఆయన పాకిస్తాన్ వెళ్ళదలచుకొంటే వెళ్ళవచ్చును. కానీ పార్లమెంటుకి కూడా తెలియజేయాలనుకోలేదు,” అని అన్నారు.
మరో సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ “ఇది ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చును. ఆయన చేసిన ఈ సాహసం దేశభద్రతకు సవాలు విసురుతోంది. అంత సాహసం చేసినా ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశించలేము. అంత ఆకస్మికంగా ఆయన లాహోర్ ఎందుకు వెళ్ళారో అర్ధం కావడం లేదు,” అని అన్నారు.
“మోడీ, పాక్ ప్రధాని నివాసం చేరుకొనేసరికి అక్కడ ఒక ప్రముఖ పాక్ వ్యాపారవేత్త ఉన్నారు. మరి మోడీ పర్యటన ఆకస్మిక పర్యటన అని ఎలాగ చెప్పగలము?” అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ఇక డిల్లీలో యువజన కాంగ్రెస్ నేతలు అందరి కంటే చాలా వికృతంగా ప్రవర్తించారు. మోడీ లాహోర్ పర్యటనని నిరసిస్తూ వారు డిల్లీలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.
కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ “మా ప్రభుత్వం ఏమి చేసినా విమర్శించడమే కాంగ్రెస్ నేతల పని. వారికి దేనిలోనూ మంచి కనబడదు. మోడీ వేసిన ఒక చిన్న అడుగు వలన భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడుతుంటే అందుకు హర్షించకపోగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు ముందు పాకిస్తాన్ పట్ల మేము కటినంగా వ్యవహరిస్తే తప్పు పట్టారు. ఇప్పుడు దానితో స్నేహంగా వ్యవహరిస్తే దానిని కూడా తప్పు పడుతున్నారు. అసలు వాళ్ళు ఏమి కోరుకొంటున్నారో కూడా తెలియదు. ఏదో విమర్శించాలి గాబట్టి విమర్శిస్తున్నట్లుంది తప్ప వారి విమర్శలలో అర్ధం లేదు."
"ఎంతో కాలంగా ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇటువంటి ఒక్కడుగు వేయలేదు. కానీ మోడీ ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే విమర్శిస్తున్నారు. ఆయన పర్యటన గురించి లోకం ఏమనుకొంటోందో ఒకసారి విన్నాక కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బాగుంటుంది,” అని వెంకయ్య నాయుడు చురకలు వేశారు.
మోడీ పర్యటన వలన ఏవో అద్భుతాలు జరిగిపోతాయని అనుకోనవసరం లేదు. కానీ ఇటువంటి మంచి ప్రయత్నాల వలననే అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పకతప్పదు. సరిగ్గా క్రిస్మస్ పండుగ రోజునే మోడీ పాకిస్తాన్ కి ఇటువంటి శాంతి సందేశం తీసుకు వెళ్ళడం కాకతాళీయమే కానీ సత్ఫలితాలను ఇవ్వవచ్చును.