2015లో జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు
posted on Dec 29, 2015 @ 11:50AM
2015 సం. ముగియడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉంది. ఈ సందర్భంగా ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి ఒకసారి చెప్పుకొంటే బాగుంటుంది.
ఈ ఏడాది మొదట్లో డిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ రెండు ప్రధాన జాతీయపార్టీలయిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను చిత్తుగా ఓడించి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అది ప్రజల పట్ల రాజకీయ పార్టీలు, నేతల తీరు మారవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇక బీజేపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ముఫ్తీ మొహమ్మద్ తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాల వలన బీజేపీ-పిడిపి పార్టీల మధ్య కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ నిలకడగా పరిపాలన సాగుతోంది.
మచ్చలేని నేతగా పేరొందిన మాజీ ప్రధాని. డా. మన్మోహన్ సింగ్ అక్రమ బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో చేతికి మసి అంటుకొంది. ఆయనను ఆకేసు విచారణ కోసం స్వయంగా హాజరు కావలసిందిగా కోర్టు నోటీసులు జారీ చేయడం కలకలం సృష్టించింది. కానీ సుప్రీం కోర్టు ఆయనకు ఆ కేసుల నుండి విముక్తి ప్రసాదించింది. ఇదే కేసులో మాజీ బొగ్గు శాఖ మంత్రి దాసరి నారాయణ రావుపై కూడా చార్జ్ షీట్ దాఖలయింది.
భూసేకరణ చట్టానికి పార్లమెంటులో ఆమోదం లభించకపోవడంతో మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టాలని రాహుల్ గాంధీ తహతలాడినపుడు షీలా దీక్షిత్ వంటి సీనియర్ నేతలు నాయకత్వ లక్షణాలను ప్రశ్నించడంతో ఆయన పార్టీపై అలిగి కీలకమయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో రాజజకీయలకు శలవు పెట్టి విదేశాలకు వెళ్ళిపోవడం ఆయన, పార్టీ కూడా తీరని అప్రదిష్ట మూటగట్టుకొన్నారు.
అక్రమాస్తుల కేసులో జయలలితని కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఆమె మళ్ళీ ఉపఎన్నికలలో పోటీ చేసి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేరు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన దోషి రామలింగారాజుకి బెయిలు మంజూరు అవడంతో ఆయన జైలు నుండి విముక్తి లభించింది.
డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్-డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య అధికారుల నియామకం విషయంలో యుద్ధం జరిగింది. ఆ తరువాత మళ్ళీ తాజాగా ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ-డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. కేజ్రీవాల్ తనపై నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
మళ్ళీ చాలా దశాబ్దాల తరువాత జూన్ తొమ్మిదవ తేదీన భారత్ భద్రతా దళాలు విదేశీ భూభాగంలోకి (మయన్మార్) ప్రవేశించి నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పన్నెండేళ్ళుగా సాగుతున్న వ్యాపం కుంభకోణంలో ఇంతవరకు 2,500 మంది అరెస్ట్ కాగా, ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కూడా ఈ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణంలో ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ తో సహా ఇంతవరకు 47మంది అనుమానాస్పదస్థితిలో మరణించారు. వ్యాపం కుంభకోణంపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకొన్న మహాకూటమి చేతిలో బీజేపీ ఓడిపోయింది. నితీష్ కుమార్ మళ్ళీ బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టారు. తొమ్మిదవ తరగతి కూడా పాస్ అవని లాలూ చిన్న కొడుకు తేజస్వీ ప్రసాద్ యాదవ్ బిహార్ ఉపముఖ్యమంత్రి అయ్యేడు.
జూలై 27వ తేదీన పంజాబ్ లో పాక్ ఉగ్రవాదులు దాడులు చేసారు. వారి దాడిలో తొమ్మిది మంది పౌరులు మరణించారు. సరిగ్గా అదే రోజున భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి చెందారు. ముంబై దాడుల సూత్రధారి యాకూబ్ మీమన్ ని నాగపూర్ జైల్లో ఉరి తీశారు. ఆగస్ట్ ఆరవ తేదీన పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ సజీవంగా పట్టుబడ్డాడు.
