రేవంత్ దారిలో కారు, కమలం కీలక నేతలు? కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీస్..
posted on Jul 13, 2021 @ 6:35PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో జోష్ లోకి వచ్చిన కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ నుంచి నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు సంజయ్ , మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన సీనియర్ నేత గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ ను కలిసి పార్టీలోకి వస్తానని తెలిపారు. గండ్ర సత్యనారాయణ గతంలో టీఆర్ఎస్ లో పని చేశారు.
తనను కలిసిన నేతలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు చెప్పారు. టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. ఆ తరువాత సీఎం కేసీఆర్ తన పార్టీలోకి తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కౌశిక్‌రెడ్డి చిన్న పిల్లవాడన్న రేవంత్ రెడ్డి.. ఆ మాటలు అతనివి కావన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడించారని చెప్పారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించబోమని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ తో తో కౌశిక్ రెడ్డి టచ్‌లో ఉన్న విషయం తనకు ముందే తెలుసన్నారు. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందని తాను అనుకోవడం లేదన్నారు రేవంత్ రెడ్డి. హుజూరాబాద్‌లో అధికార పార్టీకి అభ్యర్థి లేనందునే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారన్నారు.
మరోవైపు పీసీసీ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణలు చేసిన పాడి కౌశిక్ రెడ్డికి ఏఐసిసి ఇన్చార్జి మణికం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజులలో భేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీస్ లో పేర్కొన్నారు మనిక్కమ్ ఠాగూర్. లేనిపక్షంలో ఒక కోటి రూపాయల పరువు నష్టపరిహారం తోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇటీవలే తనపై ఇలాంటి ఆరోపణలే చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కూడా లీగల్ నోటీస్ పంపారు మాణిక్కం ఠాగూర్.