రాహుల్‌గాంధీతో పీకే మీటింగ్.. రేవంత్‌రెడ్డికి మరో రూట్‌క్లియర్!
posted on Jul 13, 2021 @ 7:30PM
ప్రశాంత్‌కిశోర్ ఏం చేసినా సంచలనంగా మారిన రోజులివి. వరుస విజయాలతో పొలిటికల్ లీడర్లకంటే ఎక్కువే పాపులారిటీ తెచ్చుకున్నారు పీకే. పలు రాష్ట్రాల్లో పలు పార్టీలను గెలిపించి.. తాను నెంబర్‌వన్ స్ట్రాటజిస్ట్ అని నిరూపించుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల తర్వాత ఇక తన పనికి స్వస్తి పలుకుతానంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చి.. అంతలోనే ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ రాజకీయ చాణక్యం నెరపడం కంటిన్యూ చేస్తున్నారు. ఎన్సీపీ నేత శరద్‌పవార్‌తో వరుస భేటీలు.. రాహుల్‌గాంధీని ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రకటనల తర్వాత.. తాజాగా మరో కీలక ముందడుగు వేశారు ప్రశాంత్ కిషోర్.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ నివాసానికి వెళ్లి ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు. తాజా రాజకీయాలు, పార్టీల పొత్తులు, రాజకీయ సమీకరణాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది, వచ్చే ఏడాది జరిగే మరికొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉండనున్నాయి.. ఆ ప్రభావం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నది తదితర కీలక అంశాలు రాహుల్‌గాంధీ ప్రశాంత్ కిశోర్ వివరించినట్టు సమాచారం. పీకే భేటీ సమయంలో రాహుల్‌తో పాటు ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, హరీశ్ రావత్ తదితరులు ఉన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ప్రశాంత్ కిశోర్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఇటీవల శరద్ పవార్, యశ్వంత్‌సిన్హా ఆధ్వర్యంలో జరిగిన మూడో కూటమి సన్నాహక సమావేశంపైనా పీకే పెదవి విరిచారు. బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి మనుగడ సాధించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా, సత్తువ కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని.. అందుకే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికే మోదీని గద్దె దించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు ప్రశాంత్‌కిశోర్. అయితే, యూపీఏ అధికారంలోకి రావాలంటే రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే ప్రయోజనం ఉంటుందని గట్టిగా వాదిస్తున్నారు. అందుకే, రాహుల్‌ను పీఎం కేండిడేట్‌గా చేసేందుకు వరుస భేటీలతో పీకే ముందస్తు కసరత్తు ముమ్మరం చేశారని అంటున్నారు.
అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ లైట్ వెలిగినట్టు.. రాహుల్ కోసం ఢిల్లీలో పీకే చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ రాజకీయాల్లోనూ విశేష ప్రభావం చూపనున్నాయి. రాహుల్‌గాంధీకి రేవంత్‌రెడ్డి ఫుల్ క్లోజ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్-రేవంత్‌లు కలిసి పని చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రేవంత్‌రెడ్డి సుడిగాలి ప్రచారం చేసేందుకు ఆయన కోసం రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ కూడా అరేంజ్ చేశారంటే రేవంత్‌ను రాహుల్ ఎంతగా నమ్ముతున్నారో తెలుస్తుంది. ఇప్పటి తెలంగాణ సీనియర్లంతా సోనియాగాంధీ బ్యాచ్ అయితే.. రేవంత్‌రెడ్డి మాత్రం రాహుల్‌గాంధీ మనిషి. రేవంత్ టాలెంట్‌ను గుర్తించి, ఆయన నాయకత్వాన్ని ప్రమోట్ చేసేలా.. కాంగ్రెస్‌లో చేరిన కొద్దికాలానికే ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది రాహుల్‌గాంధీనే. తాజాగా, పీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ ఎంపికలో రాహుల్‌గాంధీ ప్రమేయం ఉందని తెలుస్తోంది. సో.. ఆ లెక్కన.. ప్రశాంత్‌కిశోర్ ప్రయత్నాలు ఫలించి.. 2024లో రాహుల్ ప్రధాని అయితే.. రేవంత్‌రెడ్డికి మరోసారి ప్రమోషన్ గ్యారెంటీ.
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బలం వెయ్యింతలు పెరగడం.. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటం.. రేవంత్‌కు బిగ్ అడ్వాంటేజ్. రాహుల్‌గాంధీని ప్రధాని చేసే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ కోసం ప్రశాంత్‌కిశోర్ పన్నే వ్యూహాలు, వేసే ప్రణాళికలు.. తెలంగాణలోనూ అమలు చేస్తారు. అవి ఫలిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తే.. రాహుల్‌గాంధీ మనిషిగా రేవంత్‌రెడ్డికే ముఖ్యమంత్రి పీఠం పక్కా అంటున్నారు. పీసీసీ పదవిలా సీనియర్లు కిరికిరి పెట్టే అవకాశమే లేదంటున్నారు. ఎందుకంటే.. ప్రధాని రాహుల్ అయితే.. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా రేవంత్‌కే సీఎం సీటు కట్టబెడతారని అంటున్నారు. ఈ మాట ఇప్పుడే అంటే రేవంత్‌కు కోపం వచ్చినా.. అభిమానులు నినాదాలు చేస్తున్నట్టే.. రేవంత్‌రెడ్డి సీఎం అవడం ఖాయంగా కనిపిస్తోంది. సో, ఢిల్లీలో రాహుల్ కోసం పీకే చేస్తున్న ప్రయత్నాలు.. తెలంగాణలో రేవంత్‌రెడ్డికీ కలిసిరానున్నాయి.. ప్రస్తుతానికి అన్నీ శుభశకునాలే.. ముందుందంతా మంచికాలమే...!