వ్యాపం కుంభకోణం, లలిత్ మోడీ వ్యవహారాలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు, విదేశంగా మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామాలకు పట్టుబడుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పార్లమెంటుని స్తంభింపజేసాయి. మళ్ళీ ఆ తరువాత జరిగిన పార్లమెంటు సమావేశాలను మత అసహనం, నేషనల్ హెరాల్డ్ కేసుల కారణంగా స్తంభింపజేసింది.
సానియా మీర్జాకి ప్రతిష్టాత్మకమయిన ఖేల్ రత్న అవార్డు అందుకొన్నారు. బీసిసిసి మాజీ అధ్యక్షుడు దాల్మియా కన్నుమూసారు. ఆయన స్థానంలో శాశాంక్ మనోహర్ అధ్యక్షుదిగా ఎన్నికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కోరుతూ హార్దిక్ పటేల్ ప్రారంభించిన ఉద్యమం హింసాయుతంగా మారింది. ప్రస్తుతం అతని వివిధ పోలీస్ కేసులను ఎదుర్కొంటున్నాడు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ స్వాతంత్ర్య సంగ్రామ పోరాట యోధుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్ కి సంబంధించిన రహస్య ఫైళ్ళను బయటపెట్టింది. కేంద్రప్రభుత్వం తన అధీనంలో ఉన్న రహస్య ఫైళ్ళను కూడా బయటపెట్టబోతోంది. మాజీ సైనికులకు ఒకే హోదా-ఒకే పెన్షన్ పధకాన్ని కేంద్రప్రభుత్వం ఆమోదించింది.
మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వంలో ఓడిడుకులు ఏర్పడ్డాయి. ఆ తరువాత అవి కొంత సర్దుకొన్నప్పటికీ, నేటికీ అవి అప్పుడపుడు ఏదో రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ప్రకటించిన నల్లదనం వెలికితీత పధకంలో భాగంగా విదేశాలలో నల్లదనం దాచుకొన్నవారు అనేకమంది స్వచ్చందంగా ఆ వివరాలను ప్రకటించి రూ. 3370 కోట్లు జరిమానాలు చెల్లించారు. నిర్భయ కేసులో బాలనేరస్తుడు విడుదలయ్యాడు. అందుకు ప్రజలు తీవ్ర నిరసనలు తెలుపడంతో బాల నేరస్తుల వయసును 18 నుండి 16కి తగ్గిస్తూ బాలనేరస్థుల చట్టానికి సవరణలు చేసి పార్లమెంటు ఆమోదించింది.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధాని రూ.80,000 కోట్ల ఆర్ధిక ప్యాకేజీ మంజూరు చేసారు. అంతకు ముందు బిహార్ కి రూ.1.25 కోట్ల ఆర్ధిక ప్యాకేజీ, ఆ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి మరో రూ.40, 000 కోట్లు మంజూరు చేసారు. 2015సం. తమిళనాడుకి ఒక పీడ కలని మిగిల్చింది.
కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన బారీ వర్షాలలో చెన్నై నగరం నీట మునిగింది. అనేక వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. సుమారు 542 మందికి పై ప్రజలు మరణించారు. దేశంలో ఉన్నత విద్యావంతులయిన యువకులు ఐసిస్ ఉగ్రవాద సంస్థలలో చేరేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. భారత్ తొలి బులెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్-జపాన్ దేశాల మధ్య ఒప్పందం జరిగిందిఅమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళిన 14మంది భారత్ విద్యార్ధులను అమెరికా అధికారులు వెనక్కి తిప్పి పంపేశారు. ప్రధాని నరేంద్ర మోడి ఆకస్మికంగా పాకిస్తాన్ వెళ్ళడం చాలా సంచలనం సృష్టిస్తోంది. రూ.10 లక్షల వార్షికాదాయం గలవారికి జనవరి 2016 నుండి గ్యాస్ సబ్సిడీ ఇవ్వరాదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.